వేసవి రాగానే శీతలపానీయాలతో ఫ్రిజ్ని నింపేస్తాం . కానీ ఎండల్ని తట్టుకునేందుకు ప్రకృతే మనకెన్నో ఔషధ ఉత్పత్తుల్ని అందిస్తోంది అందుకు చక్కని ఉదాహరణ నన్నారి ఉరఫ్ అనంతమూల లేదా సుగంధిపాల వేళ్లు . రాయల సీమలో ఎక్కువగా పెరిగే ఈ చెట్ల వేళ్లతో చేసే షర్బత్ , అద్భుతమైన సమ్మర్ డ్రింక్ .. ఆ ప్రాంతంలో ఇది లేని సోడా బండి ఉండదంటే అతిశయోక్తి కాదు . ఇప్పుడు అనేక కంపెనీలు నన్నారి సిరప్ని అమ్ముతున్నాయి . ఇందుకోసం సన్నగా పొడవుగా పెరిగే ఈ చెట్టు వేళ్లను కత్తిరించి పంచదార నీళ్లలో ఉడికించి షర్బత్ తయారుచేస్తారు . వేళ్ల మధ్యలోని గట్టిభాగాన్ని తీసేసి ఏడెనిమిది గంటలపాటు నీళ్లలో నానబెడ తారు . సుమారు పావుకిలో వేళ్లకు ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి అవి ఎరుపు రంగులోకి తిరిగే వరకూ ఉడికించి చల్లారాక వడగట్టి లీటరు కషాయానికి కిలోన్నర చక్కెర కలిపి మరిగించి , చల్లారాక బాటిల్స్ లో నింపుతారు . ఓ టేబుల్ స్పూను సిరప్ని గ్లాసు నీళ్లలో కలిపి టీస్పూను నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు . కొన్నిచోట్ల సబ్జాగింజల్నీ పుదీనా ఆకుల్నీ కూడా వేసు కుంటారు . దాహాన్ని తీర్చే చల్లని పానీయంగానే కాదు , నడుం నొప్పి , కాళ్ల నొప్పులు , మూత్రంలో మంటతో బాధపడేవాళ్లకీ నన్నారి మంచిదే . ఈ వేరు రక్తశుద్ధికీ వీర్యవృద్ధికి తోడ్పడుతుంది . మూత్రనాళాన్ని శుభ్రం చేయడంతోబాటు నాడీ రుగ్మతలనీ తగ్గిస్తుంది . ఆస్తమా , బ్రాంకైటిస్ , మొలలు , కంటి సమస్యలు , మూర్ఛ , డయేరియా , చర్మవ్యాధుల నివారణలోనూ దీని పొడి లేదా కషాయాన్ని వాడుతుంటారు ఆయుర్వేద వైద్యులు . సోడాని కనిపెట్టకముందు అమెరికాలోని మందుల షాపుల్లోనూ ఈ సిరప్ ఉండేదట .