* తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య , మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
*కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీకి గుడ్ బై.. గుడ్ లక్ అంటూ కామెంట్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. జాకర్.. గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాకర్.. బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ జాకర్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో కొంతమంది కాంగ్రెస్ నేతలు తనపై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించారని అన్నారు. అందుకు గానూ తనపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అంటూ జాకర్ ప్రశంసించారు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు.
*నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఈనెల 21న పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. 21న ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తామన్నారు.
*ఆంధ్రప్రదేశ్‌లో రైతుల వద్ద నుంచి చేస్తున్న ధాన్యం కొనుగోలులో ఘరానా మోసం జరుగుతుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మోసాలపై విచారణ చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌కు ఇవాళ ఓ లేఖను రాశారు. ధాన్యం కోనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మొదటి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నా కనీసం స్పందించడం లేదని విమర్శించారు. స్వయాన సొంత పార్టీకి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యం మాఫియాపై చేసిన వ్యాఖ్యలకైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
*ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి చెల్లింపులు ఉంటాయాని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. మిల్లర్లతో సంబంధం లేకుండా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే డిపాజిట్ పీఏసీఎస్‌ల ద్వారా హమాలి, రవాణా చార్జీలు చెల్లిస్తున్నామన్నారు. క్వింటాల్ కామన్ రకానికి రూ.1940, గ్రేడ్-ఎ రకానికి రూ.1960 ధర ఉంటుందన్నారు. ఇంకా లక్షా 52 వేల మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.
*నంద్యాల: జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో ఓ కేసులో అనుమానితురాలిగా బాలికను ఇద్దరు మగ పోలీసుల మధ్య బైక్‌పై తీసుకెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. స్థానిక పీఎస్‌కు సమాచారం లేదని ఆత్మకూరు ఎస్ఐ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*బెండపూడి విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు తమ ఇంగ్లీష్ టీచర్‌తో కలిసి వెళ్లి జగన్‌ను కలిశారు. విద్యార్థులతో కాసేపు సంభాషించి వారిని జగన్ అభినందించారు. సీఎం జగన్ దృష్టిలో బెండపూడి విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిభ పడటంతో తనను కలవాల్సిందిగా జగన్ వారిని ఆహ్వానించారు.
*పెనుకొండలో వైసీపీ నేతల తీరు మారడం లేదు. సోమందేపల్లిలో టీడీపీ సభావేదిక ప్రాంతంలో వైసీపీ జెండా వెలిసింది. రాత్రికి రాత్రి వైసీపీ నేతలు తమ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. రేపు సోమందేపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వైసీపీ జెండా ఏర్పాటుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
*సీఎం జగన్ దగ్గరకు గన్నవరం వైసీపీ పంచాయితీ చేరింది. సాయంత్రం 6 గంటలకు భేటీకి రావాలని వంశీ , దుట్టా రామచంద్రరావు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. కొన్నిరోజులుగా వంశీ, దుట్టా వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. గడపగడపకు కార్యక్రమాన్ని పోటాపోటీగా ఇరు వర్గాలు నిర్వహిస్తున్నాయి. ప్రజావ్యతిరేకతకు మీరంటే మీరే కారణమంటూ ఇరువర్గాల ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దే పనిలో సీఎం జగన్ ఉన్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేతలున్న ప్రతిచోట ఇదే పరిస్థితి ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. గన్నవరంలో ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో దుట్టానువంశీని కూర్చోబెట్టి మాట్లాడాలనిసీఎం నిర్ణయించుకున్నారు
*సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నగరంలోని సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దావోస్‌లో ఈ నెల 24 నుంచి 26 వరకూ జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోపాటు తాను కూడా హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, అందుబాటులో ఉన్న వనరులు, ఇతర స్థితిగతులపై చర్చ మాత్రమే జరుగుతుందన్నారు. చర్చల సందర్భంగా ఆసక్తి చూపే వారిని గుర్తించి రాష్ట్రానికి ఆహ్వానించి, పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, అందుబాటులో ఉన్న వనరులను వివరించేందుకు ఈ సదస్సులో ప్రత్యేకంగా ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదస్సులో 18 అంశాలపై చర్చ జరిగితే వాటిలో పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని మంత్రి తెలిపారు.
*ఉద్యోగులకు సంబంధించిన పేరోల్ సైట్లో ఐఆర్ టైలు పట్టికను తక్షణమే పునరుద్ధరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు లేఖ అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పేరోల్‌లో ఐఆర్ పట్టికను తొలగించడం వల్ల ఈ ఏడాది జనవరికి ముందు వివిధ కారణాల వల్ల జీతభత్యాలు రాని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 11వ పీఆర్సీ అమలులో భాగంగా నగదు రూపంలో చెల్లింపులు జనవరి 1 నుంచి అమలులోకి వచ్చినా అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐఆర్ పట్టికను పూర్తిగా తొలగించడం దారుణమన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య కేంద్రాల సంఖ్య తగ్గిందని ‘‘ద స్టేట్ ఆఫ్ ఇనిక్వాలిటీ ఇన్ ఇండియా’’ నివేదిక తేల్చింది. ‘‘ప్రాథమిక ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అన్నింటా కొరత ఉంది. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామూహిక ఆరోగ్య కేంద్రాలు.. ఈ మూడు ఏపీలో తక్కువగా ఉండడం అనేది హెల్త్‌కేర్‌పై అధిక భారం ఉన్నట్లు సూచిస్తున్నది. తద్వారా సమాజానికి తక్కువ చేరువ, పేషెంట్లకు సరిపడా వైద్యసాయం అందకపోవడం, తగిన వైద్య సదుపాయాలు లేకపోవడానికి దారి తీస్తోంది’’ అని ఈ నివేదిక తేల్చిచెప్పింది. ఆరోగ్యం, విద్యతో పాటు తదితర రంగాల సమాచారాన్ని క్రోడీకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపిటేటివ్నెస్ సంస్థ రూపొందించిన నివేదికను బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ బిబేక్ డెబ్రాయ్ ఆవిష్కరించారు.
*హైదరాబాద్ నుంచి మదురైకి గురువారం వేసవి ప్రత్యేక రైలును వేశారు. హైదరాబాద్-మదురై(07253) మే 19న(నేడు), తిరుగు ప్రయాణంలో.. మదురై-సికింద్రాబాద్(07254) రైలు మే 20న బయలుదేరతాయని అధికారులు తెలిపారు. ఇవి సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, వృద్ధాచలం, అరియార్, శ్రీరంగం, తిరుచిరాపల్లి, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయన్నారు. అలాగే.. మే 20న నాందేడ్-విశాఖపట్నం (07082), మే 22న విశాఖపట్నం-నాందేడ్ (07083) ప్రత్యేక రైళ్లు వేశామని తెలిపారు.
*సీఎం జగన్ సభ లు జనాలు లేక వెలవెలబోతుంటే, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. జగన్ పాలన తీరు వారికి అర్థమైపోయింది. అందుకే సభకు వచ్చిన జనం మధ్యలోనే నిష్క్రమిస్తుంటే పోలీసులు బతిమాలాల్సి వస్తోంది. అదే సమయంలో చంద్రబాబు సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు’’ అని వివరించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. సీఎం జగన్ చంటిపిల్లాడిలా కుంటిసాకులు చెప్పడం ఇకనైనా మానుకోవాలని సూ చించారు. ప్రభుత్వ తప్పులను ఒప్పుకొని సరి చేసుకు ని ముందుకెళ్తే మంచిదన్నారు. ప్రజలకు తానేదో చేయబోతుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనేసన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మీడియా సంస్థలు అడ్డుకుంటున్నాయనడం సరికాదన్నారు.
*తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు టీఎ్సఆర్జేసీ సెట్-2022 వచ్చే నెల 6న నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ తెలిపారు. విద్యార్ధులు మే 28 నుంచి http://tsrjdc.cgg.gov.in వెబ్సైట్లో ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జూన్ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం గం.12.30 వరకు ప్రవేశ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు.
*జూన్ 2న ఇందిరా పార్కు వద్ద తాము ఆత్మగౌరవ దీక్ష నిర్వహిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం వెల్లడించారు. ఈ దీక్షకు తెలంగాణ ఉద్యమకారులందరినీ పిలువనున్నట్లు చెప్పారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఆత్మగౌరవం, ప్రశ్నించే గొంతులకు స్థానం లేకుండా పోయిందన్నారు. మంత్రులకూ ఆత్మగౌరవం లేదన్నారు. రాష్ట్రంలో మొక్కుబడిగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నారని విమర్శించారు.
* టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించనున్న ురైతు రచ్చబండ్ కార్యక్రమం హనుమకొండ జిల్లా నుంచే ప్రారంభం కానుంది. ఈవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి బుధవారమిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో రచ్చబండ్ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు.
*పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లను మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కొతపా పునీత్‌తో పాటు విద్యాసంస్థలకు చెందిన మరికొందరు దాఖలు చేశారు. ఈ విషయంలో తగిన నిర్ణయం వెల్లడించేందుకు గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మథరావు ప్రకటించారు.
* గురజాలలో రైతు భరోసా కేంద్రానికి తాళం వేశారు. రైతు భరోసా కేంద్రానికి బిల్డింగ్ యజమాని తాళాలు వేయించారు. సంవత్సరం నుంచి అద్దె చెల్లించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని మండిపడ్డారు.
*అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ సెక్యూరిటీ రివ్యూలో నిర్ణయించారు. ట్యాగ్స్, రీడర్స్‌ను ఉపయోగించి యాత్రికులను వైర్లెస్ విధానంలో నిరంతరం గమనించాలని నిర్ణయించారు.
*ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని, బ్యాంకు రుణాలతో వ్యాపా ర రంగంలోనూ రాణించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్‌హెచ్‌జీలకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణా ల వార్షిక ప్రణాళికను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం లో రూ.18,69,093 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతేడాది రూ.15వేల కోట్లు వార్షిక ప్రణాళిక ఉండగా.. ఈసారి ఈ మొత్తం మూడు వేల కోట్లు పెరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈఓ సందీ్‌పకుమార్ సుల్తానియా, సెర్ప్ డైరెక్టర్ వై.నర్సింహారెడ్డి, ఆర్బీఐ జీఎం యశోదబాయి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కృష్ణ శర్మ, నాబార్డు జీఎం హరగోపాల్ పాల్గొన్నారు. కాగా, బ్యాంకు లింకేజీ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించాలని కొందరు మహిళా సంఘాల ప్రతినిధులు కోరారు.
*మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. మద్యం ధరలను మరోసారి భారీగా పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు రేపు(గురువారం) నుంచి అమలులోకి రానున్నాయి. మద్యం క్వార్టర్‌పై రూ. 20 పెంపు, మద్యం ఫుల్ బాటిల్‌పై రూ. 80 పెంపు, ఒక్కో బీరుపై రూ. 20 పెంచుతున్నట్టు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.