బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 మంగళవారం.. పార్లమెంటు సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకాబోరని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఆమె 70 ఏళ్ళ పాలనా కాలంలో గర్భిణిగా ఉన్న 1959, 1963 సంవత్సరాల్లో మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ తర్వాత హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. అయితే ఇది అధికార మార్పిడి దిశగా పడుతున్న అడుగులకు సంకేతమని భావిస్తున్నారు.
బ్రిటన్ పార్లమెంటు చరిత్రలో దాదాపు గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా వార్షిక సమావేశాలు ప్రారంభానికి ఎలిజబెత్ రాణి-2 గైర్హాజరయ్యారు. మంగళవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాణి ప్రతినిధిగా ఆమె కుమారుడు, వారసుడైన ప్రిన్స్ ఛార్లెస్ (73) తొలి ఉపన్యాసం చేశారు. బ్రిటన్ రాచరిక వ్యవస్థలో రాజ్యాంగపరంగా కీలకపాత్ర పోషించే రాణి తన ప్రసంగాన్ని చదివి వినిపించటం ఏటా సంప్రదాయంగా వస్తోంది. ప్రభుత్వం చేపట్టే పనుల వార్షిక ఎజెండాపై ఈ ప్రసంగ పాఠాన్ని అధికార పార్టీయే సమకూరుస్తుంది. 96 ఏళ్ల రాణి ఆ బాధ్యతను ప్రిన్స్ ఛార్లెస్‌కు అప్పగించటం అధికార మార్పిడి దిశగా పడుతున్న అడుగులకు సంకేతమని భావిస్తున్నారు.
ఎలిజబెత్ రాణి ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్న చార్లెస్.. పక్కన రాణి కిరీటం’హర్ మెజెస్టీ’ అంటూ చార్లెస్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాణి గైర్హాజరీపై బకింగ్ హాం ప్యాలెస్ నుంచి ఎటువంటి వివరణాత్మక ప్రకటన వెలువడకపోయినా, వయోభారం కారణంగా గత కొంతకాలంగా ఆమె క్రమంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సరిగా నడవలేకపోతున్నారు. గతంలో తాను గర్భవతిగా ఉన్నప్పుడు 1959, 1963 వార్షిక పార్లమెంటు సమావేశాలకు మాత్రమే రాణి గైర్హాజరయ్యారు. ఇటీవల ఆమె కొవిడ్ బారినపడి కోలుకున్నారు. గత నెల తన భర్త ప్రిన్స్ ఫిలిప్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్న రాణి ఓ చేత కర్ర పట్టు కోగా, ప్రిన్స్ ఆండ్రూ ఆమెకు సహకరించారు. వచ్చే నెల (జూన్ 2 – 5) నాలుగు రోజులపాటు జరగనున్న తన ప్లాటినం జూబ్లీ (70 ఏళ్ల పాలన పూర్తి) వేడుకల్లో పాల్గొనేందుకు రాణి సిద్ధమవుతున్నారు.