*ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిణామాలపై గవర్నర్ ఒక నివేదిక ఇచ్చారు.రాష్ట్రంలో పరిణామాలపై చర్చించారు. సుమారు 40 నిముషాలపాటు ఈ భేటీ జరిగింది. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. కానీ ఏపీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులపై చర్చలు జరిపి, నివేదిక ఇచ్చారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. దానికి కారణాలు.. అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వాటి కోసం ఏ విధంగా అప్పులు చేస్తున్నది, అభివృద్ధి ఏ మేరకు ఉందన్నదానిపై చర్చలు జరిపినట్లు సమాచారం.అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా నరేంద్ర మోదీ, అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒక నివేదిక అందజేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది.
*జగన్‌కు చంద్రబాబు లేఖ
సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలపై చంద్రబాబు లేఖ రాశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై హింస పెరిగేందుకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమన్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తప్పుబట్టారు. విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారమే దీనికి సాక్ష్యమని తెలిపారు. కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
* ప్రైవేట్ టెలివిజన్ చానళ్ళ ప్రసారాల తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన హింసాత్మక సంఘటనలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి చూపించిన కంటెంట్‌ను ప్రస్తావించింది. అనధికారిక, తప్పుదోవ పట్టించే, సంచలనాత్మక, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రసారం చేయరాదని సూచించింది.
*కర్ణాటకలోని మలాలీ శివారు ప్రాంతంలోని ఓ మసీదు వెనుక కనిపించిన హిందూ దేవాలయం వంటి నిర్మాణంలోకి ఎవరూ ప్రవేశించరాదని కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఈ నిర్మాణాన్ని తొలగించరాదని, నష్టపరచరాదని చెప్పింది. ఇప్పటికే దక్షిణ కన్నడ జిల్లా అధికారులు ఈ మసీదు ఆధునికీకరణ పనులను నిలిపేయాలని ఆదేశించారు.
*తిరువళ్లూర్ జిల్లా పళవేర్కాడు సమీపం కూనంకుప్పం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ప్రైవేటు సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన స్మార్ట్ తరగతులను జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్ వర్గీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ తరగతులు ఏర్పాటుచేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, స్మార్ తరగతుల నిర్మాణానికి సహకరించిన ప్రైవేటు సంస్థ యజమాన్యానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఆర్ముగం, జిల్లా విద్యాశాఖ సహాయ అధికారి బాలమురుగన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరావు, మీంజూరు యూనియన్ చైర్మన్ జి.రవి, యూనియన్ కౌన్సిలర్ సెల్వలగితో పాటు సంస్థ నిర్వాహకులు పద్మశ్రీ గీత తదితరులు పాల్గొన్నారు.
*విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్ శుక్రవారం కోరాపుట్ స్టేషన్‌లో జెండా ఊపి పునః ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఈ మార్గంలో స్పెషల్ బోగీలో విండో ఇన్‌స్పెక్షన్ చేశారు. గతంలో విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం మధ్య నడిచే డైలీ ప్యాసింజర్ రైలును కరోనా కారణంగా నిలిపేశారు.ఈ క్రమంలో ప్రజల విజ్ఞప్తి మేరకు పునః ప్రారంభించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. శనివారం నుంచి విశాఖపట్నం–కోరాపుట్(08538), ఆదివారం నుంచి కోరాపుట్–విశాఖపట్నం (08537) రైళ్లు పాత టైమింగ్స్ ప్రకారమే నడువనున్నాయి.
* ఏయూ ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారు. ప్రభుత్వం రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. జాబ్ మేళా అనేది నిరంతర ప్రక్రియ. చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగుల కూడదు అనేది సీఎం లక్ష్యం.దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని వైఎస్సార్‌సీపీ చేస్తోంది. గ్రామ, వార్డు వాలంటరీ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం కల్పించారు. నేడు, రేపు జాబ్ మేళా జరుగుతుంది. అవరమైతే ఎల్లుండి కూడా నిర్వహిస్తాము. 208 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఒక్కొక్కరు ఐదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాము. 77 వేల మంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో వచ్చే వారం జరగాల్సిన జాబ్ మేళా సీఎం ఢిల్లీ పర్యటన కారణంగా ఒక వారం వాయిదా పడింది అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
*విజయవాడ: నగరంలోని సత్యనారాయణపురం గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిక్ బైక్‌కు వచ్చిన బ్యాటరీ ఇంటిలోని పడుకునే గదిలో చార్జింగ్ పెట్టాడు. అయితే తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. శివ కుమార్‌తో పాటు భార్య, ఇద్దరూ పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో చుట్టు పక్కల వారు చూసి తలుపులు పగలగొట్టి ఇంట్లో వారిని బయటకు తీసుకువచ్చారు. అందరికీ తీవ్ర గాయాలతో పాటు శరీరం కాలి పోవడంతో వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గ మధ్యలో శివ కుమార్ మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
*వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మదురై – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27, జూలై 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి సోమవారం) సాయంత్రం 9.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే వీక్లీ ఎక్స్‌ప్రెస్ (07191) మరుసరి రోజు సాయంత్రం 8.45 గంటలకు మదురై జంక్షన్ చేరుకుంటుంది. అదే విధంగా మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29, జూలై 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి బుధవారం) ఉదయం 5.30 గంటలకు మదురైలో బయలుదేరే వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07192) మరునాడు ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లకు శనివారం ఉదయం 8 గంటల నుంచే రిజర్వేషన్ ప్రారంభంకానుంది.
*టీపీసీసీ కోశాధికారిగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోనియాగాంధీ.. ఆయన పేరును ఆమోదించారని ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోశాధికారిగా వ్యవహరించిన గూడూరు నారాయణరెడ్డి.. కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరారు. దీంతో.. అప్పటి నుంచీ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ పదవికి సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేశారు.
*రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొలువుల భర్తీకి నోటిఫికేషన్లపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎ్‌సపీఎస్సీ) శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సభ్యులు, అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో నోటిఫికేషన్లపై.. ముఖ్యంగా గ్రూప్-1 పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీఎ్‌సపీఎస్సీ ద్వారా రాష్ట్రంలో సుమారు 503 గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిపై కసరత్తు పూర్తిచేసిన కమిషన్ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది.
*కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో గవర్నర్‌కు పూర్తి నివేదిక చేరింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి పద్మ (63), కొడుకు గంగం సంతోష్ (42) ఇటీవల కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న గవర్నర్ తమిళిసై.. పూర్తి నివేదికను అందించాల్సిందిగా జిల్లా పోలీసులను ఆదే శించారు. దీంతో పోలీసులు.. శుక్రవారం గవర్నర్‌కు పూర్తి నివేదికను అందజేశారు. ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపణలు వస్తుండడం.. ఇదే విషయంపై ప్రతిపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
* రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఓఆర్‌ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయనీరు, మజ్జిగ, కొబ్బరినీరు తాగాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాం తాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 23వ తేదీ ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
*‘‘నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుంది. మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ‘‘మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల బ్యాగ్ జిల్లా కోర్టులో చోరీకి గురికావడంపై ఎస్పీ చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. వెంటనే ఎస్పీ తన మాటలను వెనక్కు తీసుకోవాలి. అధికారులు ప్రజలకు సేవచేయాలేగాని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కాదు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి రేషన్ బియ్యంను ఇతర దేశాలకు ఎవరు తరలిస్తున్నారో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతికి పోలీసు శాఖ అండగా నిలుస్తోంది’’ అని సోము ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం శుక్రవారం చేపట్టిన ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏపీపీఎస్సీ కార్యాలయం పోలీసు వలయంలోనే ఉంది. ప్రతి ఏటా జాబ్‌క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోవడంతో బీజేవైఎం నేతలు ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. 26 జిల్లాల నుంచి బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు విజయవాడకు చేరుకున్నారు. ముట్టడి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయానికి ముందు ఉండే యూటర్న్ పాయింట్‌ను బారికేడ్లతో మూసివేశారు. మహాత్మాగాంధీ రోడ్డులో ఏపీపీఎస్సీ కార్యాలయం వైపు వచ్చే ఆటోలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయినప్పటికీ బీజేవైఎం కార్యకర్తలు దశల వారీగా ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిని అరెస్టు చేసి ప్రత్యేక వాహనాల్లో వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
* డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ.. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన 43 మంది వైద్యులకు వివిధ మెడికల్ కళాశాలల్లో పోస్టింగ్‌లు లభించాయి. సోమవారం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ను డీఎంఈ అధికారులు డీఎంఈ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. మొత్తం 15 విభాగాల్లో 45 మంది వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు.
*రాష్ట్రంలో దద్దమ్మ పాలనకు పోలవరం ప్రాజెక్టు బలైంది. ముప్పాతిక వంతు పనులు పూర్తయిన ప్రాజెక్టును పూర్తి చేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సమూలంగా సర్వ నాశనం చేసిగాని జగన్‌రెడ్డి గద్దె దిగేలా లేరు’’ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ శాసనసభాపక్షం ఉప నేత నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి పోలవరం ప్రాజెక్టు పనులు సాఫీగా నడుస్తున్నాయి. వాటిని అదే ఊపుతో కొనసాగిస్తే 2020లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. దాని కొనసాగింపుగా నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ వరకూ గోదావరి జలాలను తీసుకువెళ్లే ప్రక్రియ కొనసాగేది. కాని జగన్‌రెడ్డి అనవసరపు అహంకారం ప్రదర్శించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే పోలవరం పనులు ఆపు చేయించారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించారు. ఇలా చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారటీ, కేంద్ర జల సంఘం అధికారులు చెప్పినా వినిపించుకోలేదు.
*ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబువిజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంబాధితురాలిని భయకంపితం చేయడంపై విచారణకు చంద్రబాబుఉమ ఈ నెల మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది.
*రాష్ట్రంలో నూతనంగా కాలుష్య రహిత ఎలక్ర్టిక్ బస్సులను తీసుకువస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం కోనసీమ జిల్లా మామిడికుదురులో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలెట్ ప్రాజెక్టుగా వంద ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నంవిజయవాడరాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య నడపడానికి కృషి చేస్తామన్నారు. రవాణా వ్యవస్థను పటిష్ట చేస్తామని విశ్వరూప్ తెలిపారు.
*నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు వార్తలు ప్రచురించారని అందుకే ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సాయం చేస్తున్నా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయని, మంత్రి కేటీఆర్ హద్దు మీరి ప్రధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబపార్టీల నుంచి ముప్పు ఉందని, కుటుంబపార్టీల పాలన దూరం చేసేలా.. 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని మోదీ ఖరారు చేశారని జీవీఎల్ పేర్కొన్నారు.