DailyDose

వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం – TNI తాజా వార్తలు

వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం –  TNI  తాజా వార్తలు

*రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం.. ప్రజలకు వివరించేందుకు.. “సామాజిక న్యాయ భేరి” పేరిట వైకాపా మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రోడ్ల కూడలిలో వైకాపా బస్సు యాత్ర ప్రారంభమైంది. ముందుగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం.. సన్‌రైజ్‌ హాటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ సృష్టించిన సామాజిక విప్లవం దేశమంతా అవలంబించాలని.. మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు ‘సామాజిక న్యాయభేరి’ పేరిట శ్రీకాకుళం నుంచి 4 రోజుల బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని చెప్పారు. 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ముఖ్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

*మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట
మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, రామకృష్ణ సంస్థలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్మెంట్‌ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోసం గత వారం నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వచ్చే నెల 9 వరకు మాజీమంత్రి నారాయణ, లింగమనేని, రామకృష్ణ సంస్థలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది.

*హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట వెళ్లేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారి భారీగా ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు పలు చోట్ల వాన కూడా పడింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో మోదీ హెలికాఫ్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రధాని మోదీ రోడ్డు మార్గం గుండా 18 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి చెన్నై బయలుదేరారు.

*జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. మేయర్ గొలగాని హరివెంకట కుమారి తీరుపై వైసీపీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు తిప్పల వంశీ రెడ్డి మండిపడ్డారు. అంశాలపై చర్చించకుండా ఎలా ఆమోదించుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కాటుమూరి సతీష్, వంశీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తూ పార్టీకి హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ సతీష్ ఆగ్రహించారు. ‘‘నా హక్కును నేను ప్రశ్నిస్తున్నాను తప్ప పార్టీని ధిక్కరించడం లేదు’’ అని వంశీ స్పష్టం చేశారు. వంశీ తీరును ప్రతిపక్షాలు పూర్తిగా సమర్ధించాయి.

* కోనసీమ అల్లర్లను నిరసిస్తూ చలో అమలాపురం కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా కాంగ్రెస్ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీపీసీసీ చీఫ్ శైలజనాథ్తో పాటు ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ… కోనసీమలోని మతోన్నాదులు అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. కుట్రలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మంత్రి ఇంటిపై దాడి జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అమలాపురం అల్లర్లను వైసీపీ నేతలే ప్రోత్సహించారనేది వాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శైలజానాథ్ వెల్లడించారు.

*రుషికొండ తవ్వకాలపై దాఖలు చేసిన పిటిషన్‌పై.. వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ మెన్షన్ చేసింది. ఎన్జీటీ తమ వాదనలు వినకుండా.. ఏకపక్షంగా ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే సోమవారం పిటిషన్ విచారణకు లిస్ట్ చేయాలని.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశించింది.

*కోనసీమలో వరుసగా రెండో రోజు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అమలాపురం సహా అన్ని మండలాల్లో అన్ని టెలికాం కంపెనీల నెట్ సర్వీసులు బంద్ అయ్యాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లో నుంచి ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఇక్కట్లకు గురవుతున్నారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సేవలకూ ఇబ్బంది ఎదురవుతోంది. ఈ పరిణామంపై ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక ప్రజలు కాకినాడ, రాజమండ్రి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.

*విజయవాడ: నగరంలోని కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం నెలకొంది. రోడ్లపై వ్యాపారాలు చేస్తూ చిరువ్యాపారులు ట్రాఫిక్‌‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్… మార్కెట్ వద్దకు ఆక్రమణల నిర్మూలన దళ(వీఎంసీ) సిబ్బంది వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది… రోడ్లపై పండ్ల వ్యాపారం చేసే బుట్టలు లాక్కెళ్లారు. దీంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఎంసీ సిబ్బంది ఉన్న వాహనాన్ని చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారులకు సర్దిచెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 76,148 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 39,208 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

*చైనా వీసా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి సీబీఐ అరెస్టు నుంచి మూడు రోజుల ఉపశమనం లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో మందస్తు బెయిలు కోరుతూ ఇటీవల కార్తి చిదంబరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 30న చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

* మాజీ ప్రధానమంత్రి దొడ్డెగౌడ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. బెంగళూరులోని తమ నివాసంలో కేసీఆర్‌‌కు దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ తదితరులున్నారు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీశాయి రాళ్ల వర్షం కురిసింది. ప‌శ్చిమ హైద‌రాబాద్ ప్రాంత‌మంతా మేఘాలు క‌మ్ముకున్నాయి.గ‌చ్చిబౌలి, హెచ్‌సీయూ, తెల్లాపూర్, నార్సింగి, మ‌ణికొండ‌, బంజారాహిల్స్‌, పుప్పాలగూడ, రాజేంద్రనగర్‌, హైదర్‌గూడ, అత్తాపూర్‌, గండిపేట‌తో పాటు స‌మీప ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

*భద్రాద్రి రామయ్య సన్నిధిలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుండగా ఒక లడ్డు కౌంటర్ ఏర్పాటు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలకొద్దీ లడ్డూ ప్రసాదం కోసం క్యూలైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రసాదాల కౌంటర్‌ల నిర్వహణపై ఆలయ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు.

*బీఎస్ఎఫ్ అధికారులు నేడు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ (BSF) పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని జాలర్లను అదుపులోకి తీసుకున్నారు.

* కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌. ఈ మేరకు రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరుల్లో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది. నేడు ఆ వర్గాలన్నీ మేల్కొన్నాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి.

* చార్‌థామ్‌లో భాగంగా గంగోత్రి, య‌మునోత్రి, కేదార్‌నాథ్ వెళ్లే భ‌క్తుల‌కు రిజిస్ట్రేష‌న్‌ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వ‌ర‌కు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవ‌డం వ‌ల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేష‌న్ ఆపేసిన‌ట్లు అధికారులు తెలిపారు. హిమాల‌యాల్లో ఉన్న ఈ మూడు ఆల‌యాల‌కు రిజిస్ట్రేష‌న్ ఆపేశామ‌ని, ఆల‌యాల వ‌ద్ద ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్ని నివారించేందుకు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్ తెలిపారు. రిషికేశ్‌లో ఉన్న ఐఎస్బీటీ రిజిస్ట్రేష‌న్ ఆఫీసు దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా చేసింది. కేవ‌లం బ‌ద్రీనాథ్‌కు వెళ్లే యాత్రికుల రిజిస్ట్రేష‌న్ మాత్ర‌మే జ‌రుగుతున్న‌ట్లు అధికారులు చెప్పారు.

* తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టీటీడీ గురువారం నుంచి జీడిప‌ప్పును బ‌ద్దలుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్ -2లో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల త‌యారీ కోసం టీటీడీ సాధారణంగా టెండర్ల ద్వారా జీడిపప్పును కొనుగోలు చేస్తుందన్నారు. జీడిపప్పు బ‌ద్దలు త‌గినంత మొత్తంలో ల‌భించ‌క‌పోవ‌డంతో మార్చి 21న తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌తో జీడిపప్పు బ‌ద్దల‌ సేవను ప్రారంభించామ‌ని తెలిపారు.

* రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మధ్యప్రదేశ్‌ సీఎం ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యటనలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రపతి భోపాల్‌ చేరుకుంటారు. 28న భోపాల్‌లో ఆరోగ్య సంస్థల నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 29న భోపాల్‌ నుంచి ఉజ్జయినికి వెళతారు. ఇక్కడ కాళిదాస్‌ అకాడమీలో అఖిల భారత ఆయుర్వేద సదస్సులో పాల్గొని, ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మహాకాల్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ఇండోర్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

*ఏలూరు కోర్టు లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రైవేటు కేసు దాఖలు చేశారు. అక్రమ కేసుల బనాయిస్తున్నారని ప్రభుత్వంపై పిటిషన్‌ వేశారు. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, రాహుల్‌ దేవ్‌శర్మ, కృష్ణారావు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలపై చింతమనేని ప్రైవేటు కేసు వేశారు. ఆందోళనలు, టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని, రెండేళ్లలో తనపై 25 కేసులకుపైగా నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

*ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న ఎత్తెన పర్వతాలన్నింటినీ అధిరోహించడమే తన లక్ష్యమని పర్వతారోహకురాలు పడమటి అన్వితా రెడ్డి తాజాగా వెల్లడించారు. భువనగిరి జిల్లా ఎర్రంబల్లి చెందిన అన్విత చదువులో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె తండ్రి మధుసూదన్‌ రైతు కాగా అమ్మ చంద్రకళ భువనగిరిలోని అంగన్‌వాడీలో పనిచేస్తున్నారు. ఇటీవల అన్విత ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న సందర్భంగా అన్వితా గ్రూప్‌ అధినేత అచ్యుత రావు, ఇతర సిబ్బంది ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎర్రమంజిల్‌లో మీడియాతో అన్విత మాట్లాడారు. ‘‘17ఏళ్ల నుంచే నాకు పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో బేసిక్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌, ఇన్‌స్ట్రక్టర్‌ శిక్షణను పూర్తి చేసి, పర్వతారోహణ సంస్థల్లో ప్రాథమిక, అడ్వాన్స్‌ కోర్సులను పూర్తి చేశాను. అన్వితా గ్రూప్‌లో మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న నాకు మా సంస్థ యాజమాన్యం స్పాన్సర్‌గా నిలిచింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ఏప్రిల్‌ మొదటి వారంలో నేపాల్‌కు చేరుకున్నా. అక్కడనుంచి ఎవరెస్ట్‌ శిఖరారోహణను ప్రారంభించాను. 9 రోజుల తర్వాత గత నెల 17న 5300ఎత్తులో ఉన్న మాచ్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాను. తర్వాత 7,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాను. ఈ నెల 12న బేస్‌ క్యాంప్‌ నుండి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించి, 16న ఉదయం 9.30 గంటలకు శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకుని నా కల సాకారం చేసుకున్నాను. గత ఏడాది జనవరిలో ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారోను, డిసెంబరులో ఐరోపా ఖండంలోనే ఎత్తెన మౌంట్‌ ఎల్‌బ్ర్‌సను అధిరోహించాను. నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న అన్వితా గ్రూప్‌కు నా కృతజ్ఞతలు’’ అని అన్విత పేర్కొన్నారు.

*రాజ్యసభ స్థానాలకు వైకాపా తరఫున నలుగురు అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలో రిటర్నింగ్‌ అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి వెళ్లి వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్‌ పత్రాలతో పాటు బీఫారం, అఫిడవిట్‌, సెక్యూరిటీ డిపాజిట్‌లను ఆర్వోకి అందజేశారు.

*విశాఖపట్నాన్ని యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. బుధవారం దావోస్‌ ఎకనమిక్‌ ఫోరంలో.. వివిధ స్టార్ట్‌ప్సకు చెందిన వ్యవస్థాపకులు, సీఈవోలు, ఇతర ముఖ్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందరికీ ఆహ్వానం పలుకుతోందని వెల్లడించారు. విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం జగన్‌ వీరితో చర్చించారు. స్టార్ట్‌పలు అభివృద్ధి చెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, అవసరమైన అన్ని వనరులూ సమకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు.

*రాష్ట్రంలో బుధవారం నిర్వహించిన పదోతరగతి తృతీయ భాష ఇంగ్లిష్‌ పేపర్‌ పరీక్షకు 5,03,398 (99.04 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,745 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు.
*రెండేళ్లలో 2 వేల మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగావకాశాల నైపుణ్య శిక్షణకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ, ఐసీఐసీఐ ఫౌండేషన్‌ ఫర్‌ ఇంక్లూజివ్‌ గ్రోత్‌ మధ్య ఒప్పందం కుదిరింది. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సమక్షంలో కాలేజీ విద్య ప్రాంతీయ డైరెక్టర్‌ యాదగిరి, ఐసీఐసీఐ ఫౌండేషన్‌ సౌత్‌ ఈస్ట్‌ అధిపతి సుకేతు కుమార్‌ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

*ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ పరీక్షలు రాసే ప్రైవేట్‌ అభ్యర్థులకు హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

*అధిక ఉత్పత్తి రైతులకు లాభసాటిగా ఉండేందుకు రాష్ట్రంలో ఒకే కాత పత్తి(సింగిల్‌ పిక్‌ కాటన్‌) సాగును ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ పత్తి శాతం అధిక దిగుబడిని ఇస్తుందని రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో సాగు చేయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో బుధవారం సింగిల్‌ పిక్‌ కాటన్‌ సాగు కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి సీఎస్‌ సమావేశం నిర్వహించారు. హైడెన్సిటీ ప్లాంటింగ్‌ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని రైతుల పేర్లను నమోదు చేయించాలని నిర్దేశించారు. రైతుల వివరాలు, వర్షపాతం సమాచారం, పంటల కేలండర్‌తో కూడిన యాప్‌ను రూపొందించాలన్నారు.

*కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ ప్రొటోకాల్‌ను విస్మరించలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌ పేర్కొన్నారు. బుధవారం టీఆర్‌ఎ్‌సఎల్‌పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సీఎంను రావొద్దని పీఎం మోదీ ఆనాడు అన్నప్పుడు దేశమంతా చూసిందని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన స్థాయి మరచి మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి ఆయన కాదా అని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్ష గురించి పోరాటం చేయాలని సూచించారు. సికింద్రాబాద్‌ ఎంపీగా ఉండి ప్రజలకే కాదు.. బీజేపీ కార్యకర్తలకూ కిషన్‌రెడ్డి ఏమీ చేయలేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు.

*పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తులగడువును ప్రభుత్వం పొడిగించింది. వచ్చే దరఖాస్తు చేసుకోవచ్చని ఉపముఖ్యమంత్రి మైనార్టీశాఖ మంత్రి అంజాద్‌ బాషా తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్‌ యాక్ట్‌ ఈ నెల నుంచి అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి బుధవారం గజిట్‌ విడుదల చేశారు.

*ఉద్యోగుల ఇంక్రిమెంట్లు జీతాలు లాంటి సాధారణ అంశాలకే ఫైళ్ల టార్గెట్‌ పెట్టామని… కోర్టుల అంశాలు పాలసీ మేటర్స్‌ లాంటి వాటికి ఎలాంటి టైమ్‌ టార్గెట్‌ పెట్టలేదని దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు దేవదాయలో ఫైళ్ల టార్గెట్లు ఆయన వివరణ ఇచ్చారు. అపరిష్కృత ఫైళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున వాటిని పరిష్కరించే లక్ష్యంతో ఈ ఆదేశాలు జారీచేశామన్నారు.

*రెసిడెన్షియల్‌ మైనార్టీ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియేట్‌(2022-23)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో 10వ తరగతి మార్కుల ప్రాతిపదికన ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలలో బోధన ఉంటుందని, మే 30 నుంచి జూన్‌ 20 వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లా వాయల్పాడుల్లో రెసిడెన్షియల్‌ కళాశాలలున్నాయి. వెబ్‌ సైట్‌లో పొందవచ్చన్నారు.

*తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అధికారులు దాసోహం అంటున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా మండువవారిపాలెంలో మహానాడు నిర్వహించనున్నారు. దీని కోసం ఒంగోలు నగరాన్ని పసుపు తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలతో అందంగా ముస్తాబు చేశారు. అయితే, అనుమతులు లేవంటూ వాటిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు బుధవారం తొలగించారు. స్థానిక ప్రకాశం భవనం ఎదుట, కొప్పోలు రోడ్‌లో ఫ్లెక్సీలు తొలగించడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఇష్టారాజ్యంగా వదిలేసి, కళ్లు మూసుకున్న కార్పొరేషన్‌ అధికారులు టీడీపీ మహానాడుకు మాత్రం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని తప్పుపడుతున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావుతో మాట్లాడగా, కలెక్టర్‌ ఆదేశాల మేరకే తొలగించామని సమాధానమిచ్చారు.

*విశాఖపట్నాన్ని యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. బుధవారం దావోస్‌ ఎకనమిక్‌ ఫోరంలో.. వివిధ స్టార్ట్‌ప్సకు చెందిన వ్యవస్థాపకులు, సీఈవోలు, ఇతర ముఖ్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందరికీ ఆహ్వానం పలుకుతోందని వెల్లడించారు. విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం జగన్‌ వీరితో చర్చించారు. స్టార్ట్‌పలు అభివృద్ధి చెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, అవసరమైన అన్ని వనరులూ సమకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు.

*మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జూన్‌ 6న నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్‌ 23న పోలింగ్‌, 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్‌రెడ్డిని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఉప ఎన్నికలో పోటీ విషయంలో టీడీపీ అధికారిక ప్రకటన చేయలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. ఆత్మకూరులో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయత్వం ఇది వరకే ప్రకటించింది. మేకపాటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికలో పోటీ చేసి తీరుతానని మర్రిపాడు మండలానికి చెందిన బిజివేముల రవీంద్రనాఽథ్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

*మాజీ డ్రైవర్‌ హత్యకేసులో జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ కేం ద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తానే చంపానని పోలీసుల ఎదుట అనంతబాబు అంగీకరించిన నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకున్నట్టు వివరించింది.

*కక్షిదారుల సమస్యలను ఓపిగ్గా.. పూర్తిగా తెలుసుకుని వారికి సత్వరమే న్యాయం అందించేలా న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా సూచించారు. గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులలో 70 శాతం మంది న్యాయవాదులుగా పని చేసినవారేనని గుర్తు చేశారు. కక్షిదారుల నమ్మకాన్ని పొందేలా మానవత్వ విలువలతో న్యాయం అందించేలా న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. అనంతరం జస్టిస్‌ అమానుల్లాను గుంటూరు జిల్లా బార్‌ అసోసియేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లా బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు.

*ముందస్తు అంచనా ప్రకారం మరో 48 గంటల్లో(శుక్రవారం) నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కేరళ పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల వరకు కేరళ, లక్షద్వీప్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ నేపథ్యంలో 27కల్లా కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. రానున్న 48 గంటల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కామరూన్‌ ప్రాంతం, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వివరించారు. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కేరళలోకి 27 నాటికి రుతుపవనాలు ప్రవేశించినా ముందుకు పురోగమించడానికి మరికొద్ది రోజుల సమయం పట్టవచ్చునని కొందరు నిపుణులు అంచనావేశారు.

*ప్రగతి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. రాష్ట్రానికి సంబంధించి రాయపూర్‌-విశాఖపట్నం ఎకనమిక్‌ కారిడార్‌, కాకినాడ-శ్రీకాకుళం సహజ వాయువుపైపులైన్‌ ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాని మోదీ సీఎస్‌ సమీర్‌ శర్మతో సమీక్షించారు. అదే విధంగా నేషనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ మిషన్‌ గురించి సీఎ్‌సలతో సమీక్షించారు. రాయపూర్‌-విశాఖపట్నం ఎకనమిక్‌ కారిడార్‌కు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎ్‌సను ఆదేశించారు. ఈ కారిడార్‌ ఏర్పాటుతో ఛత్తీస్‌గఢ్‌, ఒడిసా, ఏపీ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యంగా అల్యుమినియం, బొగ్గు, బాక్సైట్‌ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే, కాకినాడ- శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.

*‘ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల ఇంజనీరింగ్‌ ఫీజుల కంటే ఎల్‌కేజీ ఫీజులే ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల్లో ధరలు పెరుగుతుంటే ఇంజనీరింగ్‌ విద్యలో మాత్రం ఫీజులు తగ్గుతున్నాయి. మరోవైపు ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీకి ఏడోవేతన స్కేలు అమలుచేయాల్సి వస్తోంది. దీంతో ‘అటు జీతాలు ఇవ్వలేం…ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడలేం’ అన్నట్టుగా తయారైంది మా పరిస్థితి. ఫీజులు పెంచకపోతే ఇక ఇంజనీరింగ్‌ కాలేజీలు నడపలేం’’ అని రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాయి. ఆస్తులు అమ్ముకుని కాలేజీలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2023-24 విద్యా సంవత్సరం నుంచి శ్రీకృష్ణ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా ఫీజులు ఖరారు చేయాలని కోరాయి. 2023-24 నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయనున్న నేపథ్యంలో ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల అసోసియేషన్‌(అపెక్మా) బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహించింది.

*ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.565.13 కోట్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖలో ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో కేంద్రం రూ. 358.28 కోట్లు భరిస్తుంది. మిగతా రూ.206.85 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. నిధులను ఆమోదించే సమయంలో 2021-22లో పథకం అమలు పురోగతిని కేంద్రం సమీక్షించింది. రాష్ట్రంలో చాలా కాలంగా వంట గదుల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించింది. లేదంటే ఈ ఏడాది డిసెంబరు 31లోగా సంబంధిత మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది.

*రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడమంటే ఆయన స్థాయిని తగ్గించినట్లే అవుతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అంబేడ్కర్‌కు అమలాపురానికి ఉన్న సంబంధం ఏమిటిని ఒక్కసారి ఆలోచిేస్త… ఏమీ లేదని స్పష్టమవుతోందన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అల్లూరి పేరిట మన్యం జిల్లాను, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరిట ఒక జిల్లాను, కడప జిల్లాను వైఎ్‌సఆర్‌ జిల్లాగా పేర్కొనప్పుడు కోనసీమ జిల్లాకు కూడా అంబేడ్కర్‌ పేరు పెడితే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్నారు. కానీ, ఇప్పుడు సమయం సందర్భం లేకుండా దళితులపై జరుగుతున్న దాష్టీకాలను కప్పిపుచ్చుకునేందుకు అంబేడ్కర్‌ పేరును తెరపైకి తీసుకురావడం శోచనీయమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీ చేసి, నెల రోజుల గడువు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అన్ని ఆలోచించే కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని చెప్పారు.

*రాష్ట్రంలోని రైతు బజార్లులో ప్రజలకు అవసరమైన వివిధ నిత్యావసర సరుకులు, కూరగాయలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ యాప్‌ను మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, తూనికలు, కొలతలశాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగాలు వినియోగించుకుని నిరంతరం ధరలను పర్యవేక్షించాలన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన సంబంధితశాఖల అధికారులతో సమీక్షించారు. అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలన్నారు.

* రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గురువారం నెల్లూరులో కమలనాథులు భేటీ కానుండడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని కస్తూర్బా గార్డెన్స్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎలాంటి ప్రణాళికలతో ఎన్నికల బరిలోకి దిగాలి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు, పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.. ఇత్యాది అంశాలపై చర్చించి ఓ ప్రణాళికను రూపొందించి, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీ రెండు రోజులుగా నగరంలోనే ఉండి ఈ సమావేశాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నేతలతోపాటు ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా రానున్నట్టు సమాచారం.

*ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.565.13 కోట్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖలో ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో కేంద్రం రూ. 358.28 కోట్లు భరిస్తుంది. మిగతా రూ.206.85 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. నిధులను ఆమోదించే సమయంలో 2021-22లో పథకం అమలు పురోగతిని కేంద్రం సమీక్షించింది. రాష్ట్రంలో చాలా కాలంగా వంట గదుల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించింది. లేదంటే ఈ ఏడాది డిసెంబరు 31లోగా సంబంధిత మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది.

*కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లతో తమకు సంబంధం లేదని, ప్రతిపక్షాలు ఒక పథకం ప్రకారం వైసీపీపై కుట్ర చేశాయని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

*తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో అంజనాదేవికి, బాలాంజనేయస్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జపాలికి చేరుకుని ఆంజనేయస్వామికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్దనున్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమజ్జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన ధార్మికోపన్యాసాలు, భక్తిసంగీతం ఆకట్టుకున్నాయి.

* మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అమరావతి ఎంపీ నవనీత్‌ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి చంపేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మహారాష్ట్రకు రానివ్వను.. హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తే చంపేస్తా.. ఓ నంబర్‌ నుంచి తనకు 11 సార్లు కాల్‌ వచ్చింది’ అని పేర్కొన్నారు.

* చార్‌థామ్‌లో భాగంగా గంగోత్రి, య‌మునోత్రి, కేదార్‌నాథ్ వెళ్లే భ‌క్తుల‌కు రిజిస్ట్రేష‌న్‌ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వ‌ర‌కు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవ‌డం వ‌ల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేష‌న్ ఆపేసిన‌ట్లు అధికారులు తెలిపారు. హిమాల‌యాల్లో ఉన్న ఈ మూడు ఆల‌యాల‌కు రిజిస్ట్రేష‌న్ ఆపేశామ‌ని, ఆల‌యాల వ‌ద్ద ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్ని నివారించేందుకు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్ తెలిపారు. రిషికేశ్‌లో ఉన్న ఐఎస్బీటీ రిజిస్ట్రేష‌న్ ఆఫీసు దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా చేసింది. కేవ‌లం బ‌ద్రీనాథ్‌కు వెళ్లే యాత్రికుల రిజిస్ట్రేష‌న్ మాత్ర‌మే జ‌రుగుతున్న‌ట్లు అధికారులు చెప్పారు.