Food

ఆవ‌కాయ ప‌చ్చ‌డి…ఎప్పుడు పుట్టింది?

ఆవ‌కాయ ప‌చ్చ‌డి…ఎప్పుడు పుట్టింది?

ఆవకాయ, ఊరగాయ అనేవి పరిచయం అక్కర్లేని పేర్లు..వింటుంటేనే నోరూరుతూ ఉంటుంది.. ఎన్నో రకాల పదార్దాలతో ఆవకాయ/ఊరగాయల్ని పెట్టినప్పటికి మామిడికాయతో పెట్టే పచ్చడి ప్రత్యేకం… ఏ దేశమేగినా ఎందుకాలిడినా..ఎన్ని రుచులు చూసినా మన మాగాయకి సాటి లేనే లేదు..అందుకే విదేశాలకు వెళ్లేవారు కూడా ప్రత్యేకంగా పార్శిల్ చేయించుకుని మరీ పట్టుకెళ్తారు..వేసవిలో పండుగలు ఉండవు కానీ మామిడి కాయ పచ్చడి పెట్టడమే ప్రత్యేకంగా జరుపుకునే గడపలున్నాయి రాష్ట్రాల్లో.. అనడంలో అతిశయోక్తి లేదు..అసలు ఇంతకీ ఈ మాగాయ(మామిడి కాయ పచ్చడి) అనేది ఎప్పుడు పుట్టింది..ఎక్కడ పుట్టింది..ఇందులో రకాలెన్ని.. ఈ మామిడికాయ పచ్చడి ఎలా పెడతారు..లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
*ఎక్కడ పుట్టింది.? ఎప్పుడు పుట్టింది??:
పచ్చడిలను తమిళులు, తెలుగు వాళ్లు ఎక్కువగా ఉపయోగించినప్పటికి తెలుగు వారే వీటిని కనిపెట్టారనడానికి ఆధారాలున్నాయి.. ఈ పచ్చళ్ల చరిత్ర నిన్న మొన్నటిది కాదు.. ఎప్పుడో 14వ శతాబ్దం నుండే ఇవి వాడుకలో ఉన్నాయని చరిత్ర చెబుతుంది. 14వ శతాబ్దంలోని క్రీడాభిరామంలో ప్రచురించపడిన పద్యంలో నాలుగు నైదు నంజులున్ (నాలుగైదు ఊరగాయలు) అని ఉండడాన్ని బట్టి గమనిస్తే ఇవి ఆ కాలం నుండి ఉన్నాయని తెలుస్తుంది.
*దీని తర్వాత 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలోనూ ఊరగాయను గురించి ప్రస్తావన ఉన్నది.ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడు అతిధులకు ఏ ఏ కాలాలలో ఏఏ వంటలను వడ్డించేవాడు అనేది వివరించారు శ్రీకృష్ణ దేవరాయలు.. అందులో రకరకాల పచ్చళ్లను శీతాకాలపు ఆహారపు పదార్ధాలలో చేర్చాడు.. మనం వేసవిలో తయారు చేసిన పచ్చళ్లను తర్వాత వచ్చే కాలాల్లో వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు వేసుకుని తినడానికి ఆసక్తి చూపుతాము.. ఇది 16వ శతాబ్దం నుండి ఉంది అనడానికి ఆముక్తమాల్యదలోని పద్యమే నిదర్శనం.
*మామిడి కాయ పచ్చడిని ఎన్ని రకాలుగా పెడతారు:
మామిడి కాయ పచ్చడి తెలుగు వంటకమే అయినప్పటికి దీన్ని తెలంగాణా,ఆంధ్రా రాష్ట్రాలలో విభిన్న పద్దతుల్లో పెడతారు..తెలంగాణా వాళ్లు ఆవపిండి,అల్లం,కారం, వెల్లులి,మెంతిపిండి వేసి చేసే కారంగా ఉండే మామిడికాయ పచ్చడిని తినడానికి ఇష్టపడతారు.. ఆంధ్రా వాళ్లు ఆవకాయని రెండు రకాలుగా పెడతారు అది కారం ఆవకాయ, రెండోది తీపావకాయ.. తీపావకాయకి బెల్లం వేసి బెల్లం ఆవకాయని పెడతారు.అలవాట్ల ప్రకారం మరికొంతమంది మసాలా ఆవకాయలో మసాలాపొడి(లవంగాలు,చెక్క) , నీళ్లావకాయలో ఇంగువ , సున్నం వేసి చేస్కుంటారు..మాములుగా పెట్టుకునే పచ్చడికి నీటిని తగిలించరు..పచ్చడి పాడవుతుందని..కానీ నీళ్లావకాయలో నీటిని కలిపి చేస్తారు…ఇది కూడా ఏడాది కాలం పాటు నిల్వ ఉంటుంది..కానీ కొద్దిమంది మాత్రమే దీనిని వినియోగిస్తారు.
*ఎండు మాగాయ్, పచ్చి మాగాయ్ అనే పచ్చళ్లు కూడా పెడతారు.. మామిడికాయ ముక్కల్ని తీగలుగా కట్ చేసి కాసేపు గాలికి ఆరబెట్టి పచ్చడి పెడతారు అది పచ్చిమాగాయ, అవే మామిడి ముక్కల తీగల్ని ఎండబెట్టి వాటిని పచ్చడిగా పెట్టుకుంటారు అది ఎండు మాగాయా..ఇలా ఎండబెట్టిన ముక్కల్నే ఏడాది పాటు నిల్వ ఉంచుకుని పప్పు వండుకునేటప్పుడు కూడా వాడుకుంటుంటారు..వేసవికాలంలో దొరికే మామిడికాయని ఏడాదిపాటు మిస్ అవ్వకుండా తినడానికి ఉంటుంది.మామిడికాయ పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు..మన సినిమాల్లో పాటలుగా, మన రోజువారి జీవితంలో సామెతలుగా కూడా ఇది భాగమైపోయింది.