Politics

తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు – TNI రాజకీయ వార్తలు

తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు – TNI రాజకీయ వార్తలు

* జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. జనసేనది విలువలతో కూడిన రాజకీయమని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు మనోహర్ తెలిపారు. ఆర్థిక సాయం చెక్కులు పవన్‌ అందిస్తారని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

*నెల్లూరు కోర్టులో ఫైల్స్‌ దొంగతనంపై స్పందించిన మంత్రి కాకాణి
కోర్టులో ఫైల్స్‌ దొంగతనంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఫైల్స్‌ చోరీ వెనుక కుట్ర ఉందన్నారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే నన్ను బద్నాం చేయడానికే… కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఆరోపణ చేసేవారు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయాలన్నారు. సీబీఐ విచారణను తాను స్వాగతిస్తానన్నారు.
మాజీ మంత్రి అనిల్‌కుమార్‌తో తనకు విభేదాలు లేవని మంత్రి కాకాణి అన్నారు. అందరినీ కలుస్తామని, ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పుడు విద్రోహులు ప్రవేశిస్తారన్నారు. తన ప్లెక్సీలు చించి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై… అలాగే అనిల్‌ ప్లెక్సీలు చించి తనపై ఆరోపణలు చేస్తారన్నారు. ఆనం వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

*ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయి: గోరంట్ల
నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది పాలకుడు కావడంతో ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు, ఆర్థికాంశాలు ముడిపెడితే మిగిలేది సంక్షోభమేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. సంక్షేమం పేరుతో చేస్తున్న అప్పులతో ఏపీ దివాళా అంచులకు చేరిందన్నారు. ఇప్పటి వరకు ఏపీపై ఉన్న మొత్తం అప్పు రూ. 7.76 లక్షల కోట్లు అన్నారు. అంతసొమ్ము దేనికి ఖర్చుపెట్టారంటే పాలకులవద్ద సమాధానంలేదన్నారు. శ్రీలంకలో ఉన్న పరిస్థితులు మక్కీకి మక్కీ ఏపీలో ఉన్నాయన్నారు.ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకూడదని కోరుకుంటున్నామని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. బటన్లు నొక్కుతూ కూర్చుంటున్న సీఎం జగన్ ఎంత సొమ్ము ప్రజలకు ఇచ్చారంటే నీళ్లునములుతున్నారని విమర్శించారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు.. ప్రజలకు విద్యుత్ కోతలు మిగిల్చారు. యువత మత్తులోజోగితే, తన ఆటలు యథేఛ్చగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టున్నారన్నారు. వాలంటీర్లను నియమించింది…రాష్ట్రాన్ని రేప్‌ల రాజ్యం చేయడానికా? అని ప్రశ్నించారు. నగదు బదిలీ పథకంతో ప్రజలు అడుక్కుతింటుంటే, ముఖ్యమంత్రికి ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో అప్పులపై కేంద్రం జోక్యంచేసుకోవాలన్నారు. గవర్నర్ ఉత్సవ విగ్రహం పాత్రకు పరిమితం కావడం బాధాకరమన్నారు. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ రూ. 50 వేల కోట్ల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులోని సాక్ష్యాలు మాయమైతే, ఎస్పీ చిలుక పలుకులు పలుకుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.

*భూముల రీసర్వేపై సీఎం నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు: మంత్రి సాయిప్రసాద్‌
భూముల రీసర్వేపై సీఎం నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి సాయిప్రసాద్‌ తెలిపారు. ప్రతీ 30 ఏళ్లకు ఒకసారి రీసర్వే చేయాల్సి ఉందని మంత్రి సాయిప్రసాద్‌ చెప్పారు. కానీ బ్రిటీషర్లు చేసిన తర్వాత మళ్ళీ భూసర్వే చేయలేదని మంత్రి సాయిప్రసాద్‌ పేర్కొన్నారు. గట్టు తగాదాలు వస్తాయనే ఇప్పటి వరకు దాని ముట్టుకోలేదని, విలేజ్ మ్యాప్ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సాయిప్రసాద్‌ పేర్కొన్నారు.

*తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు: నాదెండ్ల మనోహర్‌
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. జనసేనది విలువలతో కూడిన రాజకీయమని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు మనోహర్ తెలిపారు. ఆర్థిక సాయం చెక్కులు పవన్‌ అందిస్తారని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

*ఖమ్మం రావద్దనే దమ్ము ఎవరికీ లేదు: రేణుకా చౌదరి
గవర్నర్‌ పర్యటనలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వానికి అధికారులు తొత్తులుగా మారారని విమర్శించారు. బీజేపీ నేత చనిపోతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్‌తో వ్యాపార భాగస్వామిగా చెప్పుకునే పువ్వాడ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఖమ్మం సూసైడ్ కేసులో మంత్రిని ఎ-1 గా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిని ఖమ్మం రావద్దనే దమ్ము ఎవరికీ లేదన్నారు.

*తన భాషతో బాల్కా సుమన్ పరువు తీస్తున్నాడు: బీజేపీ నేత
టీఆర్ఎస్ హాయాంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ అరాచకల వలనే బీజేపీ కార్యాకర్త సాయిగణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. తన భాషతో బాల్కా సుమన్ ఉస్మానియా యూనివర్సిటీ పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరకీ పీకేనే రాజకీయ సలహాదారు అని పేర్కొన్నారు.

*చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటా: జేసీ ప్రభాకర్రెడ్డి
చంద్రదండు ప్రకాష్ నాయుడుపై రౌడీషీట్‌ ఓపెన్ చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినా భయపడబోనని జేసీ స్పష్టం చేశారు. చంద్రబాబును సీఎం చేసిన తర్వాత.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినా భయపడబోనని … తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో చంద్రదండు ప్రకాష్‌ నాయుడును ఆయన కలిశారు. కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై న్యాయవిచారణ జరిపించాలని నిరసనలు చేస్తే చంద్రదండు ప్రకాష్ నాయుడుపై రౌడీషీట్‌ ఓపెన్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మరింత పని చేస్తానని చెప్పారు. చంద్రబాబు సీఎం అయినా తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.

*పోలీస్ వ్యవస్థ ‘సవాంగ్ మార్క్’ పోలీసింగ్ నుంచి బయటపడాలి: వర్ల రామయ్య
రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ‘సవాంగ్ మార్క్’ పోలీసింగ్ నుంచి బయటపడాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విటర్ వేదికగా సూచించారు. ప్రశ్నించే వారిపై 153 (A) IPC కేసులు మానాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు 153(A) పై విశ్లేషించిన విధానాన్ని పొలీసుశాఖ ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పొలీసులు వ్యవహరించకూడదని… నిష్పక్షంగా వుండాలని వర్ల రామయ్య కోరారు.

*జగన్‌కు ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు: బాలినేని
సీఎం జగన్ ఆలోచనా పరుడని… ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎవరో బెదిరిస్తే మంత్రి పదవి ఇచ్చే వ్యక్తి జగన్ కాదని.. సోనియా గాంధీనే ఎదిరించారన్నారు. ఒకరికి లొంగే వ్యక్తి కాదన్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న సమయంలో 1700 కోట్లు అవినీతి చేశానని టీడీపీ నాయకులు ఆరోపించారన్నారు. తనపై చేసిన ఆరోపణలకు చర్చకి సిద్ధమని బాలినేని ప్రకటించారు.

* ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క: మంత్రి రోజా
నిన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమై మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్ఛా. నేడు మంత్రిగా నగరికి రావడం మీరిచ్చిన వరంగా భావిస్తానని మంత్రి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టాక మొట్టమొదటగా నగరి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్కగా నా సత్తా ఏమిటో చూపిస్తానని పేర్కొన్నారు. సీఎం జగన్‌ నాకు కేటాయించిన పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో దృష్టి పెడతానన్నారు. నిన్నటి వరకు ఇక రోజాకు సీటు రాదని, నా పని అయిపోయిందని ఎగతాళి చేసి మాట్లాడిన వారి నోర్లు మూయించే విధంగా ఇక్కడి ప్రజలు తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించార’న్నారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని, నా కంఠంలో ప్రాణమున్నంత మీ వెంటే ఉంటానన్నారు. 2024లోనూ జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, వార్‌ వన్‌ సైడేనని పేర్కొన్నారు.

*తల్లుల కడుపుకోతకు సమాధానం చెప్పండి: అనిత
తిరుపతి రుయా, కడప రిమ్స్‌లతో సహా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో జరిగిన శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కడప రిమ్స్‌లో కరెంటు కోతతో వెంటిలేటర్‌ పనిచేయక ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడగా, తిరుపతి రుయాలో వారం వ్యవధిలో 16 మంది పసిబిడ్డలు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు.

*ప్రశ్నిస్తే కేసా..!: లోకేశ్‌
‘‘ఇంత పిరికివాడివేంటి జగన్‌రెడ్డీ? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే… ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావ్‌. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మరో కేసు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆయన సోమవారం ఓ ప్రకటన చేశారు. ‘‘నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నాపై కేసుల్లేవు. ప్రజలపక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులున్నాయి. బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలబడితే 12 కేసులు పెట్టావు. తర్వాతేంటి? రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తావా? దేనికైనా రెడీ’’ అని లోకేశ్‌ సవాల్‌ చేశారు.

*వైసీపీ ముఖ్యులకు జిల్లాల పార్టీ బాధ్యతలు
మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ బలోపేతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. పార్టీ ముఖ్యనేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయసాయిరెడ్డికి సంస్థాగత బాధ్యతలు అప్పగించారు. తాజాగా కొడాలి నానిని కృష్ణా, గుంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి-ప్రకాశం, నెల్లూరు; మంత్రి బొత్స-శ్రీకాకుళం, విజయనగరం; వైవీ సుబ్బారెడ్డి- తూర్పుగోదావరి; మిథున్‌రెడ్డి-పశ్చిమగోదావరి; పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-చిత్తూరు, అనంతపురం; వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి- కడప, కర్నూలు; మోపిదేవిని పల్నాడు జిల్లాకు నియమించబోతున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

*బిహార్‌లో విన్న కథలు.. ఏపీలో చూస్తున్నాం: శైలజానాథ్‌
‘‘బిహార్‌లో విన్న కథలు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన గతంలో చూసిన బిహార్‌లోని ఆటవికపాలన కన్నా అధ్వాన్నంగా ఉంది’’ అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. దళిత బిడ్డలను కొట్టినా, చంపినా పట్టించుకోవడం లేదన్నారు. పోలీసుల కట్టుకథలు మరింత విస్మయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఈ నెల 20న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఏలూరు రోడ్డులోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళంకిత ప్రజాప్రతినిధులను మంత్రులుగా చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై ఈనెల 20న జరిగే సభలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్‌ కొరివి వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

*ఇప్పటికైనా మార్పు రావాలి.. రైతు ఆంజనేయులును ఆదుకోండి: పవన్
రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతు ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలని డిమాండ్ చేశారు. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను సరిచేయాలని నాలుగేళ్లు తిరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రైతు ఆంజనేయులు బలవన్మరణానికి పాల్పడ్డారని పవన్ మండిపడ్డారు. రైతుల భూముల వివరాలను పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు చేయడమే ఒక పొరపాటని.. అధికారుల ధోరణిని కచ్చితంగా తప్పుబట్టాలన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతుల క్షోభను తీర్చడంలో పాలకులు ప్రత్యేక దృష్టిపెట్టడం లేదన్నారు. రైతు ఆంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు

*కాకమ్మలు కూడా సిగ్గుపడే కథలు: టీడీపీ
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీపై అక్కడి పోలీసులు కాకమ్మలు కూడా సిగ్గుపడే కథలు చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చె ప్పిన కఽథనం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, మంత్రిని రక్షించడానికి పాత నేరస్థులను ఈ కేసులో ఇరికించినట్లు అనిపిస్తోందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో కాకమ్మ కథలు చెప్పడంలో మంత్రి కాకాణికి పెద్ద పేరు ఉందని, ఎస్పీ దానిని మించిపోయారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో మంత్రి విల్లాలో ఒక వ్యక్తి ఈ నెల 16వ తేదీన మృతి చెందితే 17వ తేదీ వరకూ దానిని బయటకు రానివ్వలేదన్నారు. ఈ రెండు ఘటనలకు మధ్యసంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

*జగన్ గొప్పలకు పోయి… : Somuveerraju
బీజేపీ అన్ని రాష్ట్రాల్లో స్వచ్చ భారత్‌ను ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. సోమవారం కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన స్వచ్చ భారత్‌లో సోమువీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో స్వచ్చ భారత్ ఎలా జరుగుతుందో పరిశీలించామన్నారు. ఏపీ‌ ప్రభుత్వం స్వచ్చ భారత్ నిధులు సవ్యంగా ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. స్వచ్చ భారత్ కరెక్ట్‌గా జరిగితే వ్యాధులు తగ్గుతాయన్నారు. దీని వల్ల వైద్య ఆరోగ్య శాఖకు వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. రేపు అంగన్ వాడీ కేంద్రాలను కూడా పరిశీలిస్తామన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.49వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన చెప్పారు.జగన్ గొప్పలకు పోయి మౌలిక వసతుల కల్పనకు రూ.32వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఎక్కడ వసతులు కల్పించారో క్షేత్ర స్థాయిలో జగన్ పరిశీలించాలని సూచించారు. మోడీ కట్టించే ఇళ్లు పూర్తి కాకుండానే పన్నులు వేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి డొల్ల ప్రకటనలు, డొల్ల ప్రభుత్వంతో ప్రజలు పాట్లు పడుతున్నారన్నారు. ‘‘ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా… 32వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలి… ఇటువంటి పరిశీలనలు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలకు వివరిస్తాం’’ అని సోమువీర్రాజు అన్నారు.

*మంత్రులు కోర్టుల్లో చోరీలు చేయించడమేంటి?
‘‘మంత్రులు కోర్టుల్లో చోరీలు చేయించడం ఏమిటి? దేశం ఎటు పోతోంది? దీనిని ఆదర్శంగా తీసుకొని ప్రతివాళ్లూ తమ కేసులు ఉన్న న్యాయస్థానాల తలుపులు బద్దలు కొడితే దేశంలో న్యాయ వ్యవస్థ బతుకుతుందా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విలేకరులతో శనివారం మాట్లాడారు. ‘‘కోర్టులో సాక్ష్యాల చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి గోవర్థనరెడ్డిపై ఆరోపణలవర్షం కురుస్తుంటే ఆయనగాని, ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎంగాని ఎందుకు మౌన వ్రతం పాటిస్తున్నారు? నెల్లూరు కోర్టులో పడిన దొంగలు ఇంకేం ముట్టుకోకుండా కేవలం కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మాత్రమే ఎత్తుకుపోవడం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పెట్టిన కేసులో మొదటి నిందితునిగా కాకాణి ఉన్నారంటూ పూర్వాపరాలను వివరించారు. సాక్ష్యాలు లేకపోతే తనపై పెట్టిన కేసు కొట్టివేస్తారన్న అభిప్రాయంతో మంత్రి ఈ పని చేయించిట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కాకాణి దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం ఆయనపై మొత్తం 25 కేసులు ఉన్నాయి. సోమిరెడ్డి పెట్టిన కేసు విచారణ రెండు నెలల్లో నెల్లూరు కోర్టులో ప్రారంభం కాబోతోంది. తాను దోషిగా తేలితే పదవి పోతుందనే భయంతోనే మంత్రి ఈ పని చేయించాడని నెల్లూరు ప్రజలు విశ్వసిస్తున్నారు. జగన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు ఎలా ఉన్నారో దీనిని బట్టే తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. చట్టం తనపని తాను చేస్తుందని సీఎం గతంలో సినిమా డైలాగులు చెప్పారని, కోర్టులో చోరీ ఘటనపై రాష్ట్రం అంతా ముక్కున వేలు వేసుకొంటే చట్టం ఇంతవరకూ మంత్రి జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

*ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయుల ఘర్షణ
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. శనివారం రాత్రి మంగళగిరిలోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన స్థానిక వైసీపీ నేత కుమార్తె వేడుకలకు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుకూల, వ్యతిరేక వర్గీయులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాత్రం హాజరు కాలేదు. రెండు వర్గాలు వారు ఎదురుపడి ఒకరినొకరు దూషించుకున్నట్టు సమాచారం. వివాహానంతరం బయటకు వచ్చి అర్ధరాత్రి సమయంలో హైవే మీద ఇరువర్గాలు గొడవపడ్డాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ నెట్టుకొని కొట్టుకున్నారు. మంగళగిరి స్టేషన్‌లో రాత్రి పదిన్నర గంటల సమయంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిసింది. తుళ్లూరు మండలంలో రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే శ్రీదేవికి ఓ వర్గం దూరంగా ఉంటోంది. ఎన్నికలప్పుడు ఆమెకు కొంత మంది ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత ఆ విషయంలోనే ఎమ్మెల్యేతో వారికి విభేదాలు వచ్చాయి. ఎన్నికలప్పుడు కష్టపడి పని చేయటమే కాకుండా డబ్బు అప్పుగా ఇచ్చామని, తిరిగి అడిగితే ఇచ్చేపని లేదని ఎమ్మెల్యే వర్గం పేర్కొంటోందని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా వీరు తీసుకువెళ్లినట్టు సమాచారం. సమస్య ఇంకా తేలలేదు. తాము ఎమ్మెల్యే తీరుతో ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా, కేసులలో ఇరికిస్తున్నారని ఈ వర్గం ఆరోపిస్తుంది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు పార్టీ నుండి గెంటివేయాలని చూడటంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొంటోంది. ఈ క్రమంలో శ్రీదేవి వ్యతిరేక వర్గానికి చెందిన మండల వైసీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శృంగారపుపాటి సందీప్‌ గతంలో తనను ఎమ్మెల్యే కేసులు పెట్టించి వేధిస్తుందని, తనకు చిన్నపిల్లలున్నారని సీఎం జగన్డ్‌ తనను కాపాడాలని మీడియా ద్వారా వేడుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్యెల్యే వ్యతిరేక, అనుకూల వర్గాలు తాజాగా రోడ్డునపడి కొట్టుకున్నాయని వైసీపీ నేతలు సైతం చెబుతున్నారు.

*తిరుపతిలో సాయిరెడ్డికి ముఖం చాటేసిన వైసీపీ ఎమ్మెల్యేలు
అధికార పార్టీలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నేత. వైసీపీ అధికారం వచ్చిన కొత్తల్లో ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఎమ్మెల్యేలు సైతం పోటీపడేవారు. ఆయన తిరుపతి వస్తే భారీ కాన్వాయ్‌ వెంట నడిచేది. అగ్ర నేతలు ఆయనతో మాట్లాడడానికి పోటీపడేవారు. అయితే గత మూడ్రోజులుగా ఆయన తిరుపతిలోనే తిష్ఠవేసినా.. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు శ్రేణులు కూడా ఆయన్ను పట్టించుకోకపోవడం వైసీపీతోపాటు రాజకీయ వర్గాలను నివ్వెరపరుస్తోంది. వైసీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండ్రోజులపాటు జాబ్‌మేళా జరిగింది. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈ నెల 15న విజయసాయిరెడ్డి తిరుపతి చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథిగృహంలో బసచేశారు. మీడియా సమావేశాలు, జాబ్‌మేళా ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఈ మూడ్రోజుల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలెవరూ ఆయన్ను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. మీడియాలేని సమయంలో ఒకరిద్దరు మాత్రమే ఆయన్ను కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదివారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌కు వచ్చి వెళ్లారు. ఆయన కూడా విజయసాయిని మాటవరసకు కూడా పలకరించలేదు. ఆదివారం తిరుపతికి వచ్చిన రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. మంత్రితో ఫొటోలు దిగి మీడియాకు కూడా విడుదలచేశారు. విజయసాయి వెంట వైసీపీ సోషల్‌ మీడియా టీం తప్ప ఇంకెవరూ కనిపించకపోవడం గమనార్హం. ఇది అధిష్ఠానం ఆదేశమా? లేక మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తి కారణమా అని రాజకీయ వర్గాలో జోరుగా చర్చ నడుస్తోంది.

*మంత్రి అంటే పదవి కాదు.. బాధ్యత: మంత్రి కాకాణి
మంత్రి అంటే పదవి కాదని, బాధ్యత అని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. మంత్రిగా అయిన తర్వాత తొలిసారి ఆయన నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రైతులు పండించే ప్రతిగింజ కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పెండింగ్‌ ప్రాజెక్టులకు పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు ఒకేసారి 5 వేల ట్రాక్టర్లు ఇస్తామన్నారు. రైతులపై చంద్రబాబు, పవన్‌వి మొసలికన్నీరని మంత్రి కాకాణి తెలిపారు.

*జగన్‌ బాదుడుపై కాలవ శ్రీనివాసులు సైకిల్‌ యాత్ర
జనంపై సీఎం జగన్‌ బాదుడుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదివారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఐదు కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర కొనసాగింది. సైకిల్‌ యాత్రలో ‘దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. వద్దు రా నాయన’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచడంతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పెంచిన చార్జీలను తగ్గించాలని శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.
*దేశంలో బీజేపీ పతనం ప్రారంభం: రాఘవులు
దేశంలో బీజేపీ పతనానికి పునాదులు పడడం ప్రారంభమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న స్థానాలను కోల్పోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని చెప్పారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ గొప్ప విజయాలేమీ సాధించలేదని కొట్టిపారేశారు. బీజేపీ పతనానికి సూచికలు వస్తుండడంతో సంఘ్‌ పరివార్‌ మళ్లీ మతోన్మాదాన్ని పైకి తీస్తోందని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకల ఊరేగింపుల్లో సంఘ్‌పరివార్‌ కార్యకర్తలు ఆయుధాలతో హల్‌చల్‌ చేశారని రాఘవులు ఆరోపించారు.

*సీనియర్లు, జూనియర్లందర్నీ కలుపుకొని వెళ్తా: మంత్రి కాకాణి
సీనియర్లు, జూనియర్లందర్నీ కలుపుకొని వెళ్తానని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కాకాణి మంత్రిగా ఎన్నుకున్నారు. మంత్రి అయిన తర్వాత ఆయన మొదటి సారి నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీమంత్రి అనిల్‌కుమార్‌ సభను పోటీ కార్యక్రమంగా అనుకోవడం లేదన్నారు. అనిల్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటున్నారని కాకాణి గోవర్దన్‌రెడ్డి చెప్పారు.