అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో తెలుగువారి సారధ్యం లో నిర్వహిస్తున్నసిలికాంనాంధ్ర విశ్వవిద్యాలయాన్ని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం సిలికానాంధ్ర వి శ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం కార్యకలాపాల గురించి సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మంత్రికి వివరించారు. భారతీయ కళలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ కోర్సులను రూపొందించడం పట్ల నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న పలువురు భారతీయ ప్రముఖులతో కూడా మంత్రి సమావేశమయ్యారు. కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు, కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్రప్రసాద్, సిలికానాంధ్ర ప్రతినిధులు చామర్తి రాజు, ప్రముఖ వైద్యుడు లక్కిరెడ్డి హనిమిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు వారం రోజుల కిందట కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నారని నిర్వాహకులను ప్రశంసించారు.