అవకాడోలో అపారమైన పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అమెరికా హార్ట్ అసోసియేషన్ వాళ్లు చేసిన తాజా అధ్యయనంలో మరోసారి ఈ విషయం బయటపడింది. వారానికి రెండు కప్పుల అవకాడో ముక్కల్ని తిన్నవారికి మిగతావారితో పోలిస్తే గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం 16 శాతం తక్కువని తేలింది. అడపాదడపా కాకుండా క్రమం తప్పకుండా తీసుకుంటేనే ఫలితాలు బాగా కనిపిస్తాయి. అవకాడోలో విటమిన్- ఎ, సి, ఇ, బి6 పుష్కలం. శరీర ద్రవాల సమతౌల్యంలోనూ అవకాడో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా. మెదడు, కళ్లు, గుండె, రక్తనాళాల సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్‌ను గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డీఎన్‌ఏను కాపాడటమే కాకుండా పలు రకాల క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. వీటిలోని డైటరీ ఫైబర్స్ జీవక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో ఎక్కువగా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తీసుకుంటారు. అధిక బరువు సమస్యా ఉండదు.