*ఆస్ట్రేలియా నుంచి ఏ నగరానికైనా డైరెక్ట్ ఫ్లైట్స్
*2025 నుంచి ప్రారంభించనున్న సంస్థ క్వాంటాస్
దూరాలు వెళ్లాలంటే… విమానాల కోసం ఎదురుచూపులు, పడిగాపులు. ఒకటి, రెండు ఫ్లైట్స్ మారాల్సి వస్తుంది. లేదంటే ఒకట్రెండు హాల్టులైనా ఉంటాయి. ఇక ఇలాంటి మార్పులకు హాల్టులు చెక్ పెడుతోంది ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ క్వాంటాస్. లండన్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ ఫ్లైట్‌ను 2025 నుంచి నడపనుంది. 19 గంటలపాటు నాన్‌స్టాప్‌గా నడిచే ఈ ఫ్లైట్.. ఆగకుండా అత్యంత దూరం 17,016కి.మీ ప్రయాణించే విమానంగా చరిత్ర సృష్టించనుంది.కాగా ప్రస్తుతం సింగపూర్ టు న్యూయార్క్ 15,300కి.మీ దూరాన్ని 17న్నర గంటలపాటు ప్రయాణించే ఫ్లైట్ అత్యంత లాంగెస్ట్. కాగా… లాంగెస్ట్ ట్రయల్ ఫ్లైట్ 2019లో లండన్ నుంచి సిడ్నీ 19 గంటల 19 నిమిషాలు ప్రయాణించింది. ఎక్కడా హాల్టులు లేని ఈ ప్రయాణాలకు డిమాండ్ పెరగడంతో ఎ350–1000 ఎయిర్‌బస్సులు 12 ఆర్డర్ చేసింది. ఇక ఈ ఎ350, ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’విమానాల్లో ఆస్ట్రేలియా నుంచి లండన్, న్యూయార్క్… ఇలా ఏ నగరానికైనా నాన్‌స్టాప్‌గా ప్రయాణించొచ్చు.మొట్టమొదటి ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’ఫ్లైట్స్ న్యూయార్క్, లండన్‌ల నుంచి ప్రారంభమవ్వనున్నాయి. అలాగే.. ఆస్ట్రేలియా నుంచి పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ వంటి నగరాలకూ ప్రయాణించనున్నాయి. ఒక్కో విమాన సామర్థ్యం 238 మంది. అధికదూరం ప్రయాణించేవి కావడంతో… ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నడక, చిన్నపాటి వ్యాయామాలకోసం వెల్‌బియింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేసింది.ఇక ఇందులో ఉన్న ఫస్ట్‌క్లాస్ సూట్… చిన్నపాటి హోటల్ రూమ్‌ను తలపిస్తుంది. బెడ్, పెద్ద టీవీ, లాంజ్‌చైర్, వార్డ్‌రోబ్ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. తక్కువ కర్బన ఉద్గారాలు, తక్కువ శబ్దం వచ్చేలా పర్యావరణహితంగా తయారు చేయిస్తోంది క్వాంటాస్. ప్రయాణికుల బడ్జెట్‌కు అందుబాటులో ఉంటాయని చెబుతోంది.