నాలుగు నెలల క్రితం మనల్ని వదిలివెళ్లిపోయిన గానకోకిల లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పిస్తూ 18 మంది సంగీత కళాకారులు ‘నామ్ రహే జాయేగా’ పేరుతో ఓ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సోనూ నిగమ్, షాన్, శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు ప్యారేలాల్, అర్జిత్ సింగ్, నితిన్ ముఖేశ్, అల్కా యాజ్ఞిక్, సాధనా సరగమ్, ఉదిత్ నారాయణ్, కుమార్ సాను, జతిన్ పండిట్ వంటి ప్రముఖ గాయనీగాయకులు లతా మంగేష్కర్ పాడిన పాటలను ‘నామ్ రహే జాయేగా’ కార్యక్రమంలో పాడి వినిపించనున్నారు. మే ఒకటి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు స్టార్ ప్లస్ ఛానల్‌లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం గురించి నితిన్ ముఖేశ్ మాట్లాడుతూ ‘మా నాన్నగారు, లతాజీ మంచి స్నేహితులు. చిన్నతనం నుంచి నేను ఆమె గాత్రం వింటూ పెరిగాను. ఓ జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు లతాజీతో నాకు ఉన్నాయి. విదేశాలలో ఆమె ఇచ్చిన సంగీత ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం నాకు దక్కింది’ అని వివరించారు.తన కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సందర్భంగా లత పొందిన ఆవేదనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘ప్రతి రోజూ ఆమె ఫోన్ చేస్తూ నా ఆరోగ్యం గురించి అడిగి తెల్సుకునేవారు. తన ఫ్యామిలీ డాక్టర్స్‌తో మాకు ట్రీట్‌మెంట్ ఇప్పించారు. నేను కరోనా నుంచి కోలుకోవాలని ఆమె భగవంతుడిని ప్రార్ధించేవారు’ అని చెప్పారు 71 ఏళ్ల నితిన్ ముఖేశ్. లతా మంగేష్కర్ సంగీత సరస్వతి అని జతిన్ పండిట్ అభివర్ణించారు. ‘ఆమె పాట, అందులోని స్పష్టత శ్రోతలను విశేషంగా ఆకట్టుకొనేవి. ఉచ్ఛ స్వరంతో కానీ, తక్కువ స్వరంతో కానీ పాట పాడడానికి ఆమె ఏనాడూ ఇబ్బంది పడలేదు’ అని జతిన్ చెప్పారు. ‘మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీ వల నన్ను లతా మంగేష్కర్ అవార్డ్‌తో సత్కరించడం నా జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఇప్పుడు ఆమెకు నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’ అని సాధనా సరగమ్ చెప్పారు.