విభిన్నమైన వంటకాలు, వాటి రెసిపీలు తెలుసుకునే పనిలో ఉన్నారట అనుష్కా శెట్టి. తన చేతి వంట రుచి చూపించేందుకు రెడీ అయ్యారట. వంటల గురించి యూట్యూబ్ చానెల్ ఆరంభించడానికే అనుష్క ఇలా కుకింగ్ మీద దృష్టి పెట్టారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ వంటల రీసెర్చ్ చేస్తున్నది తన తాజా సినిమా కోసం అని సమాచారం. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన తారాగణంగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే… ఈ చిత్రంలో ఓ అంతర్జాతీయ చెఫ్ పాత్రలో ఈ బ్యూటీ కనిపించనున్నారట. ఈ పాత్రలో ఒదిగిపోవడానికే పాకశాస్త్రంలోని అంశాలపై పట్టు సాధించే పనిలో ఉన్నారట. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఇదే.