ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మకు భక్తులు నిర్వహించే నిత్య ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు ఇప్పుడు అమెరికాలోనూ ప్రారంభ మయ్యాయి. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి విగ్రహాలు, ఆభరణాలు, పూజా సామగ్రిని తీసుకుని నిష్ణాతులైన నలుగురు పండితులు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బుధవారం చేరుకున్నారు. అమెరికాలోని పది పట్టణాల్లోని ఆలయాల్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు నిర్వహిస్తున్న పూజలన్నింటినీ యథాతథంగా జరుపుతారు. ఆయా ఆలయాల్లో అనుసరించే వైదిక పద్ధతులు, యాజమాన్యాల నిర్ణయాలకనుగుణంగా కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, లలితా సహస్రనామ పూజలతో పాటు శివపార్వతుల కల్యాణం, ఇతర పూజలను నిర్వహిస్తామని సీనియర్ పండితుడు శంకర్ శాండిల్య తెలిపారు. కాగా, దుర్గగుడి నుంచి నలుగురు వేదపండితులు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ దేవదాయ శాఖ దేవాలయాల సలహాదారు (ఎన్ఆర్ఐ వింగ్) చెన్నూరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. దుర్గమ్మ విజయవాడ నుంచి అమెరికాకు రావడం, తొలుత మిల్సిటాస్ పట్టణంలోని శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆలయ అధ్యక్షుడు దువ్వూరు దయాకర్ పేర్కొన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో తమ ఆలయంలో దుర్గమ్మ పూజలు నిర్వహిస్తారని, భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని దేవాలయ వ్యవస్థాపక ట్రస్టీ మారేపల్లి నాగ వెంకటశాస్త్రి కోరారు.