Politics

40 శాతం సీట్లు యువతకే : చంద్రబాబు

Auto Draft

ఈ ఏడాది టీడీపీకి కీలకమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. పార్టీ ఏర్పాటై 40 ఏళ్లు..వచ్చే ఏడాది ఎన్టీఆర్ శత జయంతి కావటంతో ప్రత్యేకంగా చూస్తున్నామని వివరించారు.ఇక, ప్రతీ మూడు నెలలకు ఒక సారి కుప్పం వస్తానని ప్రకటించారు. జగన్ పాలన పైన మండిపడ్డ టీడీపీ అధినేత పలు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తే.. తెలుగుదేశం పార్టీ ప్రతి వంద ఓట్లకు ఒక సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌ను పెడుతుందని ప్రకటించారు. వారు ఓటర్లతో మమేకం అవ్వటం దగ్గర నుంచి వారిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

* యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా వారిని ప్రోత్సహిస్తున్నామని..వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని మరోసారి స్పష్టం చేసారు. ఓట్లు తెచ్చే నాయకులను ప్రోత్సహిస్తానని ఓటర్లను దూరం చేసే నాయకులను పక్కన పెడతానని చంద్రబాబు హెచ్చరించారు. యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ‘ప్రభుత్వ బాదుడే బాదుడు’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని యువతను కోరారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉందన్న చంద్రబాబు.. గడప గడపకూ అంటూ వెళ్తున్న ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారని చెప్పారు.

*వైకుంఠపాళిలో మాదిరిగా పరిస్థితి
అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచిన జగన్‌.. నవరత్నాల పేరుతో జేబులు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతిని ఎందుకు తీసేశారో జగన్‌ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. తాను కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రగతిని పాతాళంలోకి పడేసిందన్నారు. తాను పైకి తీసుకెళ్లడం.. వాళ్లు పాములు మింగినట్లుగా కిందకు లాగడం.. వైకుంఠపాళిలో మాదిరిగా పరిస్థితి తయారైందని పేర్కొన్నారు. మళ్లీ తాను మొదటి నుంచీ అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. యువతను జగన్‌ ప్రభుత్వం నిండా ముంచేసిందని.. జాబ్‌ కేలెండర్‌ ఏమైందని నిలదీశారు.

*పొత్తులపైన ఇప్పుడే కాదు
నిరుద్యోగం పెరిగిపోయి, కనీస స్వయం ఉపాధి ఎంచుకునే మార్గంలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవైపు ఆర్థికంగా ఎదుగుతూనే.. రాజకీయాల్లోనూ ముందుకొచ్చి ప్రక్షాళన చేయాలని సూచించారు. రాష్ట్రం మరో శ్రీలంక కాకుండా కాపాడుకునే బాధ్యత యువతపైనే ఉందన్నారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడనని స్పష్టం చేసారు. అంత అవసరం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తాను ఇప్పుడేదో మాట్లాడి, వైసీపీ వాళ్లు రెచ్చగొడుతూ ప్రచారం చేసి.. ఇదంతా అవసరం లేదన్నారు. గత ఎన్నికల పరిస్థితి చూసుకుంటే, పొత్తులుండీ ఓడిన, గెలిచిన దాఖలాలున్నాయని చెప్పారు. ఎన్నికల్లో విజయానికి, పొత్తులకు సంబంధం లేదని పేర్కొన్నారు. అది ప్రజల నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.