భారత్‌లో క్రికెట్‌కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అదే అమెరికాలో అయితే.. దాదాపు శూన్యమే అని చెప్పవచ్చు. అక్కడ నివసించే భారతీయులు మాత్రం క్రికెట్‌ను అక్కడక్కడా ఆడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రాబోతోంది. బేస్‌బాల్‌ను ప్రాణంగా భావించే యూఎ్‌సఎలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రవాస భారతీయుల బృందం నడుం బిగించింది. దీంట్లో భాగంగా భారత్‌లో ఐపీఎల్‌లాగా.. అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (ఎంసీఎల్) పేరిట త్వరలోనే ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందుకోసం 120 మిలియన్ డాలర్ల (రూ.932 కోట్లు) నిధులను సేకరించాలనుకుంటున్నారు. అమెరికాలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లను నిర్వహించేలా సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
ఇందులో ప్రధాన వాటాదారుగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గ్రూప్ ఇప్పటికే 16 మిలియన్ డాలర్ల (రూ.124 కోట్లు)ను పెట్టుబడిగా పెట్టింది. అలాగే అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు మరో డజను మందికి పైగా ప్రవాస భారతీయులు ఇందులో భాగస్వామ్యులు. ప్రస్తుతానికి రూ. 341 కోట్లు సమకూరగా, మిగతా మొత్తం మరో ఏడాదిలో సేకరించనున్నారు. ఆరు జట్లతో నిర్వహించే ఎంసీఎల్ 2023లో జరిగే అవకాశం ఉంది. అమెరికాలోని ఎనిమిది నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో సియాటెల్ ఫ్రాంఛైజీ నిర్వహణ హక్కులు నాదెళ్లకు దక్కాయి.