Devotional

ఆరు నెలలకు ఓసారి రంగును మార్చుకునే వినాయకుడు – TNI ఆధ్యాత్మికం

ఆరు నెలలకు ఓసారి రంగును మార్చుకునే వినాయకుడు   – TNI ఆధ్యాత్మికం

1. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైనది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. దానికి కారణం మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఇలా జరగడం దేవుని మహత్యం అని భక్తులు విశ్వసిస్తారు. అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ప్రాంగణంలో నీటి బావి ఉంది. దానిలోని నీరు కూడా ఆరు నెలలకు ఒకసారి రంగు మారుతుంది. కానీ వినాయకుడు తెల్లగా ఉన్నప్పుడు నల్లగా, నల్లగా ఉన్నప్పుడు తెల్లగా ఉండటం విశేషం. వాటితోపాటు మరో విచిత్రం ఏమిటంటే సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి. కానీ దట్టమైన అరణ్యాల కారణంగా తమిళనాడు, కేరళకు చెందిన అరణ్యాలకు ఈ ఋతు బేధం వర్తించదు. ఈ ఆలయంలోని ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. పాత కాలంలో ఈ ఆలయంపై వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అందువలన దీనిని అనేక మార్లు పునర్నిర్మించడం జరిగింది. దీనిపై కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆలయం తమిళనాడుకి చెందడంతో వారి ఆధిపత్యం తగ్గింది.

2. గుంట గంగమ్మకు సారె సమర్పించిన మంత్రి ఆర్‌కే రోజా
తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఆర్‌కే రోజా సారె సమర్పించారు. గంగమ్మ ఆలయానికి భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చిన మంత్రి రోజా.. సారెతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ..‘ గంగమ్మ ఆలయానికి సారె తీసుకురావడం పూర్వజన్మ సుకృతం,అదృష్టంగా భావిస్తున్నా. 900 ఏళ్ల చరిత్ర కల్గిన పురాతన ఆలయం గంగమ్మ తల్లి ఆలయం. గతంలో తిరుమలకు వెళ్ళే భక్తులు గంగమ్మ ను దర్శించుకున్న తర్వాత కొండకు వెళ్ళేవారు. రాష్ట్రం లో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను’ అని పేర్కొన్నారు.

3.గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలు: భూమన
మంత్రి రోజా సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గంగమ్మ ఆలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు సహకారం అందించాలని కోరినట్లు భూమన పేర్కొన్నారు.

4. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!
జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ ను పరిమితం చేశామని తెలిపారు. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ వద్ద వైభవంగా నిర్వహిస్తామన్నారు. పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్నారు.

5. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ను టీటీడీ ఈవో ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్‌తో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన హరిచందన్‌ ధ్వజస్తంభానికి మొక్కుకున్న తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, ఈవో లడ్డూప్రసాదాలు అందజేశారు.

6. తంజావూరు జిల్లాలో ఆలయాల నగరంగా ప్రసిద్ధిచెందిన కుంభకోణం సారంగపాణి స్వామి ఆలయంలో శనివారం వైభవంగా రథోత్సవం జరిగింది. 108 వైష్ణవ క్షేత్రాల్లో మూడవదిగా పేరుగాంచిన ఈ ఆలయంలో చిత్తిరై మహోత్సవాలు ఈ నెల 6న ధ్వజారోహణంతో ప్రారంభమై ప్రతిరోజు వివిధ వాహనాల్లో ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తున్నారు. ప్రధానాంశమైన రథోత్సవం శనివారం నిర్వహించగా, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత ప్రత్యేక అలంకరణలో సారంగపాణి స్వామివార్లు రథంలో కొలువుదీరి భక్తులను కటాక్షించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో అతిపెద్ద రథాల్లో సారంగపాణి స్వామి ఆలయ రథం ఒకటి. 110 అడుగుల ఎత్తు, 450 టన్నుల బరువు, నాలుగు గుర్రాలు, సృష్టికర్త బ్రహ్మ రథసారధి విగ్రహంతో శిల్ప కళాకారులు రథోత్సవం కోసం రథాన్ని అందంగా తీర్చిదిద్దారు.

7. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు

8. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.