పరమాత్మ అలంకార ప్రియుడు. నిత్యోత్సవాల్లో తీరొక్క పూలతో స్వామిని సింగారిస్తారు. పుష్పం సమర్పయామి.. అంటూ భక్తితో నివేదిస్తారు. మరుసటి రోజు మళ్లీ ఓ కొత్తదండ మూలమూర్తిని చేరుతుంది. వాడిపోయిన పూదండ చెత్తబుట్టపాలు అవుతుంది. ఆ నిర్మాల్యాన్ని సేకరించి, ఎండబెట్టి.. సబ్బులు, అగర్‌బత్తీలు, కొవ్వొత్తులు, ఫ్లోర్ క్లీనర్లు, సేంద్రియ ఎరువులు వంటి ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నది.. ఉర్వి. వీహబ్ అండతో ఇద్దరు మహిళా ఆంత్రప్రెన్యూర్లు ఈ స్టార్టప్‌కు ప్రాణంపోశారు.
మాయా వివేక్ .. కర్ణాటకలోని గుల్బర్గాలో పుట్టిపెరిగారు. పదేండ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పిల్లల చదువు కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఒకరోజు పిల్లలను బడి నుంచి తీసుకురావడానికి వెళ్లారు. అక్కడే మినాల్ దాల్మియా పరిచయం అయ్యారు. ఇద్దరి పిల్లలూ ఒకే బడిలో చదువుతున్నారు. ఒకే తరగతి కూడా! మినాల్ పుట్టింది కోల్‌కతాలో అయినా .. పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్‌లోనే. అందుకే, తాను పక్కా హైదరాబాదీననే చెప్పుకొంటారు. ఆ ఇద్దరి ముచ్చట్లూ ఒకసారి స్టార్టప్ మీదికి మళ్లాయి. ‘ఏం చేసినా కొత్తగా ఉండాలి. లాభాలు రాకపోయినా ఫర్వాలేదు. పర్యావరణానికి మాత్రం హాని కలగొద్దు. మన స్టార్టప్ నలుగురు మహిళలకు ఉపాధి చూపేదైతే మరీ సంతోషం’ అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో అనేక బిజినెస్ ఐడియాలు చర్చకు వచ్చాయి. ఓ స్నేహితురాలు పూల వ్యర్థాలతో ఏదైనా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అలా ప్రాణం పోసుకున్నదే.. ‘ఉర్వి సస్టెయినబుల్ కాన్సెప్ట్స్’.
snuggle smileys
వడివడిగా అడుగులేస్తూ..
ఉర్వికి ఓ రూపం ఇవ్వగానే మహిళా ఆంత్రప్రెన్యూర్ల వేదిక ‘వీహబ్’ను సంప్రదించారు మాయ, మినాల్. హైదరాబాద్‌లోని దేవాలయాల్లో రోజూ టన్నులకొద్దీ పూలు చెత్త పాలవుతున్న విషయాన్ని వివరించారు. తమ ఆలోచనల గురించి చెప్పారు. అందులోని వ్యాపార కోణాన్ని విశ్లేషించారు. వీహబ్ సానుకూలంగా స్పందించింది. అన్ని విధాలా సహకరించింది. కొద్దిపాటి పెట్టుబడితో రంగంలోకి దిగారు మాయ, మినాల్. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలను పరిశీలించారు. గుండ్లపోచంపల్లి అనువైన ప్రాంతమని తోచింది. అక్కడి సర్పంచ్‌ను సంప్రదించారు. తమ స్టార్టప్ వల్ల స్థానిక మహిళలకు ఉపాధి దొరుకుతుందని చెప్పడంతో కమ్యూనిటీ హాల్‌ను అద్దెకు ఇచ్చారాయన. పది మంది మహిళలతో ‘హోలీ వేస్ట్ ‘ ఉత్పత్తులకు అంకురార్పణ జరిగింది. పూలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీకి తొలుత ఒక దేవాలయాన్ని ఎంచుకున్నారు. పూజ ముగిసిన తర్వాత నేరుగా పూలను సేకరించి మల్లె, చామంతి, గులాబీ.. ఇలా జాతులవారీగా వేరుచేయడం ప్రారంభించారు. ఈవెంట్ మేనేజర్లు, పూల వ్యాపారులతోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటితో అగర్‌బత్తీలు, సబ్బులు, కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు. వీరి ఉత్పత్తులు ఇ-కామర్స్ వెబ్ సైట్స్‌లోనూ లభిస్తున్నాయి. రోజూ 200 కిలోల వాడిన పూలను సేకరిస్తున్నది ఉర్వి.
ఆమెకు అండగా..
గుండ్లపోచంపల్లి గ్రామంలో దాదాపు పదిహేను మంది మహిళలు ప్రత్యక్షంగా.. నలుగురు పురుషులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరికి తొలిసారిగా శాలరీ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఆ సంపాదనతో వాళ్లంతా పిల్లలను చదివించుకుంటున్నారు. పిల్లలు బడికి, భర్త పనికి వెళ్లిన తర్వాతే పని ప్రారంభించే వెసులుబాటు కల్పించారు. పూల సేకరణ పెరగడం, పూల ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడటంతో వ్యాపారాన్ని భారీగా విస్తరించారు. ఉర్వి ఆకర్షణీయమైన గిఫ్ట్‌ప్యాక్‌లను కూడా అందిస్తున్నది. అంతేకాదు‘జీరో వేస్ట్’ లక్ష్యంగా పనిచేస్తున్నది
ఫోన్‌కాల్ దూరంలో వీహబ్– మాయా వివేక్, ఉర్వి సహ-వ్యవస్థాపకురాలు
స్టార్టప్‌లకు వీహబ్ తిరుగులేని వేదిక. ఒక మంచి వ్యాపార ఆలోచనతో వీహబ్‌ను సంప్రదిస్తే.. ఫోన్‌కాల్ దూరంలోనే ఉంటారు. మన ఆలోచనను సావధానంగా వింటారు. అవసరమైన సాయం చేస్తారు. నేను కూడా వీహబ్ సాయంతో ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగాను. ఇప్పుడు వీహబ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నాను.