Health

మీ కరెంటు బిల్లును ఇలా తగ్గించుకోండి

మీ కరెంటు బిల్లును ఇలా తగ్గించుకోండి

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘‘సివియర్ హీట్‌వేవ్’’ హెచ్చరికలను కూడా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జారీచేసింది.దేశంలోని వాయువ్య, మధ్య, తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.సాధారణంగా మే, జూన్ నెలల్లో హీట్‌వేవ్‌లు వస్తుంటాయి. కానీ, ఈ సారి మార్చి నుంచే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి.విపరీతంగా పెరుగుతున్న ఎండల నుంచి ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) కొంతవరకు ఉపశమనం కల్పిస్తాయి. అయితే, ఏసీలను ఉపయోగించేటప్పుడు కరెంటు బిల్లుల ఆందోళన మనల్ని వెంటాడుతూ ఉంటుంది.అయితే, ఏసీలను ఉపయోగిస్తూ కరెంటు బిల్లులు తక్కువగా వచ్చేలా చూసుకోవడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. వారు ఏం సూచనలు, సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

1. కనిష్ఠ ఉష్ణోగ్రత 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాలి
సాధారణంగా ఏసీల కనిష్ఠ ఉష్ణోగ్రతను 18 డిగ్రీల వరకు తగ్గిస్తుంటారు. ఏసీ ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తే, ఇల్లు త్వరగా చల్లబడుతుందని భావిస్తుంటారు. కానీ ఏసీ ఉష్ణోగ్రతను ఇలా మరీ తగ్గించకూడదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ)కు చెందిన సీనియర్ పరిశోధకుడు అవికల్ సోమవన్షి హెచ్చరిస్తున్నారు.‘‘ఏసీలను 24 నుంచి 27 డిగ్రీల మధ్యే ఉపయోగించాలి. దీని వల్ల ఏసీలు ఎక్కువ రోజులు వస్తాయి. ఏసీలు వినియోగించే విద్యుత్ కూడా తగ్గుతుంది. ఈ విషయంపై సీఎస్‌ఈ గతంలో ఒక అధ్యయనం చేపట్టింది. 27 డిగ్రీల నుంచి ఒక్కో డిగ్రీ తగ్గిస్తూ వెనక్కి వెళ్లినప్పుడు ఏసీ సామర్థ్యం సగటున మూడు నుంచి పది శాతం తగ్గుతున్నట్లు తేలింది’’అని ఆయన బీబీసీతో చెప్పారు.‘‘ఐదు స్టార్ల ఏసీను 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో నడిపించే కంటే ఒక స్టార్ ఏసీని 27 డిగ్రీలతో నడిపిస్తే మెరుగ్గా పనిచేస్తుంది. మీ ఏసీ 18 డిగ్రీల దగ్గర నడిపిస్తున్నారంటే, మీరు ఇల్లు కూడా 18 డిగ్రీలకు రావాలి. కానీ, అలా జరుగుతుందా? మీరే చెక్‌చేసి చూడండి. 18 డిగ్రీలకు గది ఉష్ణోగ్రతకు రావాలంటే ఎంత సమయం పడుతుందో చెక్ చేయండి’’అని ఆయన అన్నారు.ఏసీ ఆన్‌చేసినప్పుడు కనిపించే ఉష్ణోగ్రతను డిఫాల్ట్ టెంపరేచర్‌గా పిలుస్తారు. అన్ని ఏసీలు 24 డిగ్రీల దగ్గరే మొదలుకావాలని 2020లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ఒక ఆదేశం జారీచేసింది. దీని ప్రకారం, ఏ కంపెనీ ఏసీ అయినా ఆన్‌చేసిన వెంటనే 24 డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తుంది. దీన్ని కావాలంటే మనం తగ్గించుకోవచ్చు.విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా డిఫాల్ట్ టెంపరేచర్‌ను 24 డిగ్రీలకు పెంచినట్లు అవికల్ చెప్పారు. ‘’24 డిగ్రీల నుంచి ఒక్కో డిగ్రీ పెంచినప్పుడు 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది’’అని ఆయన అన్నారు.ఇళ్లలో వాడే ఏసీల ఉష్ణోగ్రతను 25 డిగ్రీలకు పరిమితం చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ‘‘కూల్ యూఎన్’’ పేరుతో ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహిస్తోంది.

2. ఇన్‌స్టలేషన్‌లో పొరపాట్లు
ఏసీల బిల్లులు పెరగడానికి ఇన్‌స్టలేషన్‌లో చేసే తప్పులూ కూడా ఒక కారణమని ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
‘‘ఇన్‌స్టలేషన్ సరిగ్గా జరగకపోతే.. ఏసీ పనిచేయడం కష్టం అవుతుంది. దాని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది’’అని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.ఇన్‌స్టలేషన్‌లో తప్పుల్లో ఇంటికి సరిపడా ఏసీని ఎంచుకోకపోవడం నుంచి ఏసీని సరిగ్గా అమర్చకపోవడం లాంటివి ఉంటాయని అర్బన్ కంపెనీలో ఏసీ రిపెయిర్ సర్వీస్ కోసం పనిచేస్తున్న ఎం.రిహాన్ చెప్పారు.‘‘మన గది విస్తీర్ణానికి తగినట్లుగా ఏసీని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు మన గది విస్తీర్ణం 120 నుంచి 140 చదరపు అడుగుల వరకు ఉంటే 1 టన్ ఏసీని తీసుకుంటే సరిపోతుంది. అదే 150 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే 1.5 టన్నులకు వెళ్తే మంచిది. అంతకంటే ఎక్కువ అంటే 180 చదరపు అడుగుల పైగా విస్తీర్ణం ఉంటే 2 టన్నుల ఏసీని ఎంచుకోవాలి’’అని ఆయన వివరించారు.‘‘చిన్న గదికి ఎక్కువ టన్నులుండే సామర్థ్యమున్న ఏసీతో విద్యుత్ అదనంగా ఖర్చు అవుతుంది. అదే సమయంలో తక్కువ సామర్థ్యముండే ఏసీలు పెద్ద గదులకు సరిపోవు. అందుకే ముందు మన ఇంటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీని ఎంచుకోవాలి’’అని ఆయన చెప్పారు.ఒక గంట సమయంలో గది నుంచి ఏసీ తొలగించే వేడి గాలి సామర్థ్యాన్ని టన్నుల్లో కొలుస్తుంటారు. ఎక్కువ టన్నుల సామర్థ్యం ఉండే ఏసీ ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటుంది.

3. ఎండలో పెట్టకూడదు..
విద్యుత్ బిల్లును పెంచడంలో ఏసీని ఎండ తగిలేలా అమర్చడమూ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.‘‘అవుట్ డోర్‌ ఏసీ యూనిట్‌లో కండెన్సర్ కాయిల్, కండెన్సర్ ఫ్యాన్ ఉంటాయి. బయటగాలిని కండెన్సర్ కాయిల్‌లోకి పంపేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ కండెన్సర్ కాయిల్ మీద ఎండ పడితే, గాలిని చల్లబరిచే ఏసీ సామర్థ్యం తగ్గుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఏసీపై నేరుగా ఎండ పడితే గదిలోని వేడిగాలిని చల్లబరిచే సామర్థ్యం తగ్గుతుంది’’అని ఆయన చెప్పారు.‘‘ఎండ తగలడం వల్ల గదిని చల్లబరిచేందుకు ఏసీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది’’అని ఆయన వివరించారు.‘‘ఎండ తగలకుండా ఉండేందుకు ఏసీ వెనుక భాగానికి కొందరు బట్టలు చుడుతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. అవి లోపలకు వెళ్లిపోయే ముప్పుంటుంది. ఫలితంగా ఏసీ పనిచేయడమే ఆగిపోతుంది’’అని ఆయన అన్నారు.వీలైనంతవరకు ఏసీని నేరుగా ఎండ తగిలే చోట అమర్చకూడదని ఆయన అన్నారు. ఒకవేళ తప్పనిసరైతే, ఏసీపై నీడ తగిలేలా ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాలని, ఫలితంగా కొంతవరకు విద్యుత్ ఆదా అవుతుందని వివరించారు.

4. సర్వీసింగ్ తప్పనిసరి
ఏసీలకు మెయింటెనెన్స్ అవసరమని, అవి మంచి కండీషన్‌లో ఉంటేనే విద్యుత్ కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
‘‘కనీసం ఏడాదికి ఒకసారైనా మనం ఏసీని సర్వీసింగ్‌కు ఇవ్వాలి. దీంతో వాటి సామర్థ్యం పెరుగుతుంది’’అని రిహాన్ చెప్పారు. ‘‘ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లు, డక్ట్స్‌లో దుమ్ము, ధూళి పేరుకుంటాయి. వీటిని తొలగించకపోతే, ఏసీ సామర్థ్యం తగ్గిపోతుంది’’అని ఆయన చెప్పారు. ‘‘ఒక్కోసారి ఏసీలో గ్యాస్ లీక్ అయిపోతుంది. ఫలితంగా ఏసీని ఎంతసేపు నడిపించినా గది చల్లబడదు. సర్వీసింగ్ చేయించేటప్పుడు గ్రాస్ ప్రెజర్ కూడా చెక్ చేయించుకోవాలి’’అని ఆయన అన్నారు.‘‘ఒక్కోసారి కంప్రెజర్ ఆన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. లేదా కంప్రెజర్ ఆన్ అయినా చల్లగాలి రాదు. అలాంటప్పుడు వెంటనే సర్వీసింగ్‌కు ఇవ్వాలి. ఇలా సర్వీసింగ్ చేయిస్తే, ఏసీ ఎక్కువ కాలం పనిచేస్తుంది’’అని రిహాన్ వివరించారు.

5) రోజంతా ఆన్‌లో ఉంచకూడదు..
‘‘ప్రస్తుతం దాదాపు అన్ని ఏసీల్లోనూ టైమర్లు ఉంటున్నాయి. మన గది ఎంత సేపటిలో చల్లబడుతుందో గమనించి ఆ సమయానికి టైమర్ పెట్టుకోవాలి. దీంతో ఏసీ 24 గంటలూ పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది’’అని ఆయన అన్నారు.
‘‘మనం మధ్యమధ్యలో ఏసీని ఆఫ్ చేయడంతో ఏసీ భాగాలన్నీ చల్లబడతాయి. దీంతో మనం మళ్లీ ఆన్‌చేసేటప్పుడు ఏసీ మెరుగ్గా పనిచేస్తుంది. ఏసీలో ఉండే ఎనర్జీ సేవింగ్ మోడ్‌ ఉండే దాన్ని ఉపయోగించుకోవాలి’’అని ఆయన వివరించారు.

6. తలుపులు, కిటికీలు మూసే ఉంచాలి.
చల్లగాలి బయటకు వెళ్లిపోకుండా కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసే ఉంచేలా చూసుకోవడంతోనూ ఏసీ బిల్లు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.‘‘ఇంటిలో తలుపులు, కిటికీలు ఎప్పుడూ మూసి ఉంచేలా చూడాలి. ఒకవేళ చల్లగాలి బయటకు వెళ్లిపోతుంటే ఎక్కువ సేపు కంప్రెజర్ పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు పెరిగే ముప్పుంటుంది’’అని రిహాన్ చెప్పారు.‘‘ఎండకూడ ఇంటిలోకి రాకుండా చూసుకోవాలి. గోడలకు బదులుగా గ్లాస్‌లు ఏర్పాటుచేసుకుంటే మందంగా ఉండే కర్టెన్లు ఉపయోగించాలి. దీంతో ఎండ లోపలకు రాకుండా ఉంటుంది’’అని ఆయన సూచించారు.అయితే, కిటికీ అద్దాలకు కర్టెన్లు లోపలవైపు వేసే బదులు, బయటకు వైపు వేస్తే మేలని అవికల్ సూచించారు.‘‘అద్దాలకు లోపలవైపు కర్టెన్లు ఉంటే, ఎండ వల్ల అద్దాలు వేడెక్కుతాయి. ఫలితంగా గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా ఏసీ ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. అదే అద్దానికి బయటవైపు కర్టెన్లు ఉంటే, అద్దాలపై పడే ఎండ తగ్గుతుంది’’అని అవికల్ చెప్పారు.

7. ఫ్రిడ్జ్‌లు, టీవీలను బయటే ఉంచాలి
ఎలక్ట్రానిక్ పరికరాలను రూమ్ బయటే ఉంచడంతోనూ కొంతవరకు ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.‘‘ఫ్రిడ్జ్‌లు, టీవీలు, కంప్యూటర్లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా ఏసీ ఎక్కువసేపు నడిపించాల్సి ఉంటుంది. ఈ వేడి చూడటానికి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు పాతవి అయ్యేకొద్దీ అవి ఉత్పత్తిచేసే వేడి కూడా పెరుగుతుంది’’అని రిహాన్ అన్నారు.

8. ఫ్యాన్ కూడా వేసుకుంటే మంచిది
ఏసీ నడిచేటప్పుడు ఫ్యాన్ కూడా వేసుకుంటే గది ఉష్ణోగ్రత సాధారణం కంటే కాస్త తక్కువగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
‘‘సాధారణంగా ఏసీలు నడిచేటప్పుడు ఫ్యాన్ వేసుకోకూడదని చెబుతుంటారు. దీని వల్ల కరెంటు బిల్లు ఎక్కువవుతుందని చెబుతుంటారు. కానీ దీనిలో నిజం లేదు’’అని అవికల్ అన్నారు.‘‘ఈ విషయంపై మేం ఒక అధ్యయనం చేపట్టాం. ఏసీతోపాటు ఫ్యాన్ కూడా వేసినప్పుడు సాధారణం కంటే ఉష్ణోగ్రత మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని దీనిలో తేలింది’’అని ఆయన చెప్పారు.
‘‘ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, మనం ఏసీల్లో టెంపరేచర్‌ను పెంచుతాం. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది’’అని ఆయన వివరించారు.ఈ సూచనలు పాటిస్తూ రాబోయే పవర్ బిల్లును కూడా దృష్టిలో ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా ఏసీ వినియోగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.