NRI-NRT

కోనసీమ ఘటన పై ప్రవాసాంధ్రుల ఆవేదన

కోనసీమ ఘటన పై  ప్రవాసాంధ్రుల ఆవేదన

పచ్చని కోనసీమలో చోటు చేసుకున్న పరిణామాలు ఎడారి దేశాలలో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులలో ఆవేదన కలిగిస్తున్నాయి. కోనసీమ ప్రాంతానికి చెందినవారు ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. గల్ఫ్‌ దేశాలలో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులలో అత్యధికులు కోనసీమ ప్రాంతానికి చెందినవారున్నారు. కోనసీమ జిల్లాలోని ఒక్క రాజోలు నియోజకవర్గం నుంచే లక్షమందికు పైగా గల్ఫ్‌ దేశాలలో పని చేస్తున్నారు. జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గం వారు ఇక్కడ పనిచేస్తున్నారు. జిల్లా పేరు మార్పును స్వాగతిస్తున్న వారితో పాటు వ్యతిరేకిస్తున్న వారు కూడా అల్లర్ల వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నారు. తమ ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే దురుద్దేశ్యంతో, రాజకీయ కుట్రతో అల్లర్లు సృష్టించారని విశ్వసిస్తున్నారు. అయితే దాడులను బహిరంగంగా ఖండించడానికి వెనుకంజ వేస్తున్నారు. జిల్లా పేరు మార్పు విషయంలో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించి అల్లర్లు సృష్టించారని సౌదీ అరేబియాలో పనిచేస్తున్న కోనసీమ జిల్లాకు చెందిన రాధాకృష్ణా వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా నిందితులను శిక్షించి కోనసీమలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బ్యాటింగ్‌ మొదలు పెట్టిన వారే బౌలింగ్‌ కూడా చేస్తున్నారని దుబాయిలో పనిచేస్తున్న విశాఖపట్నం వాసి వాసు వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాలలో ఈ ఘటన ఓ భాగమని ఆరోపించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్చడాన్ని కువైట్‌లో పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసి అనిల్‌ కుమార్‌ సమర్థించారు. రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించిన అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు.