*విరాళాల వ్యయంలో భిన్న పంథా
వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అట్టే పెట్టుకున్న పార్టీల్లో వైకాపా దేశంలో మొదటి స్థానంలో నిలవగా.. వచ్చిన ఆదాయం కంటే 1,584.16% ఎక్కువగా ఖర్చు చేసి తెదేపా తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయవ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైకాపాకు రూ.107.89 కోట్ల విరాళాలు రాగా, ఆ పార్టీ కేవలం రూ.80 లక్షలే ఖర్చు చేసింది. ఇదే సంవత్సరం తెదేపాకు రూ.3.25 కోట్ల విరాళాలు రాగా రూ.54.76 కోట్లు వెచ్చించింది. తెరాసకు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది.
* 2020-21లో మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529.41 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో వచ్చిన రూ.800.26 కోట్లతో పోల్చితే ఇది 34.96% తక్కువ.
* ఇందులో రూ.149.95 కోట్లతో డీఎంకే తొలి స్థానంలో నిలిచింది. వైకాపా (రూ.107.99 కోట్లు), బీజేడీ (రూ.73.34 కోట్లు), జేడీయూ (రూ.65.31 కోట్లు), తెరాస (రూ.37.65 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచాయి. తెదేపా 11వ స్థానానికి పరిమితమైంది.
* అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైకాపా (99.25%) తర్వాత బీజేడీ (90.44%), ఎంఐఎం (88.02%) ఉన్నాయి.
* 31 పార్టీలకు రూ.376.86 కోట్లు (71%) స్వచ్ఛంద విరాళాల రూపంలో సమకూరాయి. ఇందులో రూ.250.60 కోట్లను పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నాయి. ఈ బాండ్ల మొత్తం కేవలం 5పార్టీలకే వెళ్లింది. ఇందులో వైకాపా (రూ.96.25 కోట్లు), డీఎంకే (రూ.80 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఆప్ (రూ.5.95 కోట్లు), జేడీయూ (రూ.1.40 కోట్లు) దక్కాయి. 31 పార్టీలకు వడ్డీ రూపంలో రూ.84.64 కోట్ల ఆదాయం వచ్చింది.