Politics

‘పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్’ – TNI రాజకీయ వార్తలు

‘పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్’ – TNI రాజకీయ వార్తలు

* సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు పార్టీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై క్షేత్రస్థాయిలో పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్ పెట్టనున్నట్లు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల పనితీరుపై అధినేత చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పని చేయకుండా మాయ చేసే నేతలకు.. ఇక చెక్ పెడతానని హెచ్చరించారు. కొంతమంది నేతలు క్షేత్రస్థాయిలో పని చేయకుండా… పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇకపై అలాంటి నేతలకు కాలం చెల్లిందన్నారు. ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు తప్పించుకుంటున్నారో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చిందన్నారు.
సీనియార్టీని గౌరవిస్తామని… అయితే ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే లాభం లేదని చంద్రబాబు అన్నారు. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తామని స్పష్టం చేశారు.పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక”సీనియార్టీని గౌరవిస్తాం.. సిన్సియార్టీని గుర్తిస్తాం. సీనియార్టీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే లాభం లేదు. ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తాం. సమాజ హితం కోసం తెదేపా అవసరం ఉంది… అందుకే విరాళాలు సేకరిస్తున్నాం. పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయవచ్చు.”పార్టీ సభ్యత్వ నమోదు: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. ఉండవల్లి గ్రామ పార్టీ నేతల ద్వారా చంద్రబాబు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వాట్స్ యాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వం పొందే అవకాశం కల్పించారు. చంద్రబాబు పార్టీకి ఆన్లైన్లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. వేదికపైనే అచ్చెన్నాయుడు, నారా లోకేశ్లు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. 100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది.”రాష్ట్రాన్ని పుననిర్మాణం చేయాలనుకునేవారు పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. తటస్థులు సభ్యత్వం తీసుకోకున్నా తెదేపా సంకల్పానికి అండగా నిలవాలి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా అండగా నిలవాలి. తటస్థులు, మేధావులు కూడా తెదేపా అండగా నిలవాల్సి ఉంది. తెలుగుదేశం తొలిసారిగా అండమాన్ శాఖను అధికారికంగా గుర్తించింది. అండమాన్‌లో పార్టీ నేతలు పసుపు జెండా ఎగిరేలా చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఏపార్టీ చేయలేనంత సాంకేతికతతో సభ్యత్వ నమోదును చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా సభ్యత్వ యాప్లో పార్టీ సభ్యత్వ నమోదును ఏ విధంగా నమోదు చేసుకునే అవకాశాలున్నాయో లోకేశ్ వివరించారు. వాట్సప్ నెంబరును తెలిపారు.

*కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతున్నారు: మంత్రి గంగుల
కేంద్ర మంత్రిగా గౌరవ ప్రదమైన స్ధానంలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ పై విషయం చిమ్మేలా, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా విమర్శలు చేస్తున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ వ్యాపారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా డిల్లీ వేదికగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను అవమానపర్చే విదంగా మాట్లాడారని అన్నారు. నూకలు బుక్కుతవా అని అవమానించిన పియూష్ గోయల్ మన రాష్ట్రం కాదు, కానీ తెలంగాణ ప్రజల ఓట్లతో డిల్లీ గద్దెపై కూసొని తెలంగాణ ప్రజల్ని అవమానించేలా కిషన్ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఎఫ్ సిఐ, సివిల్ సప్లయ్స్ విషయాలపై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కిషన్ రెడ్డి తీరును ఎండగట్టారు.

*రైతాంగాన్ని మోసం చేస్తున్న నయవంచకుడు కేసీఆర్’
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన అని కాంగ్రెస్ నేత మధుయాష్కి అన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా రైతు ప్రయోజనం కోసమే అని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లకు కక్కుర్తి పడి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్న నయవంచకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. అంబేద్కర్ పేరు మీద ఉన్న అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చిన ఘనుడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళా గవర్నర్ పట్ల వివక్ష చూపడం సిగ్గుచేటన్నారు. బ్రాహ్మణ రాష్ట్రపతి, గవర్నర్‌కు ఒంగి దణ్ణం పెట్టిన కేసీఆర్, దళిత బలహీన వర్గానికి చెందిన రాష్ట్రపతి, గవర్నర్‌కు గౌరవం ఇవ్వకపోవడం ఆయన కుల దురహంకారానికి నిదర్శనమని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొదించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. వరంగల్‌లో జరిగే సభను విజయవంతం చేయాలని మధుయాష్కి విజ్ఞప్తి చేశారు.

*ప్రతి గ్రామంలో సభ్యత్వం చేపట్టాలి: అచ్చెన్న
ప్రతి గ్రామంలో సభ్యత్వం చేపట్టాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అచ్చెన్న మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు ఓట్లేయించే వాళ్లని సభ్యులుగా చేర్చడంలో చొరవ చూపాలని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు వస్తాయన్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగిచే పదవులు రావని.. దక్కవని తెలిపారు. గతంలో మాదిరిగా సభ్యత్వం విషయంలో ఏదేదో చెప్పాలనుకుంటే కుదరదన్నారు. సభ్యత్వం వివరాలు మొత్తం ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో వివరాలు అప్డేట్ అవుతాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

*జగన్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: ఆంజనేయులు
జగన్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్లేసిన ప్రజలను జగన్‌రెడ్డి రోడ్డుపై నిలబెడుతున్నారని మండిపడ్డారు. సీఎం కాన్వాయ్‌ కోసం ప్రయాణికుల కారును లాక్కుంటారా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి పాలనలో పోలీసులు మానవత్వం మరిచారని మండిపడ్డారు. ఒంగోలు ఘటనపై బాధితులకు డీజీపీ, సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పదవులకు రాజీనామా చేయాలని ఆంజనేయులు అన్నారు.

*క్రీడా ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేస్తాం: రోజా
రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా ప్రకటించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో వెనుకబడిపోతున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తామన్నారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని రోజా తెలిపారు. ఇటీవల పర్యటన, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

*సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్‌
ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం అధికారులు ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడమేంటని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితొచ్చిందా? అని నిలదీశారు. ప్రయాణికుల కారును పోలీసులు లాక్కోవడం దుర్మార్గమన్నారు. ఎవరి ఒత్తిడితో ప్రయాణికుల కారును తీసుకున్నారో స్పష్టతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ఏపీ ప్రభుత్వం.. సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేదా? అని ఎద్దేవా చేశారు. సహాయ అధికారిని, హోంగార్డును సస్పెండ్ చేసేసి.. ఘటనను మరుగునపడేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లుందని మండిపడ్డారు. ఒంగోలు ఘటనపై ప్రజలకు సీఎంవో వివరణ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేశారు.

*అవినీతిని సహించనని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామ
అవినీతిని సహించనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుడూ సీఎం ఇలా మాటిమాటికీ అవినీతి అంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఏపీ రాష్ట్రంలో అవినీతికి మొదటి పాయింట్ రాజకీయ నేతలే అన్నారు. అవినీతి నిర్మూలన కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి.. ‘‘ముందు మీపై ఉన్న కేసులు ఫైనల్ చేయించుకోండి.. మీ కేసులు త్వరగా పూర్తి చేయాలని కోరితే నా కాళ్లు హూనం చేశారు.’’ఒకప్పటి బిహార్ ఘటనలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అధికారం కోసం ముద్దులు పెడుతూ జనంలో తిరిగిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు తిరగాలంటే ఎందుకు భయపడుతున్నారని రఘురామ ప్రశ్నించారు.

*ఏపీలో విచ్చల విడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా: Somuverraju
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చల విడిగా జరుగుతోందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని తెలిపారు. తాము దొంగల్ని పట్టుకుంటే దొంగల ప్రభుత్వం తమపై కేసు పెట్టిందని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తినడానికి ఉపయోగపడని బియ్యం ఇస్తూ బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంత మంది మంత్రులు క్రైస్తవ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారన్నరు. ఒక మహిళా మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై కేసులు పెట్టించి ఉద్యోగం నుండి తొలగించారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ప్రతి కొండపై శిలువలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో జిన్నా సర్కిల్ పేరుని తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం వచ్చినప్పుడల్లా షాపులు మూసివేయడం కరెక్ట్ కాదన్నారు. అధికారంలో లేనప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవారని…ఇప్పుడు లోపల ఉంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం పర్యటనల కోసం బలవంతంగా కార్లు లాక్కోవడం సరికాదని సోమువీర్రాజు అన్నారు.

*సహాయం చేయాలంటూ చంద్రబాబును కోరిన వైసీపీ నేత
ఏపీలో ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు. చంద్రబాబు సీఎం పదవిలో లేరు. కానీ తనకు సహాయం చేయాలని మాజీ ప్రజాప్రతినిధి కోరారు. అది కూడా వైసీపీ నేత. ఈ ఆసక్తికర ఘటన ఏలూరు జిల్లా, నెక్కలం, గొల్లగూడెంలో జరిగింది. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా గొల్లగూడెం గ్రామం రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సభలో వైసీపీ మాజీ ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని, మద్దతు ఇవ్వాలని చంద్రబాబుకు రాంబాబు విజ్ఞప్తి చేశారు.గొల్లగూడెంలో జగనన్న ఇల్ల స్థలాల పేరుతో ఎమ్మెల్యే తనయుడు రూ. 75 లక్షలు దోచుకున్నాడని వైసీపీ నేత రాంబాబు ఆరోపించారు. వైసీపీలో ఉన్నా.. అయితే అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని, ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు సమక్షంలో టీడీపీ నేతలను కోరారు. టీడీపీ కార్యక్రమానికి రావడమే కాదు.. మాట్లాడేందుకు ప్రయత్నించడంతో రాంబాబును స్థానిక టీడీపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిని చంద్రబాబు వారించారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాంబాబుకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని సూచించారు. వైసీపీలో ఉంటూ అవినీతిపై పోరాడడం అభినందనీయమని రాంబాబును చంద్రబాబు ప్రశంసించారు.

*పని దినాల నష్టాన్ని నివారించాం : మమత బెనర్జీ
వామపక్షాల పరిపాలనలో పశ్చిమ బెంగాల్ సంవత్సరానికి దాదాపు 75 లక్షల పని దినాలు నష్టపోతూ ఉండేదని, దానిని తాము శూన్య స్థాయికి తగ్గించామని ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆమె బుధవారం మాట్లాడారు.పశ్చిమ బెంగాల్ ఎనిమిది అభివృద్ధి స్తంభాలపై పని చేస్తుందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, విద్య, సాంఘిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, వ్యాపారాన్ని సులువుగా చేయడం వంటివాటిపై ఆధారపడి పని చేస్తుందన్నారు. వామపక్షాల పరిపాలనా కాలంలో సమ్మెలు, అంతరాయాల వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 75 లక్షల పని దినాల నష్టం జరిగేదన్నారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా బిజినెస్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న తొలి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని తెలిపారు. తూర్పు భారతం, ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఆగ్నేయాసియాలకు తమ రాష్ట్రం ముఖద్వారమని తెలిపారు. నాలుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో జంగిల్ మహల్ పేరుతో రూ.72,000 కోట్లతో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం 2,483 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. షేల్ గ్యాస్ ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్సుల జారీకి ఓ విధానాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. 2023 నాటికి తమ రాష్ట్రం జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో చేరుతుందన్నారు.

*మోదీజీ.. లౌడ్‌స్పీకర్లపై జాతీయ పాలసీ తెండి: శివసేన
లౌడ్‌స్పీకర్ల వినియోగంపై జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురావాలని, ముందుగా దానిని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రలోని మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ ఎంఎన్ఎస్ నేత రాజ్‌థాకర్ ఇటీవల డిమాండ్ చేయడంతో ఆ అంశం హాట్ టాపిక్ అయింది. దీనిపై బుధవారంనాడిక్కడ మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై జాతీయ పాలసీని తీసుకువచ్చి, మొదట బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిందిగా ప్రధాని మోదీకి తమ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. చట్టాలకు కట్టుబడే మహారాష్ట్ర సైతం దాని అమలుకు కట్టుబడి ఉంటుందని చెప్పారు.

*నగదు బదిలీ వెనుక కుట్ర: సోము
‘‘రాష్ట్రంలో రేషన్‌ బియ్యానికి బదులు ప్రజలకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం వెనుక కుట్ర దాగి ఉంది. పేదలకు రేషన్‌ బియ్యం ఇవ్వకూడదన్నది ప్రభుత్వం అంతరంగంగా ఉంది. బియ్యం కావాలా… డబ్బులు కావాలా… అనే ప్రభుత్వ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఏలూరులో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఆటలాడుతోంది. నగదు బదిలీ విషయంలో ప్రజలను ఒత్తిడి చేస్తోంది. ఈ అంశంపై అధికారులు సర్వే నిర్వహిస్తే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా రేషన్‌ లబ్ధిదారులు నగదు కోరుకోరని, బియ్యమే కావాలంటారు. ప్రభుత్వం, సివిల్‌ సప్లైస్‌ అధికారులు మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారు. అక్రమ రవాణాకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులు అడ్డాగా నిలిచాయి’’ అని వీర్రాజు ఆరోపించారు.

*కేజీ బియ్యానికి రూ.38 ఇవ్వాలి: లంకా దినకర్‌
పేదలకు నాణ్యమైన బియ్యం ఇస్తామన్న జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు నగదు పేరుతో పిల్లిమొగ్గలు వేస్తోందని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తితో జగన్‌ హామీ మేరకు సన్న బియ్యం ధరను పేదలకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్ర ప్రభత్వం కిలో బియ్యంపై ఖర్చు చేస్తున్న రూ.38 చెల్లించాలన్నారు. పేదల కడుపు నింపే సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ను జగనన్న ప్రభుత్వం రూ.30వేల కోట్ల అప్పుల్లో ముంచేసి దయనీయ స్థితికి చేర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు

*ఎన్నికల్లో వలంటీర్‌ వ్యవస్థే కీలకం: ఎంపీ బెల్లాన
వలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది అందించే సేవలే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. విజయనగరం జిల్లా సంతకవిటి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం చేపట్టిన వలంటీర్ల ప్రోత్సాహక పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమన్నారు. వలంటీర్లంతా తమకు కేటాయించిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ మెరుగైన సేవలందించాలని సూచించారు. ఇకనుంచి ప్రతి వలంటీర్‌ సచివాలయాల్లో రోజుకు మూడు పూటలా హాజరు వేయాల్సిందేనని చెప్పారు. నెలలో ఏడు రోజులు సెలవు పెడితే ఇంటికి వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించారు. విధులు నిర్వహించేందుకు ఏ వలంటీరైనా విముఖత ప్రదర్శిస్తే స్వచ్ఛందంగా తప్పుకోవాల్సిందేనన్నారు. రానున్న రోజుల్లో మీసేవ కేంద్రాలు కనుమరుగు అవుతాయని, రెవెన్యూ, పరిపాలన, ధ్రువీకరణ పత్రాల జారీ, బిల్లుల వసూళ్లు వంటి అనేక కార్యక్రమాలతో పాటు మీసేవ కేంద్రాలందించే అన్ని సేవలూ సచివాలయాల ద్వారానే అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

*భూముల స్వాధీనంపై సమీక్షిస్తాం: మంత్రి కొట్టు
ఆక్రమణలకు గురైన భూములను త్వరితగతిన స్వాధీనం చేసుకొనే అంశంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆ శాఖ అధికారులతో బుఽధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాతలు అందించిన 4.10లక్షల ఎకరాల భూరి విరాళాల్లో 1.07లక్షల ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. వీటిపై దేవదాయ శాఖ చర్యలు తీసుకునేలోగా కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. ఆ కేసులు త్వరతగతిన పూర్తిచేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునే ఏర్పాటు చేయాలన్నారు. అన్ని దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తుంటాయన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని వారి సంక్షేమం గాలికొదిలేయాలా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నదానికి ఇటీవల మంత్రివర్గ విస్తరణే నిదర్శనమని చెప్పారు.

*అభివృద్ధిని గాలికి వదిలేసింది- జగన్‌ ప్రభుత్వంపై చలసాని ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మేధావులు, వివిధ పార్టీల ప్రతినిధులు స్థానిక గేట్‌వే హోటల్‌లో బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జై భీమ్‌ భారత్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ విశ్వనాథ్‌, జర్నలిస్ట్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, టీటీడీ మాజీ సభ్యుడు రమణ, ఆమ్‌ ఆద్మీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడారు. ‘‘రాష్ట్రం లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై శ్రవణ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన జై భీమ్‌ భారత్‌ పార్టీ దృష్టి సారించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయి’’ అని అన్నారు.

*వర్గీకరణపై జగన్‌ మౌనం వీడాలి: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్‌ మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు వర్గీకరణకు మద్దతుగా పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రస్తావించారని, కానీ వైసీపీ ఎంపీలు మాత్రం ఆ ఊసే ఎత్తలేదని తెలిపారు. గతంలో మద్దతు ప్రకటించి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరును సందర్శించి గత నెల హత్యకు గురైన దళిత మాదిగ బిడ్డ నూతక్కి రవికిరణ్‌ తల్లిదండ్రులను కృష్ణమాదిగ పరామర్శించారు.

*ప్రజలను పట్టించుకోని వైసీపీని ఉరితీయాలి: చంద్రబాబు
ప్రజలను పట్టించుకోని వైసీపీని ఉరితీయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నెక్కలంగొల్లగూడెంలో చంద్రబాబు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరంలో అవినీతి అని దుష్ర్రచారం చేశారని తెలిపారు. కొండను తవ్వి ఎలుక తోకపై వెంట్రుక కూడా పట్టుకోలేదని ఎద్దేవాచేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయి 3 సీజన్లైనా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు రూ.800 కోట్ల అదనపు భారం మోపారని విమర్శించారు. పోలవరం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందన్నారు. రాష్ట్ర మొత్తం పూర్తిగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సన్న బియ్యం ఇస్తానంటూ ఉన్న బియ్యం పోగొడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌ ప్రభుత్వ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటామని ప్రకటించారు. అప్పు ఎంత తెచ్చారో జగన్‌ చెప్పి తీరాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

*ధన్యవాదాలు తెలిపేందుకే జగన్‌ను కలిశా: అనిల్‌ కుమార్‌
ధన్యవాదాలు తెలిపేందుకే సీఎం జగన్‌ను కలిశానని మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు. జగన్‌లో అనిల్ కుమార్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జగన్‌ సైనికుడిని మాత్రమేనని చెప్పారు. మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి, తనకు కోల్డ్‌ వార్‌ ఏమీ లేదని తెలిపారు. కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న లుకలుకలు ఉంటాయని, అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మంత్రులుగా వస్తామని అనిల్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

*ఏపీలా కేంద్రానికి తలొగ్గద్దు: రాఘవులు
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో నగదు బదిలీ అమలు అంశంలో ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గవద్దని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివీ రాఘవులు తెలంగాణ సర్కారును కోరారు. పీడీఎస్‌లో నగదు బదిలీ అమలుకు అంగీకరించవద్దని కోరారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గాలని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడారు. పీడీఎ్‌సలో బియ్యానికి బదులుగా నగదు బదిలీ అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతోందని రాఘవులు వెల్లడించారు. కిలో బియ్యానికి బదులుగా రూ.12 చెల్లిస్తామని చెబుతోందన్నారు. ఈ నగదు బదిలీ అమలైతే రేషన్‌ వ్యవస్థ దెబ్బతింటుందని, ధాన్యం సేకరణ, ఎఫ్‌సీఐ గోదాముల అవసరం లేకుండా పోతుందన్నారు. దేశంలోని 2 కోట్ల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములన్నీ అదానీల పరమవుతాయన్నారు. త్వరలో జరిగే ప్రతిపక్ష పార్టీల సీఎంల సమావేశానికి కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ హాజరుకావాలని సూచించారు. జగన్‌ బీజేపీ భజన మానుకోవాలని హితవు పలికారు.

*అందరి సొంతింటి కల నెరవేరుస్తాం: మంత్రి జోగి రమేశ్
అందరి సొంతింటి కల తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ అన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంపై అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు సిమెంట్, ఇసుక, ఇనుము కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.పేదలందరికీ ఇళ్ల పథకంపై గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్.. 26 జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు సిమెంట్, ఇసుక, ఇనుము కొరత లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పేదలకు సొంత ఇల్లు కట్టించాలనే సంకల్పంతో‌ 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.., గృహ నిర్మాణానికి నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. పేదల గృహ నిర్మాణాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.

*సీఎం కాన్వాయ్ కోసం.. ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్‌ కల్యాణ్‌
ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రయాణికులను నడిరోడ్డుపై వదిలేస్తారా? అని జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో అధికారులు వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవటమేంటని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అది నిలదీశారు. ఎవరి ఒత్తిడితో తిరుమలకు వెళ్తున్న భక్తుల వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలన్న పవన్.. సీఎం కాన్వాయ్ కోసం వారిని నడిరోడ్డుపై వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఒంగోలు ఘటనపై రాష్ట్ర ప్రజలకు సీఎంవో వివరణ ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై సీఎస్‌ కూడా విచారణ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.ఏం జరిగిందంటే..? : ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసమంటూ.. ఒంగోలులో ఆర్టీఏ అధికారులు దౌర్జన్యకాండకు తెరతీశారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా.. నిన్న అర్థరాత్రి ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది.పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో తిరుపతి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో.. అక్కడికి వచ్చిన ఓ రవాణాశాఖాధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని పోలీస్‌ కాన్వాయ్ కోసం ఇన్నోవా కారు కావాలని చెప్పారు. కారులో ఉన్న లగేజీ మొత్తం తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీనివాస్ కుంటుంబం.. అవాక్కైంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నడిరోడ్డుపై కారు వదిలేసి దిగిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా ఆర్టీఏ అధికారులు ఒప్పుకోలేదు. బలవంతంగా కారును తీసుకెళ్లిపోయారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీను కుటుంబ సభ్యులు..ఒంగోలులో నడిరోడ్డుపైనే ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వాహనంలో తిరుమల చేరుకున్న వేముల శ్రీనివాస్‌ కుటుంబం…ఆర్టీఏ అధికారుల తీరుపై మండిపడ్డారు.