Devotional

కష్టం లేకుండా.. ఇష్ట దైవదర్శనం

కష్టం లేకుండా.. ఇష్ట దైవదర్శనం

★ కొండ కింది నుంచి పైకి ఉచితంగా బస్సులు
★ ఎక్కడ, ఏమున్నదో తెలిపేలా రూట్‌మ్యాపులు
★ యాదాద్రి సమగ్ర వివరాలతో కథనం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన కొలువైన పవిత్ర పంచనారసింహుల దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు సగటున 20 వేలకు పైగానే భక్తులు వస్తున్నారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువే ఉంటున్నది. వసతుల కల్పనపైనే దృష్టిసారించి త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇదే క్రమంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా దేవస్థానం ఎప్పటికప్పుడు ప్రత్యేక సౌకర్యాలు సమకూరుస్తున్నది. పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకు మరికొంత కాలం పట్టనున్నందున.. కేవలం దర్శనాల కోసమే రావాలని ఆలయ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భక్తుల కోసం ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వసతులు, సదుపాయాలు, ముందస్తు ప్రణాళికతో వెళ్తే భక్తులు ఇబ్బందులు పడకుండా ఎలా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, తదితర సమాచార సమాహారంగా ప్రత్యేక కథనం.

• లక్ష్మీనారసింహుడిని దర్శించుకొనేందుకు బస్సుల్లో వచ్చే భక్తులు యాదగిరిగుట్ట కింది బస్టాండ్‌కు చేరుకొంటారు.
• రైలు ద్వారా ప్రయాణించే భక్తులు.. రాయగిరి స్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి బస్సుద్వారా కానీ, ఆటో ద్వారా కానీ.. గుట్టకింది బస్టాండ్‌కు చేరుకోవాలి.
• కొండపైకి ద్విచక్రవాహనాలు, కార్లు తదితర ప్రైవేటు వాహనాలను దేవస్థానం నిషేధించింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న నృసింహ, లక్ష్మీ సదన్‌లలో వసతిని ఏర్పాటు చేసుకొనేవారు తులసి కాటేజీ ప్రాంతంలోనూ, కల్యాణకట్టకు వెళ్లేవారు దానికి సమీపంలోనే వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. వైకుంఠ పాదం పక్కనే ఉన్న గోశాల వద్ద కూడా పార్కింగ్‌ సౌకర్యం ఉన్నది.
• ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి యాదాద్రి దర్శిని పేరుతో ఉచిత బస్సులను వయా వైకుంఠ పాదం, తులసి కాటేజీ, గౌడ భవన్‌, గండి చెరువు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ నుంచి రింగు రోడ్డు మీదుగా కల్యాణకట్ట వరకు నడుపుతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు సిద్ధంగా ఉంటుంది. తిరిగి ఇదే మార్గంలో భక్తులను గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. భక్తులు చేయి ఎత్తితే చాలు డ్రైవర్లు బస్సును నిలిపి ఎక్కించుకొంటారు.
• ఈ బస్సులు ముందుగా కల్యాణకట్ట వద్దకు తీసుకెళ్తాయి.
• కల్యాణ కట్టదగ్గర భక్తులు దిగి ఉచిత దర్శనం కోసం ఆన్‌లైన్ల టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడి భవనంలో ఆరు కౌంటర్లు సిద్ధంగా ఉంటాయి.
• టికెట్లను పొందేందుకు భక్తులు విధిగా ఆధార్‌ కార్డును వెంట తెచ్చుకోవాలి.
• రూ.600 టికెట్‌పై అందించే వేద ఆశీర్వచనం, రూ.600 టికెట్‌తో నిర్వహించే సువర్ణ పుష్పార్చన టికెట్లను సైతం ఈ కౌంటర్లలోనే ఇస్తారు.
• తలనీలాలు సమర్పించుకొనే వారి కోసం కల్యాణకట్ట భవన్‌లో మహిళలు, పురుషులు స్నానాలు చేసేందుకు వేర్వేరు గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి.
• కల్యాణ కట్ట దగ్గరే క్లాక్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. భక్తులు తమ వెంట తెచ్చుకొన్న లగేజీని అక్కడ భద్రపరచుకోవచ్చు. సెల్‌ఫోన్లను కూడా ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఫోన్లు పైకి తీసుకొని పోతే.. అక్కడ భద్రపరచుకోవడానికి వేరే ఏర్పాటు ఉన్నది.
• అన్నదాన సత్రం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటంతో కల్యాణకట్ట పక్కనే ఉన్న దీక్షాపరుల మండపంలో ప్రస్తుతం అన్నదానం (ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు) నిర్వహిస్తున్నారు.
• పక్కనే ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించవచ్చు.
• కల్యాణ కట్ట దగ్గర టిక్కెట్‌ తీసుకొన్న తరువాత అక్కడి నుంచి మినీ బస్సులో కొండపైకి వెళ్లాలి.
• మినీ బస్సుల్లో కొండపైకి చేరుకున్నాక క్యూకాంప్లెక్స్‌లోకి అడుగుపెట్టే ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉచిత దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. కల్యాణ కట్టకు వెళ్లకుండా నేరుగా వెళ్లేవారికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది.
• తమ వెంట సెల్‌ఫోన్‌ తెచ్చుకొన్నవారు కొండపైన బస్‌బే ప్రాంగణంలోని క్లాక్‌ రూంలోనే భద్రపర్చుకోవాలి. చెప్పులతో కొండపైకి వచ్చేవారు క్లాక్‌ రూం పక్కనే వదిలి వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి.
• కొండపైకి బస్‌బే ప్రాంగణానికి చేరుకోగానే.. దీనికి ఆనుకొని క్యూకాంప్లెక్స్‌ ఉంటుంది. ఇక్కడి నుంచే భక్తులు స్వామి దర్శనానికి వెళ్లాలి. వైకుంఠ పాదం నుంచి మెట్ల మార్గాన వచ్చే భక్తులకూ ఇదే ప్రవేశ మార్గం.
• నాలుగంతస్తుల్లో నిర్మించిన క్యూకాంప్లెక్స్‌లో ప్రతి అంతస్తులోనూ 10 వేల మంది వేచి ఉండేలా పెద్ద పెద్ద హాళ్లు ఉన్నాయి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కూర్చునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో నీటి వసతి, ఫ్యాన్లతోపాటు మరుగుదొడ్ల సౌకర్యాలూ ఉన్నాయి. స్వామి దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం బాలాలయం పక్కనే తాత్కాలిక మూత్రశాలలను ఏర్పాటుచేశారు.
• క్యూ కాంప్లెక్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత భక్తులు నిరీక్షించే అవసరం లేకుండానే క్యూలైన్‌ ముందుకు సాగుతుండటంతో శని, ఆదివారాల్లో స్వామివారి దర్శనానికి 2 గంటలు, సాధారణ రోజుల్లో గంటలోనే పూర్తవుతున్నది. ప్రస్తుతం గర్భగుడిలోకి వెళ్లి దర్శించుకొనేందుకు అనుమతిస్తున్నారు.
• వేద ఆశీర్వచనం ప్రధానాలయం లోపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో, సువర్ణ పుష్పార్చనను ముఖ మండపంలో నిర్వహిస్తున్నారు.
• సత్యనారాయణ వ్రత మండపం నిర్మాణం పూర్తి కాకపోవడంతో, ప్రస్తుతం గోశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.
• భక్తుల దాహార్తిని తీర్చేందుకు ‘యాదాద్రి జల ప్రసాదం’ పేరుతో ఇప్పటికే కొండపైన రెండు వాటర్‌ ప్లాంట్లు, కొండ కింద తులసి కాటేజీ వద్ద రెండు, వైకుంఠ ద్వారం, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, పాతగుట్ట, పాత గోశాలల వద్ద భక్తులకు ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ను అందించేందుకు ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
• కొండపైకి తులసి కాటేజీ ముందు ఉన్న ఘాట్‌ రోడ్డు మార్గం గుండా.. స్వామి దర్శనం అనంతరం నూతనంగా నిర్మించిన మరో ఘాట్‌ రోడ్డులో కొండ కిందకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకొనేలా ఏర్పాట్లుచేశారు.
త్వరలోనే అందుబాటులోకి వచ్చే సదుపాయాలు కొండపైన క్యూకాంప్లెక్స్‌లో, ప్రధానాలయం ముఖమండపంలో చల్లదనం కోసం ఏసీ వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నది.  
★ క్యూకాంప్లెక్స్‌లో ఎస్కలేటర్‌ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం వీల్‌చైర్లను కొండపైన క్యూకాంప్లెక్స్‌ సమీపంలోని రిసెప్షన్‌లో వద్ద అందుబాటులో ఉంచనున్నారు.
★ వేసవి కాలం దృష్ట్యా ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో మ్యాట్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లను సైతం త్వరలోనే ఏర్పాటుచేయనున్నారు.
★ కొండపైన, ఆలయ పరిసరాల్లో భక్తులకు సమాచారం నిమిత్తం సైన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటిని ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.