DailyDose

బౌద్ధులు తినే భోజ‌నం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!

బౌద్ధులు తినే భోజ‌నం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!

బుద్ధుడు నిలువెత్తు అహింసామూర్తి. ఆయన ప్రవచించిన బౌద్ధ ధర్మం శాంతికి, సహజీవనానికి పెద్దపీట వేసింది. శాకాహారం, ఉపవాసం, మద్యపాన నిషేధం బౌద్ధ్దుల ఆహార నియమాల్లో మేలిమి రత్నాలు. తథాగతుడి బోధనలే స్ఫూర్తిగా డైట్‌ ప్లాన్‌ను సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. బౌద్ధం శాకాహారాన్ని సిఫారసు చేస్తుంది. ప్రధానంగా మొక్కలకు సంబంధించిన ఆహారమే తినమని చెబుతుంది. మాంసం, ఉల్లి, వెల్లుల్లి లాంటివి పూర్తిగా నిషిద్ధం. తగిన వేళల్లో తగినంతే తినాలన్నది నియమం.

*శాకాహారం
బౌద్ధుల భోజనంలో పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, ఆరోగ్యాన్ని ఇచ్చే నూనెలు, చిక్కుడు, బఠానీలు, వేరుశనగ ప్రధాన భాగం. వీటన్నిటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధంగా ఉంటాయి. ఇవి వ్యాధుల ముప్పును నివారిస్తాయి.

*ఉపవాసం
ఇక్కడ ఉపవాసం అంటే నిర్ణీత కాల పరిమితుల్లో మాత్రమే తినడం. కొంతమంది అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అన్నం తీసుకోకుండా ఉంటారు. ప్రస్తుతం ప్రచారం లోఉన్న ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’కు ఈ సూత్రమే మూలమేమో!

*మద్య నిషేధం
మద్యం తీవ్ర వ్యసనానికి దారితీస్తుంది, మెదడు మీద ప్రభావం చూపి మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. కాబట్టే, బౌద్ధులు మద్యం అసలు ముట్టుకోరు.

**వీటిని తీసుకోవచ్చు..
♦ యాపిల్‌, అరటి, రేగు, నిమ్మ జాతి పండ్లు
♦ బ్రకోలి, పందిరి చిక్కుడు, క్యాప్సికమ్‌, టమాట మొదలైన కూరగాయలు.
♦ బొబ్బర్లు, చిక్కుళ్లు, రాజ్మా, శనగల లాంటి లెగ్యూమ్‌ జాతి ఆహారం.
♦ బియ్యం, ఓట్స్‌, కినోవా లాంటి ధాన్యం.
♦ గింజలు, పప్పులు.
♦ ఆలివ్‌, అవిసె నూనెలు.

*ఆరోగ్యకరం..
మొక్కల నుంచి వచ్చిన ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఊబకాయం ముప్పు, గుండె వ్యాధులు, మధుమేహం, కాలానుగుణంగా వచ్చే ఇతర వ్యాధులు తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యానికి దూరంగా ఉండటం వల్ల కాలేయ వ్యాధుల ముప్పు ఉండదు. ఉపవాసం ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కాబట్టే బౌద్ధులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించినట్లు ‘ఆసియా పబ్లిక్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌’ పేర్కొంది.