DailyDose

దేశంలో భారీగా పెరుగుతున్న నిరుద్యోగులు

దేశంలో భారీగా పెరుగుతున్న నిరుద్యోగులు

దేశంలో నిరుద్యోగిత పెరిగిపోతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
మార్చిలో 7.6 శాతం ఉన్న
ఈ రేటు ఏప్రిల్ నాటికి 7.83 శాతానికి చేరుకుందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ'(సీఎంఐఈ) అందించిన నివేదిక ద్వారా అర్థమవుతోంది.పట్టణాల్లో నిరుద్యోగం ఎగబాకుతున్నట్లు సంఖ్యలు చెబుతున్నాయి. మార్చిలో 8.28 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ లో 9.22కు ఎగబాకింది.
గ్రామీణ ప్రాంతాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి.
కరోనా సృష్టించిన ఆర్థిక మందగమనం ఈ దుస్థితికి ప్రధానమైన కారణమని భావించాలి.పెరుగుతున్న ధరలు,డిమాండ్ మందగించడం,ఆర్ధిక రికవరీ నెమ్మదించడం మొదలైన కారణాల వల్ల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నిరుద్యోగపర్వంలో రాజస్థాన్, హరియాణా,ఝార్ఖండ్,బీహార్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి.కరోనా కాలంలో లక్షలాదిమంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. ప్రస్తుతం కొంచెం కొంచెంగా ఉపాధి మెరుగుపడుతున్నా, సాధారణ పరిస్థితులు రావాలంటే ఇంకా సమయం పట్టవచ్చునని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉపాధి,ఉద్యోగకల్పనలో ప్రయాణం మందకొడిగా సాగడమేకాక,వినిమయం కూడా గణనీయంగా పడిపోయింది.తయారీ రంగం కూడా ఇంకా కోలుకోలేదు. ద్రవ్యోల్బణ భయాలు,
సరఫరా చైన్ లోని ఇబ్బందులు తయారీ రంగంపై దుష్ప్రభావాన్ని చూపించాయి. ముడిపదార్ధాల ధరలు పెరగడం,నిర్వహణ ఖర్చులు కూడా చేయిదాటిపోవడం తయారీ రంగాన్ని కుదిపేసింది.
తయారీ కార్యకలాపాలు
కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ,ఉత్పత్తి పెరుగుతోందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఈ పరిణామాన్ని గుడ్డిలో మెల్ల అనుకోవాలి.
ఇది ఇలా ఉండగా,
మన దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండదని మన ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు.
స్వావలంబన సాధించేందుకు ఆత్మనిర్భర్ వైపు దేశం అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి చెబుతున్నారు. ప్రజలంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తే దేశంలోని నిరుద్యోగ సమస్య తీరుతుందని నరేంద్రమోదీ జాతికి సూచిస్తున్నారు. కాకపోతే,నిరుద్యోగం పూర్తిగా సమసిపోవాలంటే
మరో పాతికేళ్ళు ఆగాలని ప్రధాని అంటున్నారు.
ప్రతిపక్షాలు మాత్రం
‘మేక్ ఐన్ ఇండియా’పై మండిపడుతున్నాయి.
దేశం నుంచి పలు అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు నిష్క్రమిస్తున్నాయని, అందుకు కేంద్ర ప్రభుత్వం తీరే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాగ్బాణాలు సంధిస్తున్నారు.గత ఐదేళ్లలో దాదాపు రెండుకోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారని మీడియాలో వచ్చిన కథనాలే ప్రబలిన నిరుద్యోగితకు
ప్రత్యక్ష సాక్ష్యమని విపక్షనేత వాపోతున్నారు.ఉపాధిలేమితో ఉత్పాతం రాకుండా చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత.సారవంతమైన పంటభూములు,అపారమైన ఖనిజసంపద,సహజవనరులు అనేకం మనకున్నాయి.
వాటిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంలో మనం ఎంతో వెనకబడి ఉన్నామన్నది పచ్చినిజం.
పల్లెలను ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి,పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షిస్తే గ్రామీణభారతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు..
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా చురుకుగా ముందుకు సాగాలి. కరోనా కల్పిత కష్టాలను అధిగమిస్తూ,
కొత్త అవకాశాలను సృష్టించుకుంటూ,స్పృశించని రంగాల వైపు దృష్టి సారించడం, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఎన్నుకోవడం మొదలైనవి పరిష్కార మార్గాలు.నిరుద్యోగం శాపం కారాదు.ప్రతిభకు సానబడుతూ,
అవసరాలను,ఎక్కువ డిమాండ్ ఉన్న రంగాలను గుర్తిస్తూ ముందుకు సాగడం శ్రేయస్కరం.ఉద్యోగిత,
ఉపాధి పెరుగుదలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు,వ్యక్తులు కూడా భాగస్వామ్యం కావాలి. ఉద్యోగభారతం సృష్టివైపు ఏలికలు హృదయపూర్వకంగా దృష్టిపెడితే,నిరుద్యోగిత దూరమవుతుంది.