1. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల కరోనా విరామం తర్వాత ఈ ఏడాది జూన్ 30వతేదీ నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నఅమర్‌నాథ్ యాత్ర జరగనుంది.రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పటి నుంచి రెండు వారాల లోపు జమ్మూకశ్మీర్ బ్యాంక్ కౌంటర్ల ద్వారా వార్షిక అమర్‌నాథ్ యాత్ర కోసం 20,000 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అమర్ నాథ్ తీర్థయాత్రకు పెరుగుతున్న ప్రతిస్పందనను సూచిస్తుందని ఒక అధికారి తెలిపారు. కేవలం 13 పని దినాల్లో దేశవ్యాప్తంగా 20,599 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్ బ్యాంక్ ఎండీ బల్దేవ్ ప్రకాష్ తెలిపారు.యాత్రకు పెరుగుతున్న స్పందనకు ఇది నిదర్శనమని అన్నారు.యాత్రా సమయంలో యాత్రికులకు ప్రాథమిక బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు రెండు ప్రత్యేక కౌంటర్లు, నాలుగు ఏటీఎంలు, రెండు మైక్రో ఏటీఎంలను యాత్ర మార్గంలో ఏర్పాటు చేసినట్లు ప్రకాష్ వివరించారు
2. దుర్గగుడిలో అపచారం
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ప్రముఖ సినీనటుడు రామ్‌చరణ్ బుధవారం ఉదయం 11.15గంటలకు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. భారీసంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు రామ్‌చరణ్ కొండపైకి చేరుకోగానే హద్దులు దాటి ప్రవర్తించారు. అమ్మవారి ఆలయంలో ‘జై చరణ్.. జైజై చరణ్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వీరంగం చేశారు. భారీ గజమాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. ఒకదశలో భద్రతా బలగాలు చేతులెత్తేయడంతో వందల సంఖ్యలో అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. కొందరు చెప్పులు, బూట్లతో సహా ఆలయ ముఖమండపంలోకి వచ్చేశారు. రామ్‌చరణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన సమయం లో అభిమానులు పోటీలు పడుతూ హుండీలపైకి ఎక్కి మరీ మూలవిరాట్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు.
3. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 75,078 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,648 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది
4. 30న టీటీడీ పాలకమండలి సమావేశం ..
తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం శనివారం తిరుమలలో జరుగనుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ఫిబ్రవరి 17న జరిగిన చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, కొత్తగా చేపట్టబోయే పనులు, కేటాయింపులు తదితర వాటిపై సమావేశం జరుగనుంది. భక్తుల విరాళాలతో నిర్మించతలపెట్టిన కాటేజ్‌ల కేటాయింపులపై వస్తున్న ఆరోపణలపై చర్చించే అవకాశముంది