ప్రతీ వివాహ బంధం.. ఒక దశ దాటిన తర్వాత మార్పునకు లోనవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవ్వడం, పెళ్లి చేసుకుని లేదంటే ఉద్యోగాల కోసమే ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ, నా వరకు వచ్చేసరికి ఆ మార్పు విడాకుల రూపంలో ఎదురైంది అని అంటున్నారు టెక్ దిగ్గజం బిల్‌గేట్స్. సండే టైమ్స్‌తో తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై స్పందించాడు బిల్‌గేట్స్. అయితే విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిలిందా ఫ్రెంచ్‌తో వివాహం, విడాకులు.. ఇప్పుడు ఆమెతో కలిసి ఫౌండేషన్ కోసం కలిసి పని చేయడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు ఆయన. మిలిందాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అవకాశం వదులుకోను అంటూ వ్యాఖ్యానించారాయన. గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిలిందాతో కలిసి వర్కింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఫౌండేషన్ కోసం పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని, అది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడాయన. ఇంతగా ప్రేమించినప్పుడు.. వివాహ బంధం ఎందుకు ముగిసిందని ప్రశ్న ఎదురుకాగా.. పెళ్లిళ్లు క్లిష్టమైనవి. వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు. మా వివాహ బంధం ఎందుకు విఫలమైందని విషయం ఇప్పుడు అప్రస్తుతం అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు. 2021 మే నెలలో బిల్, మిలిందా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి విడాకులు కన్ఫర్మ్ అయ్యింది. బిల్ గేట్స్, మిలిందా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.