Devotional

అష్టాదశ శక్తి పీటం ‘చాముండే ‘ – TNI ఆధ్యాత్మికం

అష్టాదశ శక్తి పీటం ‘చాముండే ‘  – TNI ఆధ్యాత్మికం

1. కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో మైసూరు ప్యాలెస్కు 13 కి.మీ. దూరంలో చాముండే అనే కొండపైన ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో ప్రసిద్ది చెందిన శక్తిపీఠం చాముండేశ్వరీ శక్తిపీఠం. ఈ శక్తిపీఠం 18 శక్తి పీఠాలలో నాల్గవదిగా ప్రసిద్ధి చెందింది.
ప్రాచీనకాలంలో ఈ ప్రదేశాన్ని క్రౌంచపట్టణమని, మరియు మహిషాసుర మండలం అని పిలిచేవారు. అశోకుని పాలనలో ఈ ప్రాంతానికి మహిషాసుర మండలం అని పిలిచినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ క్షేత్రం సుమారు 2000 సంవత్సరాల ప్రాచీనమైనదని, చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూంది.
*18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణగాథ వున్నది. దక్షప్రజాపతి, మహాయజ్ఞం సంకల్పించి ఆ కార్యకమానికి ఋషులను, మునులను దేవతలను, ఆహ్వానించి కూతురినీ, అల్లుడినీ ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (పార్వతి దేవి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. అప్పుడు సతీదేవి (పార్వతి దేవి) తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిపడుతుంది. పార్వతీ దేవి పుట్టింటివారు నన్ను ప్రత్యేకంగా పిలవాలేమిటి అని ఈశ్వరుడు చెప్పిన వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని తన తండ్రి చేస్తున్న యజ్ఞస్థలానికి వెళుతుంది. అక్కడ దక్షప్రజాపతి సతి దేవిని అవమానించారు. ముఖ్యంగా శివానంద భరించలేక అక్కడే ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఇది తెలుసుకున్న ఈశ్వరుడు అక్కడికి వచ్చి రుద్రరూపంలో కాలభైరవుని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. సతీ వియోగదుఃఖం తీరని పరమేశ్వరుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. అప్పుడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఛేదించి వానిని భూమిమీద పడేటట్లు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఉద్భవించాయని మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి. సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలకు పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి.
*స్థల పురాణం
ఇక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు. చాముండేశ్వరీ దేవి గురించి ఒక పురాణగాథ వుంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడుండేవాడు. అతను కఠోరమయిన తపస్సు చేసి పరమేశ్వరుడి నుండి ఒక వరాన్ని పొందుతాడు. పురుషుల చేతులో మరణించకుండా వుండడమే ఆ వరం. ఆ వరం సాధించిన గర్వంతో, మహిషాసురుడు దేవతల పట్ల చాలా క్రూరంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తాడు. అతను ఇంద్రుడిని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. ఈ పరిణామాలవల్ల భయభ్రాంతులయిన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వేడుకుంటే వారు మహిషాసురుని వధించడానికి ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు. ఆమెయే చాముండేశ్వరి. 18 చేతులతో, ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ మహాశక్తి వెలుస్తుంది. ఆమెయే మహిషాసురమర్దిని. ముందు, చండ, ముండ అనే మహిషాసురుని సేనాధిపతులను చాముండేశ్వరి వధిస్తుంది. ఆ తర్వాత చాముండేశ్వరి మహిషాసురుని వధించి మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లే మార్గంలోనే మహిషాసురుడి విగ్రహం వుంది. ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం కన్పిస్తుంది.
* చాముండేశ్వరీ దేవాలయం చుట్టూ విశాలమయిన ఖాళీస్థలం వుంది. దేవాలయానికి గోపురద్వారంలో నుండి వెళ్లాలి. గోపురం పదంతస్తులు వుంది. ప్రతి గోపురం మీద చాముండేశ్వరి శిల్పం చూడవచ్చు. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు వుంది. ఇక్కడి ఈ దేవత కాళి, దుర్గా మరియు చాముండి కలయిక అని చెబుతారు. ఈ ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు ప్రజలకు తెరిచి ఉంటుంది..

2. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి కల్యాణం, సత్యనారాయణ వ్రతం వంటి అర్జితసేవల్లో పాల్గొన్నారు. ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

3. తిరుమలేశుడి సేవలో హైకోర్టు సీజే
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

4. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో దాదాపు పదిరోజుల తర్వాత భక్తుల రద్దీ తగ్గింది. ఈ నెల 9వ తేదీ నుంచి కొండపై రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 12వ తేదీన భక్తుల మధ్య తోపులాటలు కూడా జరిగాయి. కాగాఅదే రోజు నుంచి టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్ల జారీ పద్ధతిని రద్దు చేసి.. పూర్వంఉన్న టోకెన్‌ రహిత దర్శనాలను మొదలుపెట్టినప్పటి నుంచి తిరుమలలో రద్దీ అధికంగా కొనసాగుతూనే వచ్చింది. కాగఈ రద్దీ ఆదివారం ఉదయానికి భారీగా తగ్గింది

5. శ్రీకాళహస్తి, కాణిపాకం ఈవోల బదిలీ
అర్హత లేకుండా నియమితులైన ఈవోల వ్యవహారంలో దేవదాయశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. న్యాయస్థానంలో విచారణ నేపథ్యంలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఈవోలను బదిలీ చేసింది. రెవెన్యూశాఖ నుంచి వచ్చిన వారిని తొలగించి వెనక్కి పంపుతూ ఆదేశాలు జారీచేసింది. నిబంధనల ప్రకారం ప్రధాన ఆలయాలకు జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులనే ఈవోలుగా నియమించాలి. ఒకవేళ రెవెన్యూ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకుంటే స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను ఈవోలుగా నియమించాలి. కానీ శ్రీకాళహస్తి ఈవోగా డిప్యూటీ కలెక్టర్‌ పెద్దిరాజును, కాణిపాకం ఈవోగా డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశులను దేవదాయశాఖ కొన్ని నెలల కిందట నియమించింది. వీరి నియామకం నిబంధనలకు విరుద్ధమని కొందరు కోర్టులో పిటిషన్‌ వేశారు. అర్హత లేని అధికారుల నియామకంపై కోర్టు తప్పుపట్టే అవకాశం ఉందని గుర్తించిన దేవదాయశాఖ ఇద్దరినీ బదిలీ చేసింది. వారితోపాటు కర్నూలు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణా ప్రతా్‌పను బదిలీ చేసి ఆ స్థానంలో డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌ను నియమించింది. అర్హత లేని వారిని తొలగించే క్రమంలో శ్రీశైలం ఈవోను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

6. కాళీయమర్ధనాలంకారంలో ఒంటిమిట్ట రాముడు
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కాళీయమర్థినీ అలంకారంలో స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఉదయం కోదండరాముడికి గ్రామోత్సవం, స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. రాత్రి కోదండరాముడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

7. ముగిసిన సలేశ్వరం ఉత్సవాలు
నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని సలేశ్వరంలో లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. లింగమ దేవరను దర్శించుకునేందుకు చివరిరోజు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అడవి దారిలో, పెద్ద బండరాళ్ల మీదుగా, చేతికర్రలు ఊతంగా భక్తులు స్వామి సన్నిధికి చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు… నల్లమల అందాలను, లింగమ దేవర సన్నిధిలోని జలపాతాన్ని, కొండలను ఫొటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో స్వామి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. గతంలో ఐదు రోజులు సాగిన ఉత్సవాలను ఈసారి మూడు రోజులకు కుదించడం పట్ల ప్రకృతి ప్రియులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్సవాలను మరో రెండు రోజులు పొడిగించాలని కోరారు. కాగా… లింగమయ్య ఉత్సవాల్లో ఆదివారం అపశ్రుతి చోటుచేసుకుంది. అకాలవర్షం పడటంతో క్షేత్రంలోని కొండచరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసు, అటవీ శాఖ సిబ్బంది లోయలోకి వెళ్లి గాయపడిన వారిని అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. గాయపడినవారిలో అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన విజయలక్ష్మి, నాగర్‌కర్నూల్‌కు చెందిన శివ, నల్లగొండకు చెందిన సూర్యనారాయణ ఉన్నారు. వారిని 108 అంబులె న్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

8. అమర్‌నాథ్‌ యాత్రకు 33,795 మంది
దక్షిణ కశ్మీర్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌ యాత్రకు ఇప్పటిదాకా 33,795 మంది భక్తులు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. 43 రోజులపాటు సాగే ఈ యాత్ర జూన్‌ 30న ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఇప్పుడు పూర్తిస్థాయిలో యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర కోసం భక్తులు 22,229 మంది ఆన్‌లైన్‌లో, 11,566 మంది ఆఫ్‌లైన్‌లో టికెట్లు నమోదు చేసుకున్నారు.

9. లడ్డూ విక్రయాల్లో అవినీతి.. యాదాద్రిలో భక్తుల ఆరోపణ
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టికెట్‌ లేకుండానే లడ్డూ ప్రసాద విక్రయాలు జరుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా ప్రసాదం కౌంటర్ల సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దైవదర్శనం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఇష్టపడేది లడ్డూ, పులిహోర ప్రసాదం. ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రధానాలయం ప్రారంభమయ్యాక భక్తులు అధికంగా తీసుకెళ్తున్నారు.ప్రసాదం కొనుగోలుకు భక్తులు ఒక కౌంటర్‌లో డబ్బులు చెల్లించగానే టికెట్‌ ఇవ్వాల్సి ఉం టుంది. ఆ టికెట్‌ తీసుకుని మరో కౌంటర్‌ వద్దకు వెళ్లి ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం ఎన్ని ప్రసాదాలు తీసుకుంటే అన్ని టికెట్లివ్వాల్సి ఉంటుంది. కానీ కౌంటర్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి టికెట్లు ఇవ్వకుండా లడ్డూ ప్రసాద విక్రయాలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.

10. టీటీడీలో ‘క్లీన్‌ కుకింగ్‌’ లడ్డూ!
‘క్లీన్‌ కుకింగ్‌’ విధానంలో తిరుమల లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసేందుకు కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌(ఏపీఎస్‌ఈసీఎం)కు బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే తాజాగా ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి 6.68 టన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వెలెంట్‌ (ఎంటీవోఈ) ఇంధన ఆదాకు అవకాశం ఉందని, దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్‌ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాల కోసం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
****టీటీడీకి బీఈఈ సహకారం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పవిత్ర లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్‌ కుకింగ్‌ విధానం ఉపయోగించడం ద్వారా కార్బన్‌ ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని బీఈఈ అందిస్తుంది. టీటీడీ సహకారంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను ఏపీఎస్‌ఈసీఎం పంపించాలి. ఈ విధానంలో ప్రసాదం తయారీకి కార్బన్‌ ఉద్గారాలను విడుదల చేసే గ్యాస్‌కు బదులు ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను ఉపయోగిస్తారు. కొద్ది రోజుల క్రితం మేము తిరుమలలో పర్యటించాం. ఆ సందర్భంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ కుకింగ్, ఆస్పత్రులు, భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డికి సూచించాం. ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్ల స్థానంలో విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లను అమర్చాలని చెప్పాము. ఇందుకోసం ఇప్పటికే ఏపీఎస్‌ఈసీఎం టెండర్లు ఆహ్వానించింది.
*****విద్యుత్‌ బిల్లులు ఆదా
టీటీడీలో ఏపీఎస్‌ఈసీఎం ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఎనర్జీ ఆడిట్‌ను బీఈఈ నిర్వహించింది. ఇక్కడ ఏటా 68 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉండగా, 30% పునరుత్పాదక ఇంధనం, 70% సంప్రదాయ విద్యుత్‌ ఉంది విద్యుత్‌ బిల్లుల కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు వెచ్చిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యల ద్వారా ఇందులో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 213 నీటి పంపుసెట్లలో 118 ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చడం వల్ల ఏటా 4.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. టీటీడీలో ఇదివరకు రోజుకు 34 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ఇప్పుడు అది 44 లక్షల గ్యాలన్లకు చేరింది. ఈ దృష్ట్యా జల వనరుల సమర్థ నిర్వహణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం.
****పెట్టుబడుల సద్వినియోగం
దేశంలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల మేర ఇంధన సామర్థ్య పెట్టుబడులకు అవకాశముంది. ఏపీ ఇప్పటికే ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగంలో దేశంలో ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. అందువల్ల ఇంధన సామర్థ్య పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ క్రీయాశీలకంగా వ్యవహరించాలి. దీని వల్ల పరిశ్రమలు, రవాణా, విద్యుత్, భవన నిర్మాణం వంటి కీలక రంగాలలో ఇంధన వినియోగ సామర్థ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనను మెరుగు పరచవచ్చు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కార్బన్‌ మార్కెట్ల(ఎన్‌సీఎం) అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై బీఈఈ ఒక నమూనా కార్యాచరణ తయారు చేసింది. దీనిపై ఏపీ తరుఫున అభిప్రాయాలు, సూచనలు తెలపాల్సిందిగా ఏపీఎస్‌ఈసీఎంకి సూచించాం.

11. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ, కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణస్వామివారి వత్రం వంటి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

12. వైభవంగా కోదండరాముడి చక్రస్నానం
ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు లక్ష్మణ సమేత సీతారాములను పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు టీటీడీ అర్చకులు ధ్వజావరోహణం నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. మంగళవారం సాయంత్రం స్వామికి పుష్పయాగం నిర్వహించనున్నారు.

13. భ్రమరాంబాదేవి అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి అర్చకులు వైభవంగా కుంభోత్సవం నిర్వహించారు. కుంభోత్సవం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జితసేవలతో పాటు కళ్యాణం, ఏకాంతసేవ తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఈవో లవన్న తెలిపారు. అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడికాయలు, కొబ్బరి, నిమ్మకాయలను అధికారులు సమర్పించారు. సాయంత్రం అన్నాభిషేకం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. తిరిగి రాత్రి 7 నుంచి భక్తులకు అమ్మవారి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. దేవాదాయ చట్టం అమలులో భాగంగా జంతు పక్షు బలులు శ్రీశైలంలో నిషేధించారు.

14. శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఫోర్జరీ సిఫార్సు లేఖలు వస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ నకిలీ సిఫార్సు లేఖతో వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ సిఫార్సు లేఖతో వచ్చిన యాదయ్యపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.