అంతర్జాతీయ ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? దానికి అవసరమైన డాక్యుమెంట్లన్నీ మీ దగ్గర ఉన్నాయా? మీరు వాక్సిన్ వేయించుకున్నారా లేదా అన్నది కూడా ఇమిగ్రేషన్ అధికారులు సమీప భవిష్యత్తులో చూడబోతున్నారు. దీని కోసమే అంతర్జాతీయ సమాజాలు వాక్సిన్ పాస్‌పోర్ట్‌ను తెరపైకి తెస్తున్నాయి..
*కరోనా నివారణకు వాక్సిన్ వేయించుకున్న పౌరులకు డిజిటల్ పాస్‌పోర్ట్‌లను రూపొందించేందుకు డెన్మార్క్ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. డిజిటల్ ట్రావెల్ పాస్‌ను ప్రారంభించాలని ఇథిహాద్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్ ఎయిర్‌వేస్ ఆలోచిస్తున్నాయి. జపాన్‌లోని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో కామన్‌పాస్ యాప్‌ను పరీక్షించింది. ఆ యాప్ ద్వారానే ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ తమ ప్రయాణికుల కొవిడ్- 19 స్టేటస్‌ను ఆరా తీసింది. తాము కూడా ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు ఆస్ట్రేలియాకి చెందిన కాంటాస్ ఎయిుర్‌లైన్స్ ప్రకటించింది. కరోనా కారణంగా ఓ ఏడాదిగా అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. ఇలా ఇంకా ఎంత కాలమో తెలీదు. కానీ ఈ స్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ పర్యాటక రంగం కుదేలు కాకమానదు. అందుకే సాధ్యమైనంత త్వరగా ప్రయాణాలను పునరుద్ధరించాలనే ఆలోచనలోపడ్డాయి వివిధ దేశాలు. అందుకోసం అనేక రకాలుగా ఆలోచిస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిందే వాక్సిన్ పాస్‌పోర్ట్. కొవిడ్- 19 వాక్సిన్ వేయించుకున్నట్టు ధృవీకరించేదే ఈ పాస్‌పోర్ట్. మీరు కరోనా వైద్య పరీక్షలో నెగెటివ్ ఫలితాలు పొందినట్టుగా కూడా ఇది తెలియజేస్తుంది.
**ఒకే ప్రామాణికతతో…
అన్ని దేశాలూ వేగవంతంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేస్తున్నాయిప్పుడు. త్వరలోనే అంతర్జాతీయ ప్రయాణాలకు పచ్చజెండా ఊపనున్నాయి. అయితే వెళ్లే ప్రతి దేశానికి రకరకాల డాక్యుమెంట్లు తీసుకువెళ్లకుండా ఒకేదాంట్లో వాక్సిన్, కొవిడ్ టెస్టులకు సంబంధించిన వివరాలన్నీ ఉంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది కదా! ప్రతి చెక్‌పాయింట్‌లో అనేక రకాల డాక్యుమెంట్లు చూపిస్తూ ముందుకు సాగడం ప్రయాణికులకు ఎంతో చికాకు తెప్పిస్తుంది. అందుకే అన్ని దేశాలూ ఆమోదించగల డాక్యుమెంట్ అయితే మరీ మంచిది. అదే వాక్సిన్ పాస్‌పోర్ట్. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి కామన్‌పాస్ యాప్‌ని రూపొందించారు. ఇదో డిజిటల్ హెల్త్ పాస్‌పోర్ట్. ప్రయాణికుల వాక్సినేషన్ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తోంది. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ- ఓ విమానాశ్రయంలో విమానం దిగింది. అందులోంచి రెండు వందల మంది ప్రయాణికులు దిగారు. వంద మంది దగ్గరే ట్రావెల్ పాస్ ఉంది. మరో 50 మంది దగ్గర హెల్త్ వాలెట్, ఇంకో 50 మంది వద్ద ప్రభుత్వ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించడానికి అక్కడి సిబ్బంది ఎంతగా ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవచ్చు. అదే అందరి దగ్గరా ప్రామాణికమైన ఒకేరకమైన డిజిటల్ డాక్యుమెంట్ ఉంటే.. విమానాశ్రయ తనిఖీలు చాలా సులువుగా జరుగుతాయి.
**ఎప్పటి నుంచో…
వాస్తవానికి ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. తమ భూభాగంలోకి అడుగుపెడుతోన్న విదేశీయులు మలేరియా, డిఫ్తీరియా, కలరా, రూబెల్లా, ఎల్లో ఫీవర్ లాంటి వ్యాధులకు వాక్సిన్ వేయించుకున్న వివరాలను కొన్ని దేశాలు ముందు నుంచే సేకరిస్తున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ వాక్సినేషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి కూడా. అయితే కరోనా నేపథ్యంలో వస్తోన్న వాక్సిన్ పాస్‌పోర్ట్ ఓ సర్టిఫికెట్ లాంటిది మాత్రమే కాదు. ఇదో డిజిటల్ పాస్. మీ మొబైల్‌లోనే వాక్సిన్‌కి సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేస్తే డేటా అంతా వస్తుంది. దీనివల్ల నకిలీలను అరికట్టినట్టూ అవుతుంది. అంతేకాకుండా దీంతో ఎయిర్‌లైన్స్ టికెట్, హోటల్ రూమ్‌లూ ముందుగానే బుక్ చేసుకునేలా అనుసంధానం చేయవచ్చు. అంటే దీనితో బహుళ ప్రయోజనాలన్న మాట. యుద్ధప్రాతిపదికన కరోనాకు వాక్సిన్ కనుగొన్నాయి అంతర్జాతీయ సమాజాలు. అంతే వేగంగా వాక్సిన్ పాస్‌పోర్ట్ యాప్‌ను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆరోజు దగ్గరలోనే ఉంది.