సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ దేశంలో ఆదివారం మే డేను ఘనంగా నిర్వహించారు. 1200 మంది స్థానిక తెలుగు కార్మికులకు రుచికరమైన బిర్యానీ పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మస్థైర్యాన్ని నింపారు.పూర్వ, ప్రస్తుత కార్యవర్గసభ్యులతోపాటు సభ్యులు, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ, తెలుగు కార్మిక సోదరులకు ఏ సమస్య వచ్చినా సింగపూర్ తెలుగు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.కొవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లు కలుసుకోలేకపోయామని, ఇప్పుడిలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్ధానిక రెస్టారెంట్స్ సహకారంతో కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 1200 మంది కార్మిక సోదరులకు బిర్యానీ బాక్సులు అందించామని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు, కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు పోతగాని నరసింహగౌడ్, నాగరాజు, సత్య చిర్ల పాల్గొన్నారు.