విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. అనంతపురంలో 42 డిగ్రీలు.. రామగుండంలో 45 డిగ్రీలు నమోదు! వేసవిలో వాతావరణ శాఖ వెల్లడించే ఈ వివరాలకోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఏ పట్టణంలో ఎంత ఉష్ణోగ్రత నెలకొందో తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు.అయితే ఈ ఉష్ణోగ్రతలను ఎలా నమోదుచేస్తారు? వాటిని గుర్తించడానికి ఏ పరికరాలను ఉపయోగిస్తారు? అనే సందేహాలు చాలా మందిలోనే ఉంటాయి. ఉష్ణోగ్రతలు, వర్షం, తేమ వంటి వాటిని కొలవడానికి వాతావరణ శాఖ పరిధిలో ప్రత్యేక స్టేషన్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలను థర్మామీటర్‌లోనే కొలుస్తారు. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొలవడానికి ముందు థర్మామీటర్లను సెట్ చేస్తారని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డ్యూటీ అధికారి తెలిపారు.
**గ్రీన్‌విచ్ కాలమానమే ప్రామాణికం
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ విభాగాలు గ్రీన్‌విచ్‌మీన్ టైమ్(జీఎంటీ)ను అనుసరిస్తారు. భారత కాలమానం ప్రకారం ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు ఉష్ణోగ్రతలు తీస్తుంటారు. అంటే ఉదయం 8.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాలు కొలుస్తారు.ప్రతి మూడు గంటలకు ఒకసారి అంటే ఉదయం 8.30, 11.30, మధ్యాహ్నం 2.30, సాయంత్రం 5.30, రాత్రి 8.30, 11.30, అర్ధరాత్రి 2.30, తెల్లవారుజామున 5.30 గంటకు కొలుస్తారు.పగటి ఉష్ణోగ్రతలు తెలుసుకోవాలంటే ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు ఉన్న వివరాలను తీసుకుంటారు. ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు వరకు ఏ సమయంలో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటే దానినే గరిష్ఠ ఉష్ణోగ్రతగా తీసుకుంటారు.గరిష్ఠ ఉష్ణోగ్రత కొలిచే థర్మామీటరు మెర్కురీతో తయారు చేస్తారు.
* ఈ పరికరంలోలో మైనస్ 35 డిగ్రీల నుంచి ప్లస్ 55 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే సదుపాయం ఉంటుంది.కనిష్ఠ ఉష్ణోగ్రత కొలిచే థర్మామీటర్‌లో ఆల్కహాలు ఉంటుంది. ఆల్కహాలు వ్యాకోచించినపుడు ఉష్ణోగ్రత ఎక్కడ ఆగిపోతుందో అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుంది.స్టీవెన్‌సన్ స్ర్కీన్‌లో వెట్ బల్బు, డ్రై బల్బుల నుంచి తీసుకున్న ఉష్ణోగ్రతల మేరకు గాలిలో తేమ కొలుస్తారు.ఇంకా థర్మోగ్రాఫ్, హైడ్రోగ్రాఫ్ విఽధానం ఉంటుంది. వీటిలో ప్రతి రోజూ గ్రాఫ్‌లు పెడతారు. వాతావరణంలో వేడి, గాలిలో తేమ మేరకు థర్మోగ్రాఫ్, హైడ్రోగ్రా్‌ఫల ద్వారా ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం కొలుస్తారు.భారత వాతావరణ విభాగం పరిధిలో కోస్తా, తెలంగాణ, రాయలసీమలో పలు స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన నిపుణులు పనిచేస్తారు.
**స్టీవెన్‌సన్ స్ర్కీన్ ప్రామాణికం
ఉష్ణోగ్రతలు కొలవడానికి స్టీవెన్‌సన్ స్ర్కీన్ విధానమే ప్రామాణికం. గరిష్ఠ, కనిష్ఠ థర్మామీటర్లు, వెట్, డ్రై బల్బులతో కూడిన స్టీవెన్‌సన్ స్ర్కీన్ ఉత్తర దిశకు అభిముఖంగా ఏర్పాటుచేయాలి. అంటే సూర్య కిరణాలు నేరుగా థర్మామీటర్‌పై పడకూడదు. అయితే కొన్ని సంస్థలు, కంపెనీలు బహిరంగ ప్రదేశంలో థర్మామీటర్లు ఏర్పాటు చేయడంతో నేరుగా సూర్యకిరణాలు తగలడంతో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణుడు ఆర్.మురళీకృష్ణ తెలిపారు. అందుకే వాతావరణ విభాగం, ఇతర సంస్థలు నమోదుచేసిన ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉంటాయన్నారు.