NRI-NRT

అమెరికాలో తొలిసారిగా యాదాద్రీశుడి కల్యాణం

అమెరికాలో తొలిసారిగా యాదాద్రీశుడి కల్యాణం

*తరలివెళ్లనున్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు
*న్యూజెర్సీలో టీటీఏ ఆధ్వర్యంలో.. 3 రోజుల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

యాదాద్రీశుడి కల్యాణ వైభోగాన్ని తొలిసారిగా అమెరికాలోని భక్తులు ప్రత్యక్షంగా అనుభూతి చెందనున్నారు. తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించనున్నట్లు టీటీఏ కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ గనగొని శ్రీనివాస్‌, అధ్యక్షుడు పటోళ్ల మోహన్‌ రెడ్డి తాజాగా వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల విశేషాలను వివరించారు. ‘‘న్యూ జెర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో శుక్రవారం రాత్రి బ్యాంకెట్‌ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తాం. అనంతరం సంగీత దర్శకుడు కోటి బృందంమ్యూజికల్‌ నైట్‌ నిర్వహిస్తారు. శనివారం ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్య గీతం ఉంటుంది. దీనిని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ రచించగా వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ, స్థానిక సెనేటర్‌, మేయర్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం సాయంత్రం ప్రముఖ గాయని సునీత బృందం నిర్వహించే సంగీత విభావరి, రసమయి బాలకిషన్‌ బృందం ప్రదర్శన ఉంటాయి. సినీనటులు నిఖిల్‌, రీతూ వర్మ, అంజలి తదితర ప్రముఖులతో పాటు జబర్దస్త్‌ బృందం హాస్య నాటికలు ఉంటాయి. ఇక ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా సుమ కనకాల, రవి వ్యవహరిస్తారు. టీటీఏ స్టార్‌ సింగర్‌ను ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తాం’’ అని వారు పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సబిత, తలసాని శ్రీనివాస యాదవ్‌, జగదీశ్వర్‌ రెడ్డి, బీజేపీ నేతలు డి.అరవింద్‌, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు.