ఏలూరు : జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గాయపడ్డారు. కాగా.. వైసీపీ గ్రామపార్టీ అధ్యక్షుడు గంజిప్రసాద్‌ను ఇవాళ ఉదయం కొందరు దుండగులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరకు పోలీసుల సాయంతో ఎమ్మెల్యే వెంకట్రావు గ్రామం నుంచి బయటకు వెళ్లారు.
గ్రూపు రాజకీయాలను ప్రోత్సాహించడం వల్లనే ఈ హత్య జరిగిందని గ్రామానికి చెందిన కార్యకర్తలు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే.. గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే కారణమంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.