Food

మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తున్న‌రు !!

మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తున్న‌రు !!

ఎన్ని కొత్త వంటలు పరిచయమైనా కొన్ని పాత రుచులు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. ఢిల్లీ పాలకుల పాకశాస్త్ర నైపుణ్యమే అంత. ఏడొందల ఏండ్ల నాటి మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తూ ‘శభాష్‌’ అనిపించుకుంటున్నారు ఆ నిరుపేద బస్తీ మహిళలు. గల్లీ నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌దాకా సాగిన ఆ విజయగాథ మహిళలకు స్ఫూర్తిదాయకం.

వాళ్లు వండిన బిర్యానీ తిన్నామంటే ఏ ఫైవ్‌స్టార్‌ హోటల్లో షెప్ఫో తయారుచేశారనే అనుకుంటాం. కబాబ్స్‌ రుచి చూస్తే.. వాటిని వండిన చేయి వంటల్లో డిగ్రీలు చేసిందేమో అనిపించకమానదు. బేసన్‌ లడ్డూ వాసన చూస్తే తాతమ్మ గుర్తుకు రావల్సిందే. అయితే, ఈ నోరూరించే రుచుల వెనక ఉన్నది నిరక్షరాస్యులైన నిరుపేద మహిళలే! వాళ్లంతా ఢిల్లీలోని జైకా-ఎ-నిజాముద్దీన్‌ స్వయం సహాయక బృంద సభ్యులు. వందల ఏండ్ల నాటి మొఘలాయి రుచుల్ని అచ్చం అదే పద్ధతిలో తయారు చేస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇందులోని సభ్యులంతా హజ్రత్‌ నిజాముద్దీన్‌ బస్తీకి చెందిన వారు. ఆగాఖాన్‌ కల్చర్‌ ట్రస్ట్‌ వాళ్లు 2012లో ఈ బస్తీ పిల్లల ఆరోగ్యం గురించి ఓ సర్వే నిర్వహించారు. ఆరేండ్లలోపు పిల్లల్లో దాదాపు యాభైశాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు తేలింది అందులో. జంక్‌ ఫుడ్‌ తినడమే ఆ పరిస్థితికి కారణమని గుర్తించారు. దాంతో కొందరు మహిళల్ని ఒక బృందంగా ఏర్పాటుచేసి ఆరోగ్యకమైన చిరుతిండ్లు తయారు చేయించాలని ట్రస్టు భావించింది. కానీ ఇళ్లలో రకరకాల ఆంక్షల వల్ల అక్కడి ఆడవాళ్లకి గడపదాటడం ఎంతో కష్టమైపోయింది.

ఎట్టకేలకు ట్రస్టు చొరవతో గట్టి పట్టుదల ఉన్న 11 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. తొలుత గోధుమ రవ్వ లడ్డూలు, కొబ్బరి లడ్డూలు, అటుకుల ఫలహారాలు తయారుచేశారు. మొదట్లో వేడుకల్లో స్టాల్స్‌ పెట్టేవారు. వాటికి మంచి స్పందన రావడంతో నెమ్మదిగా తమకు బాగా వచ్చిన మొఘలాయి వంటకాలను వండటం ప్రారంభించారు. మొఘలాయి బిర్యానీ, షమీ కబాబ్స్‌, హలీమ్‌, ఖులద్‌ఖీర్‌లాంటి ఎన్నో పాతతరం రుచులు మళ్లీమళ్లీ తినాలనిపించేలా తయారుచేసి క్యాటరింగ్‌ చేయడం మొదలుపెట్టారు. రంగులు, నిల్వ ఉంచిన పదార్థాలు వాడకుండా పూర్తి సంప్రదాయ పద్ధతిలో చేయడం వీళ్ల ప్రత్యేకత. ఐదారేండ్ల క్రితం రూ. 1.5 లక్షలు ఉన్న వార్షిక ఆదాయం, లాక్‌డౌన్‌ ముందు ఏడాదికి దాదాపు రూ. 30 లక్షలకు చేరింది. ఇప్పుడు ఢిల్లీలోని బావర్చిఖానా ద్వారా కస్టమర్లకు ఆహారం అందించడంతో పాటు, హోమ్‌ డెలివరీ సేవలూ కల్పిస్తున్నారు. పార్క్‌ హయత్‌, మారియట్‌ లాంటి ఫైవ్‌స్టార్‌ హోటళ్లూ తమ ఫుడ్‌ ఫెస్టివల్స్‌కి వీళ్లను ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు వంట చేయడానికి బయటికి వెళ్తే మొహం తిప్పుకొన్న కుటుంబసభ్యులే ఇప్పుడు వీళ్ల గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. కాబట్టి జైకా-ఎ- నిజాముద్దీన్‌ వంటలకే కాదు, అక్కడ వంట చేసేవాళ్లకూ ఓ చరిత్ర ఉందన్నమాట!