NRI-NRT

వీళ్లకి ‘పంచడం’లోనే ఆనందం

వీళ్లకి ‘పంచడం’లోనే ఆనందం

దాన లక్ష్ములు!*వీళ్లకి పంచడంలోనే ఆనందం‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్‌ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. తాజాగా రూ.954 కోట్ల వితరణతో ఇప్పటివరకూ ఆమె దానం చేసిన మొత్తం రూ.93 వేల కోట్లకు పైమాటే! సంపద నలుగురికీ పంచినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నది ఆమె ఉద్దేశం. మాదీ ఇదే మాట అంటూ దాతృత్వంలో పోటీపడుతున్న వారిలో కొందరు వీళ్లు..

*ప్రపంచంలోనే మొదటి స్థానం: మిలిందా గేట్స్‌
మహిళల్ని, ఆడపిల్లల్ని బలోపేతం చేస్తే వాళ్ల ద్వారా కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయని మిలిందా నమ్మకం. అందుకే వారి ఆరోగ్యం, విద్యపరంగా ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఈమెది అమెరికా. కంప్యూటర్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఆపై ఎంబీఏ చేసి 1987లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. 1994లో బిల్‌గేట్స్‌ను పెళ్లాడారు. 1996లో మొదటిసారి తల్లయ్యాక సేవపైనే దృష్టిపెట్టారు. ప్రజారోగ్య కార్యక్రమాలు, ఉత్తరమెరికాలోని గ్రంథాలయాలకు సాయం, స్కాలర్‌ ప్రోగ్రామ్‌లు, మైనారిటీ స్టడీ ప్రోగ్రామ్‌లు నిర్వహించేవారు. 2000లో బిల్‌గేట్స్‌తో కలిసి 17 బిలియన్‌ డాలర్లు (రూ.1లక్షా 31వేల కోట్లు)తో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీనికి చాలామంది భారీ విరాళాలు ఇస్తున్నారు. ‘వేగంగా వెళ్లాలంటే ఒక్కరే వెళ్లండి. ఎక్కువ దూరం సాగాలంటే నలుగురినీ కలుపుకుంటూ వెళ్లాలి’ అంటారీవిడ. ఇప్పుడిది ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అందరి ఆరోగ్యం, అభివృద్ధి, విద్య లక్ష్యాలుగా దీన్ని ప్రారంభించారు. దీనికి కో ఛైర్‌పర్సన్‌ మిలిందానే. బిల్‌గేట్స్‌తో విడాకులైనా సంస్థ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

*దేశాభివృద్ధి లక్ష్యంగా..: నీతా అంబానీ
పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో! కాబట్టి, ఆ కష్టాలు తనకు తెలుసంటారు. ముంబయికి చెందిన ఈమె కామర్స్‌ చదివారు. 2010లో భర్త ముఖేష్‌ అంబానీతో కలిసి రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సమాచారం, పేదవిద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్యం, కళలు, ప్రకృతి విపత్తుల్లో సహాయచర్యలు వంటివెన్నో చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బడులు, కళాశాలల్నీ నిర్మించారు. కొవిడ్‌ సమయంలో ప్రపంచ దానకర్ణుల జాబితా 2020లో దేశం నుంచి నీతా ఒక్కరే స్థానం సాధించారు. ఆ సమయంలో వలస కూలీలు, పేదలు, వృద్ధులకు ‘అన్న సేవ’ పేరుతో ఆహారాన్ని అందించారు. కొవిడ్‌ బాధితుల సహాయార్థం, ఆసుపత్రి నిర్మాణానికి రూ.558 కోట్లకుపైగా వితరణ చేశారు.

*సమాన అవకాశాలివ్వాలని: ప్రెసిల్లా చాన్‌
చైనా జాతీయురాలు. పుట్టిపెరిగింది అమెరికా. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ కో ఫౌండర్, సీఈఓ. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి మెడికల్‌ డిగ్రీ పట్టా పొందారు. ‘ప్రైమరీ స్కూల్‌’ అనే ఎన్‌జీఓ స్థాపించి ఉచిత విద్యనందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాలయాల అభివృద్ధికి రూ.35 వేల కోట్ల వరకూ అందించారు. మొదటి పాప పుట్టాక భర్తతో కలిసి ఫేస్‌బుక్‌లో 99 శాతం షేర్లను పేదల ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వాటి విలువ 46 బిలియన్‌ డాలర్లు (రూ.3.5 లక్షల కోట్లకు పైనే). చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్‌ పేరిట ఈ సేవల్ని ప్రెసిల్లానే చూసుకుంటున్నారు. అందరికీ సమానావకాశాలు వచ్చినప్పుడే అభివృద్ధి అంటారీవిడ. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో గుండెజబ్బులను తగ్గించడంలోనూ సాయమందిస్తున్నారు.

*రెండేళ్లలో రూ.93 వేల కోట్లు: మెకంజీ స్కాట్‌
‘మనమొక్కరమే ఎదిగితే గొప్పేముంది? అందరూ కలిసి సాగడంలోనే అభివృద్ధి, ఆనందం’ అంటారు మెకంజీ. ప్రపంచ కుబేర మహిళల్లో మూడో స్థానం. ఈమెది అమెరికా. ప్రముఖ రచయిత్రి కూడా. ఆంగ్లంలో బ్యాచిలర్స్‌ చేశారు. జెఫ్‌ బెజోస్‌తో పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి ‘అమెజాన్‌’ ప్రారంభించారు. వ్యాపార ప్రణాళికలు, షిప్పింగ్, కాంట్రాక్టులు వంటివన్నీ ఈవిడే చూసుకున్నారు. వ్యాపారం వృద్ధి చెందాక ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. 2019లో జెఫ్‌ బెజోస్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించినప్పుడే తన సంపదలో సగాన్ని దానం చేస్తాననీ ప్రకటించారు. జాతి సమానత్వం, వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, గ్రామీణ విద్యాలయాల అభివృద్ధి, కొవిడ్‌ బాధితులకి.. సాయం చేస్తూ వచ్చారు. తాజాగా యువతకు దిశానిర్దేశం చేసే మెంటారింగ్‌ ఛారిటీ సంస్థకు రూ.954 కోట్లు వితరణగా ఇచ్చారు. రెండేళ్లలో ఆమె దానం చేసిన మొత్తం రూ.93వేల కోట్లకు పైమాటే.

*25 ఏళ్ల సేవ: సుధామూర్తి
ఆడంబరాలకు దూరం. రచయిత్రిగా సుపరిచితురాలు. ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించారు. టాటా సంస్థలో ఇంజినీర్‌గా, విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గానూ పని చేశారు. 1996లో.. తన 45 ఏళ్ల వయసులో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు సుధామూర్తి. రూ.35 లక్షల నగదుని చూసి.. ఇంత డబ్బును ఎవరికి దానం చేయాలనుకున్నారట. దేశంలో పర్యటించాక గానీ పేదల బాధలు తెలియలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య సహకారం, గ్రామీణాభివృద్ధి, కళలు, సంస్కృతి, స్వయం ప్రతిపత్తి సాధించేలా శిక్షణ వంటి ఎన్నో కార్యక్రమాల్ని దీని ద్వారా నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనే రూ.200 కోట్లను సేవకు వినియోగించారు. ఈ ఫౌండేషన్‌కు సుధామూర్తే ఛైర్‌పర్సన్‌. గత ఏడాది ఆ పదవి నుంచి విరమించి మూర్తి ఫౌండేషన్‌ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. సెక్స్‌ వర్కర్ల జీవితాలను మార్చి వాళ్లకి ఓ మార్గం చూపించడంలోనూ కృషి చేస్తున్నారీవిడ. సేవను పనిలా కాక.. పిల్లల్ని పెంచినంత బాధ్యతగా చేయాలంటారీమె. ఈ విషయంలో తనకు రతన్‌టాటానే ఆదర్శమంటారు.