ఎలన్ మస్క్ ఎవరు? గొప్ప ధనవంతుడు. సాంకేతిక లోకాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్త. ఇతర గ్రహాల మీదికి దూకుతున్న ఔత్సాహికుడు. ..నిజానికి ఈ పరిచయాలేవీ అంతగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. వాటిని తను సాధించిన తీరే రోమాంచితం. ఆచితూచి మాట్లాడే నైజం లేదు. దూకుడుగా వేసిన అడుగు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందేమో అన్న భయం లేదు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో అన్న చింత లేదు. చాలామంది, లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు. అతికొద్దిమంది మాత్రం లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలన్ మస్క్ అలాంటి ఓ అరుదైన వ్యక్తి. ఎత్తుపల్లాల జీవితం, ఒకదానివెంట ఒకటిగా తరుముకొచ్చే వైఫల్యాలు, సమస్యలను ధిక్కరిస్తూ, సవాళ్లకు తొడగొడుతూ, సంక్షోభాలను రెచ్చగొడుతూ.. ఎలన్ మస్క్ అనే బుద్ధిజీవి సాగించిన సాహసయాత్ర కవర్ స్టోరీ..
*ఎంత గొప్ప మేధావి అయినా తన ఆలోచనలకు పరిమితులు విధించుకుంటాడు. గిరిగీసుకున్న చట్రంలోనే ఆవిష్కరణలు సాగిస్తాడు. ఎలన్ మస్క్ మాత్రం ఎప్పుడూ ఊహలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఎంత పెద్ద వ్యాపారి అయినా, తన పెట్టుబడి గురించి జాగ్రత్తపడతాడు. లాభనష్టాల బేరీజుతోనే లావాదేవీలు జరుపుతాడు. ఎలన్ ఎప్పుడూ భయపడింది లేదు. వింతగా ఆలోచించే శాస్త్రవేత్త, నిర్భయంగా ప్రవర్తించే వ్యాపారవేత్త… ఇద్దరూ ఒకరిలోనే ఉంటే… అదే ఎలన్.
*పోకిరీల మధ్య మేకపిల్లలా
ఎలన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు. తల్లి మేయ్ మస్క్. కెనడా మూలాలున్న మోడల్. ఎలన్ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన తర్వాత కూడా… అదీ తన 70వ ఏట వరకూ మోడలింగ్ చేస్తూనే ఉన్నారామె. తండ్రి ఎరోల్ మస్క్. ఇంజినీరింగ్ నుంచి మెరైన్ ఇంజినీరింగ్ వరకూ చాలా పనులే చేశాడు. అన్నిటికీ మించి తనకు ఓ పచ్చల గని ఉండేది. దీంతో తవ్వినకొద్దీ డబ్బే. బీరువాల్లో పట్టనంత కరెన్సీ. కాబట్టే, ఆ కుటుంబం విలాసంగా బతికేది. బాల్యం నుంచీ ఎలన్ ప్రవర్తన కాస్త వింతగా తోచేది. శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచించేవాడు. ఒక్కోసారి పేరు పెట్టి పిలిచినా కూడా పలికేవాడు కాదు. ఎలన్‌కి పదేళ్లయినా రాకముందే తల్లిదండ్రులు విడిపోయారు. ఎవరి దగ్గర ఉండాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు, తండ్రినే ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని త్వరలోనే తెలిసిపోయింది. తండ్రి వల్ల దారుణమైన అనుభవాలు చవిచూశాడు ఎలన్. శారీరకంగా, మానసికంగా అనేక హింసలు అనుభవించాడు. ఇప్పటికీ తన తండ్రి గురించి కానీ, ఆయన చేతిలో నలిగిపోయిన బాల్యం గురించి కానీ చెప్పేందుకు ఇష్టపడడు. ‘మా నాన్న దుర్మార్గానికి ప్రతిరూపం. ఒక మనిషి ఎంత దారుణానికి ఒడిగట్టగలడో, అంతా తను చేయగలడు’ అని ఓ సందర్భంలో భారంగా వెల్లడించాడు.
ఎలన్ జ్ఞాపకశక్తి అమోఘం. ఏం చదివినా ఇట్టే గుర్తుండిపోయేది. తన సృజన అసాధారణం. రకరకాల ఊహలతో మెదడు పొంగిపొర్లేది. పైగా అంతర్ముఖుడు. ఆ బెల్లంకొట్టిన రాయిని చూసి తోటి పిల్లలు ఏడిపించేవారు. తరచూ ఆ అల్లరి శ్రుతి మించేది. నరకం చూపించేవారు. తల మీద సోడా కేన్లు విసురుతూ, మెట్ల మీది నుంచి తోసేస్తూ వినోదం చూసేవాళ్లు. ఆ హింస శ్రుతిమించి ఒకసారి ఎలన్ ఆసుపత్రి పాలయ్యాడు.
*తనకంటూ ఓ లోకం
హింసించే తండ్రి, వేధించే నేస్తాలు… వీళ్ల నుంచి తప్పించుకోవాలి. ఎలా? మొత్తానికి ఓ దారి దొరికింది. వీడియో గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. అది కాలక్షేపం కాదు. వ్యసనమూ కాదు. ఓ ఉపశమనం! ‘కొద్దిరోజులకు ఎవరో డిజైన్ చేసిన ఆట నేను ఆడటమేమిటి?’ అనిపించింది. బ్లాస్టర్ అనే సరికొత్త వీడియో గేమ్‌ను రూపొందించాడు. కొద్దిరోజులకు దాన్ని 500 డాలర్లకు అమ్మాడు. ఎలన్‌కు కామిక్ బుక్స్ అంటే ఇష్టం. నిజానికి, 1980లలో పిల్లల్ని కామిక్ బుక్స్ విపరీతంగా ఆకర్షించేవి. వాటిలోనూ సైన్స్ ఫిక్షన్ ఆధారంగా రూపొందించిన కథలు… ఎలన్‌ను మరో లోకానికి తీసుకెళ్లేవి. పసి ఊహలకు రెక్కలిచ్చేవి. దుర్మార్గులకు నిలయమైన ఈ లోకం నుంచి దూరంగా.. మరో ప్రపంచానికి వెళ్లిపోవాలని కలలు కనేవాడు. పైగా అది మనిషి చంద్రుడిని జయించిన సమయం. చంద్రుడి మీద అడుగుపెట్టడమే కాకుండా, భవిష్యత్తులో మనిషి ఇతర గ్రహాల మీద నివసించడం సాధ్యమే అని చెప్పిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పట్ల ఎలన్‌కు ఆరాధన ఏర్పడింది. బాగా చదువుకొని తనదైన కెరీర్ నిర్మించుకోవడానికి అమెరికా వెళ్లాలనుకున్నాడు.
కెనడా గుండా అమెరికాను చేరుకోవడం తేలికని గ్రహించాడు. తల్లి ఎలాగూ ఆ దేశ పౌరురాలే కాబట్టి, ఆ బంధంతో కెనడా పాస్‌పోర్ట్ సంపాదించే ప్రయత్నం చేశాడు. ఈలోపు ఏం చేయాలనే ప్రశ్న మొదలైంది. పైగా అప్పట్లో దక్షిణాఫ్రికాలోని యువత తప్పనిసరిగా సైన్యంలో చేరాలనే నిబంధన ఉండేది. ఎలన్‌కేమో అమెరికా వెళ్లాలన్న ఆశ. నిర్బంధ సైనిక శిక్షణను తప్పించుకోవడానికి… ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాడు. కెనడా పాస్‌పోర్ట్ లభించగానే సరిహద్దులు దాటేశాడు. రెండేండ్ల తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. అక్కడ ఆర్థిక, భౌతిక శాస్త్రాల్లో డిగ్రీలు సంపాదించాడు. ఎలన్ దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. తెలివైనవాడు కాబట్టి, డబ్బు సంపాదించే మార్గమూ కనుగొన్నాడు. తను ఉండే గది చాలా పెద్దది. దాన్ని క్లబ్‌గా మార్చేశాడు. అప్పటినుంచి ఖర్చులకు తడుముకోవాల్సిన ఇబ్బంది రాలేదు. అంతలోనే చేతిలోకి డిగ్రీలు వచ్చాయి. స్టాన్‌ఫర్డ్‌లో డాక్టరేట్ చేసే అవకాశమూ వచ్చింది. కానీ ఎలన్ మనసెందుకో అటువైపు వెళ్లడానికి ఇష్టపడలేదు. పేలిపోతుందేమోనని భయపడిన ఇంటర్నెట్ బుడగ… అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ భవిష్యత్తును శాసించే స్థాయికి సిద్ధపడుతున్న సమయం అది. ఆ ప్రయాణంలో తానూ భాగస్వామి కావాలనుకున్నాడు. స్టాన్‌ఫర్డ్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
*సత్రం భోజనం… మఠం నిద్ర!
ఎలన్‌కు కంప్యూటర్ కొత్తేమీ కాదు. తనకు ఇష్టమైన లోకమే అది. అందుకే తమ్ముడు కింబల్‌తో కలిసి ‘జిప్2’ అనే కంపెనీ స్థాపించాడు. స్థానికంగా ఎక్కడ ఏ వీధి, ఏ దుకాణం, ఏ కంపెనీ ఉన్నాయో మ్యాపింగ్ చేసి వినియోగదారులకు అందించడం వీరి పని. ఓ రకంగా గూగుల్ మ్యాప్స్‌కు తొలి దశగా చెప్పుకోవచ్చు. కానీ ఆ ఆలోచనకు ఓ రూపం ఇవ్వడం ఏమంత సులభం కాదు. ఒకే గదిలో, ఒక్కగానొక్క కంప్యూటర్ మీద అందరూ పనిచేయాలి. అక్కడే నిద్ర. ఇక ఇంటర్నెట్ వేగం గురించి చెప్పనవసరం లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి దగ్గర్లో ఉన్న వైఎంసీయే సత్రానికి వెళ్లేవారు. పరిస్థితులకు, ప్రతిబంధకాలకు ఏ మాత్రం భయపడలేదు ఎలన్. ‘కొత్త బిజినెస్ అంటే, మెలకువగా ఉన్న ప్రతి క్షణం కష్టపడి తీరాల్సిందే! 50 గంటలు పనిచేసే చోట వంద గంటలు పని చేస్తే… ఫలితం కూడా రెట్టింపు వస్తుంది’ అంటాడు ఎలన్.
ఎలన్ కష్టం వృథా కాలేదు. జిప్2 మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. వార్తాపత్రికలు కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. 1999లో దాన్ని ప్రముఖ కంప్యూటర్ సంస్థ కాంపాక్ 307 మిలియన్ డాలర్లకు కొనుక్కొంది. కానీ అందులో కేవలం 7 శాతం మాత్రమే ఎలన్ చేతికి దక్కింది. అయితేనేం! సాఫ్ట్‌వేర్ సత్తాను రుచి చూపించింది. వెంటనే ఎక్స్.కామ్ పేరుతో ఒక ఆన్‌లైన్ పేమెంట్ సంస్థను మొదలుపెట్టాడు. ఇది కూడా కొత్త ఆలోచనే. రోజువారీ పనుల కోసం డబ్బు లేదా చెక్ రూపంలో కాకుండా… ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అదే రంగంలో అడుగులు వేస్తున్న కన్‌ఫినిటీ అనే సంస్థకు దాన్ని అమ్మేశాడు. అదే ఇప్పటి పేపాల్. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఆన్‌లైన్ లావాదేవీలను శాసిస్తున్న దిగ్గజం. అలా ఒక్కో అడుగే వేస్తూ… ఒక్కో సంస్థను ప్రారంభిస్తూ క్రమంగా వేగం పెంచాడు ఎలన్. తన దగ్గర పోగైన మూలధనంతో రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టాడు.
*టెస్లా – ఘన విజయం!
టెస్లా ఛత్రం కింద ఎలక్ట్రిక్ కార్లు రూపొందించేందుకు నిద్రాహారాలు మాని శ్రమించాడు. 2006లో టెస్లా రోడ్‌స్టర్ కారు విడుదలైంది. అదో సంచలనం! పికప్‌లో, వేగంలో ఇంధనంతో నడిచే కార్లకు దీటుగా నిలబడి చరిత్ర సృష్టించింది రోడ్‌స్టర్. ఈ విజయంతో ఎలన్‌కు మార్కెట్ మీద పట్టు దొరికింది. కానీ, టెస్లా లాభాలకు రావడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత, ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం అది ట్రిలియన్ డాలర్ల కంపెనీ! ఇప్పటికీ టెస్లా కార్ల దృఢత్వం, ఆటోపైలట్ మోడ్ లాంటి విషయాల మీద ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎలన్ ఇవేవీ పట్టించుకోడు! ఆ మాటకు వస్తే, టెస్లా బ్రాండ్ వాల్యూ పెంచేందుకు ప్రకటనల మీద కూడా తను ఖర్చుపెట్టడు. ‘మన ఉత్పత్తే మాట్లాడాలి. మనం పెట్టే ప్రతి రూపాయి దాన్ని మెరుగుపరిచేలా ఉండాలి’ అన్నది తన ఆలోచన.
*స్పేస్ ఎక్స్ – నింగిలోకి అడుగు
ఎలన్‌కు కష్టాల నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు కనిపించేవి. ఒకటి- కంప్యూటర్, రెండు- అంతరిక్షం. అందుకే ఈసారి అంతరిక్షం వైపు అడుగు వేశాడు. కుజగ్రహం మీద మొక్కలు పెంచే ‘మార్స్ ఒయాసిస్’ అనే ప్రాజెక్టు గురించి ప్రచారం చేశాడు. భవిష్యత్తులో ఎప్పటికైనా మనిషి అక్కడికి వలస వెళ్లే అవకాశం ఉందని బలంగా నమ్మాడు. స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు. స్పేస్ ఎక్స్ పరిశోధనలు చేయడానికి, అంతరిక్షంలో అడుగులు వేయడానికి రాకెట్లు కావాలి. అవి రష్యాలో అయితే చవకగా దొరుకుతాయని అక్కడికి వెళ్లాడు. కానీ తీవ్ర అవమానం ఎదురైంది. మాటామాటా పెరిగి ఓ అధికారి తన మీద తపుక్కున ఉమ్మేసినంత పనిచేశాడు. మరోసారి రష్యా పర్యటనలో ఓ మూడు రాకెట్లు దక్కినా… ఆ ఖర్చు, శ్రమ చూసి ఎలన్ మనసు చివుక్కుమంది. తనే స్వయంగా రాకెట్లు రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అదేమంత తేలికగా జరగలేదు. వరుస వైఫల్యాలు ఎదురయ్యాయి. నిప్పు ముట్టించిన రాకెట్లు నింగికెగరకుండానే పేలిపోయాయి. అంతటి మొండి మనిషి కూడా కుంగిపోయాడు.
పీడకలలతో రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచేవాడు. దానికి తోడు అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేటు సంస్థల ఉనికి ప్రమాదకరమని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ విమర్శించాడు. ఎవరినైతే తాను ఆరాధిస్తూ పెరిగాడో, ఆ వ్యక్తే విమర్శించడం ఊహించని దెబ్బ. ఓ పక్క వనరులు కరిగిపోతున్నాయి, అనుమానాలు పెరిగిపోతున్నాయి. టెస్లా కూడా అప్పటికింకా నష్టాల్లోనే ఉంది. అన్నిటికీ మించి అమెరికా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నది. చీకటి మరింత చిక్కబడుతున్న కొద్దీ వెలుగు జాడకు అవకాశం పెరుగుతుంది. వైఫల్యాలూ అంతే! 2008లో తన ఫాల్కన్-1 కక్ష్యను చేరుకున్న తొలి ప్రైవేట్ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. అంతే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నాసానే ముందుకు వచ్చి… అంతరిక్ష కేంద్రానికి సామాన్లు, వ్యోమగాములను చేరవేసే కాంట్రాక్టును అందించింది. క్రమంగా అంతరిక్ష రంగంలో ఉన్న ‘తొలి’ ప్రైవేట్ రికార్డులన్నీ స్పేస్ ఎక్స్ పరమయ్యాయి. తన పేరు మీద ఇప్పుడు లెక్కలేనన్ని ఉపగ్రహాలు, రాకెట్లు దూసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో చంద్రుడు, కుజుడి మీదకు మనుషులను చేరవేయాలన్నదే తన లక్ష్యం.
*బోర్ కొట్టని కంపెనీ
టెస్లాతో నేల మీద విజయం సాధించాడు. స్పేస్ ఎక్స్‌తో అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. ఇక పాతాళం మీద దృష్టి పడింది. లాస్ ఏంజెల్స్ ట్రాఫిక్‌తో విసిగిపోయిన ఎలన్, సొరంగ మార్గాలు నిర్మించాలనుకున్నాడు. ఒక రోజులో ఎంత లోతు తవ్వగలమన్నది అంచనా వేసేందుకు స్పేస్ ఎక్స్ ప్రాంగణంలోనే గొయ్యి తవ్వించేశాడు. భూగర్భ ప్రయాణం వల్ల 45 నిమిషాల ప్రయాణం కాస్తా అయిదు నిమిషాల్లో పూర్తయిపోతుందన్నది ఎలన్ ఆశ. ప్రస్తుతం హాత్రోన్, లాస్ వెగాస్ వంటి చోట్ల సొరంగాలు తవ్వుతున్నారు. శాన్ హోసె, ఫ్లోరిడా ప్రభుత్వాలతోనూ చర్చలు జరుగుతున్నాయి. అన్నట్టు ఈ కంపెనీ పేరు ‘ద బోరింగ్ కంపెనీ’.
ఒక కంప్యూటర్ చిప్ మన మెదడులో జరిగేవన్నీ రికార్డు చేసి, అవసరం అయినప్పుడు ఒక బ్యాకప్‌లా ఉపయోగపడితే! చూపులేనివారికి, పక్షవాతం లాంటి సమస్యలు ఉన్నవారికి మెదడులో కొన్ని పరికరాలను అమర్చి కొత్త జీవితం ఇవ్వగలిగితే! చదవాలనుకున్న విషయాన్ని నేరుగా మెదడులోకి ఎక్కించగలిగితే!… ఇలాంటి లక్ష్యాలతో ఏర్పాటైంది న్యూరాలింక్. న్యూరాలింక్‌తో పాటుగా సౌర విద్యుత్ కోసం ‘టెస్లా ఎనర్జీ’, రవాణా కోసం ‘హైపర్ లూప్ ప్రాజెక్ట్’… ఇలా చాలా లక్ష్యాలే ఉన్నాయి తనకి. వాటివైపుగా వేగంగా అడుగులు వేస్తున్నాడు కూడా.
*పేపాల్ మాఫియా!
పేపాల్ సంస్థను ఈబే విలీనం చేసుకున్న తర్వాత… అక్కడి కార్పొరేట్ ధోరణులు చాలామంది ఉద్యోగులకు నచ్చలేదు. సృజనకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా ఊపిరాడని ఆ వాతావరణం నుంచి బయటపడ్డారు. అలా బయటికి వచ్చినవాళ్లంతా తరచూ కలుసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకునేవారు. ఈ బృందాన్నే ‘పేపాల్ మాఫియా’ అని పిలుస్తారు. లింక్‌డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు- రీడ్ హాఫ్‌మెన్, యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు- స్టీవ్ ఛెన్, రెడిట్ మాజీ సీయీవో- ఇషన్ వాంగ్… ఇలా పేపాల్ మాఫియాలో ఎంతోమంది సభ్యులు ఇతర రంగాల్లో అద్భుతాలు సాధించారు. ఆ మాటకు వస్తే సిలికాన్ వ్యాలీ ఎదుగుదలకు వీళ్లు పునాదిరాళ్లుగా నిలిచారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన ‘ప్రేమల్ షా’ కూడా ఒకరు. ప్రేమల్ ‘కివ’ లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవారంగంలో అనూహ్యమైన విజయాలను సాధిస్తున్నారు. ఇంతకీ ఈ మాఫియా విజయానికి కారణం ఏమిటి?
పేపాల్‌లో పని చేసే సమయానికి వీళ్లంతా ఉరకలేసే యువత. వైవిధ్యమైన ఆలోచనలతో, తమకంటూ ఓ ఉనికి కోసం పాటుపడేవారు. తొలినాళ్లలో వీళ్లందరూ ఓ జట్టుగా నిలబడేందుకు సంస్థ కూడా ప్రోత్సహించింది. పేపాల్ అనుభవం వారికి ఆత్మవిశ్వాసాన్ని అందించడమే కాదు, వినియోగదారుల దృష్టి కోణం నుంచి సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఏర్పరిచింది. ఈ మాఫియాలో ఎలన్ ముఖ్యసభ్యుడు!
تصویر
ఎలన్‌కు భారత్‌తో అంత సత్సంబంధాలు లేవు. దేశంలో ఇంటర్నెట్‌కు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే, స్టార్‌లింక్ సేవలు అందిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడనే అభియోగం ఉంది. ఇక టెస్లా బ్యాటరీ కార్ల మీద పన్నులు తగ్గించాలంటూ ఎలన్ చేసిన అభ్యర్థనను మోదీ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. ఎలన్ త్వరలోనే మన దేశంలో పర్యటించి, ఈ వివాదాలు పరిష్కరించుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
సౌత్ చైనా ‘మార్నింగ్ పోస్ట్ ’ ప్రకారం… చైనా వ్యాపారులకు ఎలన్ అంటే విపరీతమైన అభిమానం. అతని దక్షత మీద అపారమైన నమ్మకం. గత ఏడాది వరకూ ఆయన పేరుతో 273 ట్రేడ్‌మార్క్స్ నమోదయ్యాయి. రెస్టారెంట్ల దగ్గర నుంచి బట్టల వరకూ ఎన్నో వ్యాపారాలు ఎలన్ పేరుతో నడుస్తున్నాయి. ఇక ఎలన్‌కు కూడా షాంఘైలో టెస్లా కార్లను తయారుచేసే ఫ్యాక్టరీ ఉంది.
‘ద స్పై హూ లవ్డ్ మీ’ అనే జేమ్స్ బాండ్ సినిమాలో జలాంతర్గామిగా మారిపోయే ఓ కారు కనిపిస్తుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత దుమ్ముకొట్టుకుపోయిన ఆ కారును ఓ జంట వంద డాలర్లకు కొన్నది. కానీ వాళ్లకు తెలియదు… ఆ సినిమా చూసిన ఎలన్ అనే పిల్లాడు దాని మీద మనసు పారేసుకున్నాడని! కొన్నాళ్లకు ఎలన్, దాదాపు మిలియన్ డాలర్లు పెట్టి దాన్ని వేలంలో సొంతం చేసుకున్నాడు. ఆ నమూనా ఆధారంగా సైబర్‌ట్రక్ అనే వాహనాన్ని రూపొందించాడు.
ఎలన్ రెండుసార్లు పెండ్లి చేసుకున్నాడు. ఇద్దరితోనూ విడాకులయ్యాయి. ఆ తర్వాత శాశ్వతమైన బంధంలో ఇమడలేదు. తన మొదటి కొడుకు పదివారాలకే అనూహ్యంగా చనిపోయాడు. ఆ తర్వాత ఏడుగురు పిల్లలు పుట్టారు. ఒక కొడుకు పేరు ‘X AE A-XII’. లెక్కల్లో X, కృత్రిమ మేధసు సూచనగా AE, తనకి ఇష్టమైన విమానం Archangel 12 కి గుర్తుగా A-XII… ఇదీ పేరు వెనుక విషయం. ఇక ఈమధ్యే ప్రియురాలు గ్రిమ్స్‌కి పుట్టిన బిడ్డకు ఎక్స్ మెన్‌లో ఓ పాత్ర ఆధారంగా Exa Dark Sider Musk అని పేరు పెట్టుకున్నారు.
‘ఐరన్ మ్యాన్’లో కథానాయకుడి పేరు టోనీ స్టార్క్. ధనికుడైన టోనీ, సాంకేతికత సాయంతో దుష్టశిక్షణ చేస్తుంటాడు. ఈ పాత్రను సినిమాగా మలిచేందుకు ఎలన్ మస్క్‌ను ప్రేరణగా తీసుకున్నారు. ఆ పాత్రధారి రాబర్ట్ డౌనీ జూనియర్, ఎలన్‌తో కొంత సమయాన్ని గడిపి అతని హావభావాలను గమనించే ప్రయత్నం చేశాడు. అన్నట్టు ఎలన్ ఈ సినిమాలో ఓ చోట తళుక్కున మెరుస్తారు.
*సెలవులు సరిపడవు
నిరంతరం ఏదో ఒక కంపెనీ పెడుతూ, ఏదో ఒక ప్రాజెక్టులో మునిగితేలే ఎలన్ లాంటి వాళ్లు… వేడెక్కిపోయిన బుర్రను చల్లార్చుకునేందుకు కాస్త విరామం తీసుకోవడం సహజం. కానీ ఎలన్‌కు ఆ అదృష్టం లేదు. కాస్త స్థిరపడిన తర్వాత… మొదటిసారి తను విహారయాత్రలకు వెళ్లినప్పుడు, అంతరిక్షంలోకి ప్రయోగించిన కొన్ని ప్రైవేట్ రాకెట్లు పేలిపోయాయి. ఆ రంగం మీద ఆశలు పెంచుకున్న ఎలన్‌కు ఇది చాలా బాధ కలిగించింది. ఇక రెండోసారి విహారయాత్రకు వెళ్లినప్పుడు, తన స్పేస్ ఎక్స్ రాకెట్టే కుప్పకూలింది. తను ఎక్స్.కామ్‌కు సీయీవోగా ఉన్న సమయంలో, విహారయాత్రకని సిడ్నీ వెళ్లగానే, కంపెనీ బోర్డు తన మీద అవిశ్వాస తీర్మానం చేపట్టింది. తిరుగు టపాలో కాలిఫోర్నియాకు చేరుకోవాల్సి వచ్చింది. మరో సందర్భంలో ఎలన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ తీవ్రమైన మలేరియా బారిన పడ్డాడు. సకాలంలో గుర్తించక చావు అంచుల వరకూ వెళ్లాడు. అందుకే ‘విహారయాత్ర హానికరం’ అంటాడు ఎలన్. వాటికి వీలైనంత దూరంగా ఉంటున్నాడు కూడా!
*నమ్మేదే లే
ఎలన్ మతపరమైన బడిలోనే చదువుకున్నాడు. ధార్మిక గ్రంథాల మీద అవగాహన ఉంది. కానీ చిన్నతనంలో ఎదుర్కొన్న బాధలో, విజ్ఞాన శాస్త్రం మీద నమ్మకమో… తనని హేతువాదిగా మార్చేశాయి. ‘పై నుంచి ఎవరో మనల్ని నిరంతరం చూస్తున్నారనీ, మన చర్యలని బేరీజు వేస్తున్నారనీ అనుకోను’ అంటాడు ఎలన్. దేవుడి ఉనికిని కొట్టిపారేయడు కానీ, దాన్ని నిరూపించాలంటాడు (ఆగ్నాస్టిక్). అందుకే తను మృత్యువు అంచుల వరకూ వెళ్లిన ఆఖరి క్షణంలో కూడా దేవుడిని ప్రార్థించలేదు. చావు గురించి కూడా ఎలన్‌కు తనవైన అభిప్రాయాలు ఉన్నాయి. అది ఒక సహజమైన ప్రక్రియ అనీ, జీవితం నుంచి విముక్తి అనీ నమ్ముతాడు. ఆరోగ్యంగా బతకడం మంచిదే కానీ… మరీ ఎక్కువ రోజులు ఉండి కూడా ఉపయోగం లేదంటాడు. ‘మనుషులు ఎంతకాలం బతికినా వాళ్ల అభిప్రాయాలను మార్చుకోరు. అలాంటివాళ్ల వల్ల సమాజానికి ఊపిరాడని పరిస్థితి వస్తుంది. నాగరికత ఎదగాలంటే, ఆ పాత నీరు పోవాల్సిందే’ అన్నది ఎలన్ మాట.
*మాటకు స్వేచ్ఛ
ఎలన్ గొప్ప వక్త కాకపోవచ్చు. కానీ తన నిర్భీతి వల్ల, చెప్పాలని అనుకున్నదాన్ని స్పష్టంగా ప్రకటించగలడు. నాటి ట్రంప్ ప్రభుత్వం పర్యావరణం కోసం తగిన చర్యలు తీసుకోవడం లేదనే కారణంతో తను ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రెండు కమిటీల నుంచి బయటికి వచ్చేశాడు. ఉక్రెయిన్ మీద రష్యా ప్రకటించిన యుద్ధాన్ని నిరసించడమే కాకుండా, అక్కడి పౌరులకు నిరంతరాయంగా ఇంటర్నెట్ లభించేందుకు స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌లింక్ పరికరాలను పంపాడు. అయితే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు, తన మాటలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని కూడా ఎలన్ మర్చిపోతుంటాడు. అలా ఒకసారి తన షేర్లు అమ్మాలా వద్దా అనే విషయం మీద ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని కోరినప్పుడు, ఆ చర్య స్టాక్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంకొన్నిసార్లు తను చేసిన ట్వీట్ల వల్ల న్యాయస్థానాల్లో పరువునష్టం దావాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్భయమో, తెగింపో, విజయగర్వమో… కారణం ఏదైతేనేం, ఎలన్ తీరు మాత్రం మారలేదు!
ఇదీ క్లుప్తంగా ఎలన్ కథ. తను ఆరుగంటలకు మించి నిద్రపోడు. ఒక్కసారి సీట్లో కూర్చోగానే పనిరాక్షసుడిగా మారిపోతాడు. ఆడంబరాలకు దూరంగా ఉంటాడనీ పేరు. తన సంపదలో అధికశాతం సమాజానికి ఇచ్చేస్తానంటూ గివింగ్ ప్లెడ్జ్ మీద సంతకం కూడా చేశాడు. ఒక మనిషి జీవితంలో ఎన్ని మలుపులు సాధ్యమో, అన్నీ తన ప్రయాణంలో కనిపిస్తాయి. ఆ మలుపుల్లో చాలావరకూ స్వయం కృషితో సొంతం చేసుకున్నవే.