Politics

ప్రశాంత్ కిషోర్ ప్రకంపనలు

ప్రశాంత్ కిషోర్ ప్రకంపనలు

కొన్ని రోజుల నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే ) చుట్టూ వార్తలు తిరుగుతున్నాయి. ఆయన్ను కాంగ్రెస్ లో చేర్చుకుంటారా? లేదా?అనే కథనాలు వెల్లువెత్తాయి.చివరాకరికి,కాంగ్రెస్ లోచేరడం లేదని పీకే ప్రకటించేశారు.
తెలుగురాష్ట్రాల విషయంలోనూ స్పష్టత వచ్చింది.రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీల నుంచి విరుద్ధమైన ప్రకటనలు వెలువడ్డాయి.తెలంగాణలో టీఆర్ ఎస్ తో పీకే బృందానికి ఒప్పందం కుదిరింది.రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తారని స్పష్టత వచ్చేసింది.ఇది ఇలాఉండగా,”ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదు, భవిష్యత్తులో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు” అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు.

స్వరాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడంతో పాటు,జాతీయ స్థాయిలో కాంగ్రెస్,బిజెపి రహిత కూటమిని నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ తో జతకట్టడానికి కెసీఆర్ ప్రస్తుతానికి ఏ మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. గతంలో తనను ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ /సోనియా బృందంతో కలవడానికి వైసీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రవై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదని తెలిసిందే.అదేసమయంలో,ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జగన్ కు ఎటువంటి విభేదాలు లేవు.వారిద్దరి మధ్య ఒక అవగాహన ఉంటుందనే ప్రచారం కూడా ఉంది.

దేశంలో కాంగ్రెస్ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం వైసీపీ అధినేతకు సుతారం ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యమే.2019 ఎన్నికల సమయంలో, పీకే సేవలను వైసీపీ సద్వినియోగం చేసుకుంది, అఖండమైన మెజారిటీతో అధికారంలోకి కూడా వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహప్రతివ్యూహాలు, విజయసూత్రాలపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈపాటికే అవగాహన వచ్చి ఉంటుంది.2024 ఎన్నికల్లో ఆయన సేవలు మళ్ళీ అవసరమవుతాయా? లేవా? అన్నది వైసీపీకి సంబంధించి ప్రస్తుతానికి అప్రస్తుతమని భావించాలి.ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం
ఆ పార్టీలోని అగ్రనేతల్లో చాలామందికి ఇష్టం లేదని అర్ధమవుతోంది.పార్టీ వ్యవహారాలు పూర్తిగాపీకే చేతుల్లోకి వెళ్లిపోతాయని,తాము డమ్మీలుగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయనే భయాలు వారికి కలిగిఉండవచ్చు.
పీకే విధానాలు -వ్యవహారశైలి కూడా అటువంటివేనని తృణమూల్ కాంగ్రెస్ లో రేగిన విమర్శలను బట్టి కొంత అంచనా వేయవచ్చు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కూడా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేయడం పెద్దగా ఇష్టంలేదని తెలుస్తోంది. వైసీపీ -పీకే బృందం మధ్య ప్రస్తుతానికి ఒప్పందాలు లేకపోయినా,జగన్ మోహన్ రెడ్డి -ప్రశాంత్ కిశోర్ మధ్య సన్నిహిత సంబంధాలు అలాగే ఉన్నాయి.ప్రస్తుతం,
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళనలు జరగాల్సి ఉంది.
ఆ పార్టీలోని అగ్రనేతల్లో చాలామంది అసంతృప్తిగానే ఉన్నారు.పెనుమార్పులు వస్తే తప్ప ఆ పార్టీ బాగుపడే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు.ఇవ్వన్నీ బేరీజు వేసుకొని కాంగ్రెస్ లో చేరేందుకు పీకే వెనుకడుగు వేసినట్లు భావించాలి.

కాంగ్రెస్ అధిష్టానం/ కీలకబృందం పెట్టిన షరతులు కూడా ఆయనకు ప్రతిబంధకాలయ్యాయి.కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరకపోయినా,వృత్తిపరమైన వ్యూహకర్తగా ఆ పార్టీకి సేవలందించే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపాలని అలోచిస్తున్నవారిలో ప్రశాంత్ కిశోర్ కూడా ఉన్నారు..ఏ మేరకు విజయం సాధిస్తారో ఇప్పుడే చెప్పలేం.కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం ఉభయులకూ మంచిదేనని కొందరు విశ్లేషకులు భిప్రాయపడుతున్నారు.ఇంత వరకూ ‘పీకే రథం’ విజయపరంపరలతో ముందుకు దూసుకెళ్తోంది. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే,అది అతని ట్రాక్ రికార్డుకు మచ్చగా మిగులుతుంది.ఇక,కాంగ్రెస్ లో అందరూ నాయకులే, వ్యూహకర్తలే.గతంలోకేంద్ర మంత్రులుగానూ,పార్టీ పరంగానూ పెద్దపెద్ద బాధ్యతలను నిర్వహించినవారే.ఇంకా ఐదుపదుల వయస్సు కూడా దాటని పీకే పెత్తనాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ కురువృద్ధులు ఎందుకుంటారు?
గ్రూప్ -23 గొడవలు ఇప్పటికేఆ పార్టీని దహించి వేస్తున్నాయి.ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో అడుగుపెడితేకొత్త గొడవలు పుట్టుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

మొత్తంగా చూస్తే,కాంగ్రెస్ పార్టీలో పీకే చేరకపోవడమే ఉత్తమమని సీనియర్ జర్నలిస్టులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
నిన్నమొన్నటి వరకూదేశ రాజకీయాల్లో ఇటువంటివారి అవసరమే ఉండేది కాదు.ఆ యా పార్టీల అధినేతలే గొప్ప వ్యూహరచనలు చేసుకొనేవారు.ప్రజలనాడి ఎరిగి పథకాల రూపకల్పన చేసేవారు.ఎన్నికల యుద్ధతంత్రాన్ని నిర్మించుకొనేవారు.పీవీ నరసింహారావు నుంచివై ఎస్ రాజశేఖర్ రెడ్డి వరకూ, ఇందిరాగాంధీ నుంచి జయలలిత వరకూ ఎవరికివారు తమదైన పదునైన వ్యూహాలను రచించుకొని అధికారపీఠాలను అధిరోహించారు.నేడు,విజయపథంలో దూసుకెళ్తున్న ‘అమ్ ఆద్మీ పార్టీ’ అధినేత కేజ్రీవాల్,20ఏళ్ళ పై నుంచి ఒరిస్సా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ కు ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఈరోజు వరకూ రాలేదు.నాయకత్వ పటుత్వం,ప్రజాబలం ఉంటే అద్దె వ్యూహకర్తలు అవసరం లేదని నేటికాలంలో వీరిద్దరూ నిరూపించారు.

కెసీఆర్,చంద్రబాబు వంటివారికి కూడా నిన్నటి వరకూ వ్యూహకర్తల అవసరం రాలేదు.మొన్నమొన్నటి దాకా,పెద్దపెద్దవారి ఇళ్లల్లో కూడా వివాహవేడుకలు ఎలా జరుపుకోవాలో వారే ప్రణాళికలు వేసుకొనేవారు. ఇప్పుడు ఒకమోస్తరు ఆస్తిపరులు కూడా ‘ఈవెంట్’ మేనేజర్లకు అప్పగిస్తున్నారు.ఎన్నికలు కూడా అలాగే తయారయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి,దానికి డబ్బు ఖర్చు తప్పనిసరి.ఈవెంట్ మేనేజర్ ల వంటి వ్యూహకర్తలకు డబ్బులు పారేసి,అదనంగా వారి సేవలు కూడా తీసుకుంటే గెలుపుమనదే! అనే ధోరణులు రాజకీయ పార్టీల్లో పెరిగిపోయాయి.నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది.జాతీయ ఎన్నికల్లోనూ అప్రమేయంగా గెలిచి,ప్రధానిగానూ ఆయన పదోన్నతి పొందారు.

ఆ బృందంలో పీకే బృందం ప్రధానంగా పనిచేసి గెలుపుతీరాలను చేరడానికి దోహదపడింది.దేశంలోని మిగిలిన రాష్ట్రాలలోని కొందరు ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా పీకే సేవలు దత్తుతీసుకొని గెలుపుగుర్రాలు ఎక్కారు.ఈ ట్రెండ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ, ప్రశాంత్ కిషోర్ వేసే ప్రతి అడుగూ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.ప్రజావ్యతిరేకత పెల్లుబికితే ఏ వ్యూహాలు పనిచేయవు.