* సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబును విమర్శించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్పై మాట జారారు. ముఖ్యమంత్రి జగన్ ను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారారు.. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. చంద్రబాబును విమర్శిస్తున్న క్రమంలో మంత్రి తడబడ్డారు. జగన్ కాలం చెల్లిన నేత అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు జగన్ అందరి ఇంట్లో వ్యక్తిగా మారారంటూ మంత్రి పొగడ్తల్లో ముంచెత్తారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులు నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ముందే.. గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డ్వాక్రా మహిళలను వారధి వద్దకు తరలించారు. తాడేపల్లి వద్ద మంత్రులకు స్వాగతం పలికేందుకు.. అధికార పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. మండుటెండలో మహిళలను అక్కడికి ఆటోల్లో తరలించగా.. వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.వారధి దగ్గర మీటింగ్ ఉందని చెప్పి.. మెప్మా అధికారులు మహిళలను ఆటోల్లో తరలించారు. ఎండ వేడిని తట్టుకోలేక మహిళలు వారధి వద్ద ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలోని సెల్లార్లలో తలదాచుకున్నారు. మెప్మా అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ ఉందని చెప్పి పదింటికల్లా ఇక్కడికి రమ్మన్నారని మహిళలు వాపోయారు. సుమారు రెండు గంటలు ఎండ వేడిని భరించలేక సెల్లార్ లోకి వచ్చామని మహిళలు తెలిపారు. దాదాపు రెండు గంటల తర్వాత ఎండలో ఉన్న మహిళలకు అధికారులు మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ కోసం మహిళలు ఎగబడ్డారు.
*కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి మందిర నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిధులతో వారి ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎంపీ దామోదరరావు, టిటిడి బోర్డు తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు ఈరోజు అమరావతి లో నిర్మాణంలో ఉన్న వెంకటాచల టిటిడి ఆలయాన్ని సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఆలయ ప్రాంగణాన్ని అణువణువు పరిశీలించారు.
*నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లక్ష్మీనరసింహస్వామి లోహమయ శిలామయ విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకల తొలి ఆహ్వాన పత్రికను నీలకంఠేశ్వరాలయ స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తమ ఇంటి ఇలవేల్పు అయిన సీహెచ్ కొండూరులోగల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున ప్రారంభం వచ్చే నెల 4 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు.
*స్వామివారి దర్శనం అనంతరం వారికి గర్భాలయ ముఖమండపంలో ప్రధాన అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారితోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, నాల్సా మెంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ జైన్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
*దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకోవాలని సూచించారు. ఆదివారం రోజే 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
*ధర్మ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారని బిసి,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.తెలంగాణలో వైభవోపేతంగా ఆలయాలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ న భూతో న భవిష్యత్ లా యాదాద్రి నిర్మాణం పూర్తిచేశారని అన్నారు. అలాగే త్వరలో కరీంనగర్లో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరగనుందని ఈసందర్భంగా మంత్రి తెలిపారు.నగరం మద్యలో అత్యంత విలువైన పదెకరాలను ప్రభుత్వం కేటాయించినట్టు తెలిపారు. గతంలోనే ఇక్కడ ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదించిందని తెలిపారు.
*తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రభుత్వం ప్రారంభించిన పధకాల్లో తెలంగాణకు హరితహారం పథకం అనుకున్నదానికంటే అధికంగా పురోగతి సాధిస్తున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్ జంగల్. పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.ఈ పరిస్థితుల్లో సీఎం కేసిఆర్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్యక్రమంగా హరిత హారం కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. మొక్కలని నాటి, వాటిని సంరక్షించి, అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసిఆర్ హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలు కూడా ఒక ఉద్యమంలా కొనసాగుతున్నాయి.
*స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ… తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తి అని కొనియాడారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.
*అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా శివన్నారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టమని రెచ్చగొట్టింది చంద్రబాబు, పేరు పెట్టింది సీఎం జగన్ అని చెప్పారు.క్విట్ జగన్ … క్విట్ చంద్రబాబు అనేది బీజేపీ నినాదమన్నారు. కుటుంబ పార్టీలు పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. బీజేపీ, జనసేన మధ్య మాత్రమే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.గడపగడపకూ వెళ్తుంటే ప్రజలు తిరగబడుతున్నారన్నారు.అందుకే బస్సు యాత్ర చేస్తూ గుంపుగా వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే నెల ఆరు, ఏడు తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారని పిట్టా శివన్నారాయణ తెలిపారు.
*మహానాడుకు వచ్చేవారిని పోలీసు యంత్రాంగం ఇబ్బందులకు గురిచేస్తోంది. వాహనాలు నిలపడానికి 45 ఎకరాల పార్కింగ్ స్థలం ఉన్నప్పటికీ వాహనాలను రోడ్డు మీదే నిలిపివేసి టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తల కంటే పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో పార్కింగ్ స్థలం ఉన్నప్పటికీ.. వాహనాలను రోడ్డు మీదే పోలీసులు నిలిపేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానాడుకు వచ్చే వాహనాలను 5కి.మీ. దూరంలో నిలిపివేస్తుడడంతో మహానాడు ప్రాంగణానికి వచ్చేందుకు టీడీపీ శ్రేణులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పోలీసుల తీరుతో మహానాడుకు వెళ్లే రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలను రోడ్లపై ఆపి పోలీసులు టైర్లలో గాలి తీసేస్తున్నారని టీడీపీ నేతలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కొందరు పోలీసులమని వచ్చి వేధిస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*గన్నవరంలో మంత్రుల రాక కోసం గంటల తరబడి జనాలు ఎదురు చూస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వెళ్లిపోకుండా స్టేజికి ఇరువైపులా ఇనుప స్టూళ్లు ఏర్పాటు చేశారు. బెజవాడ బెంజ్ సర్కిల్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. మంత్రుల రాక ఆలస్యం కావడంతో జనం ఇళ్లకు వెళ్లిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో డ్వాక్రా బృందాలు మాత్రం మీటింగ్ జరిగేంత వరకూ వేచి ఉన్నాయి. మీటింగ్‌కు అటెండై తమ బృందాలతో ఫొటోలు దిగి పెట్టాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు రాక ముందు డ్వాక్రా మహిళలు ఫొటోలు దిగే పనిలో పడ్డారు. మంత్రుల బస్సు యాత్ర కోసం బందర్ రోడ్డులో ఆంక్షలు విధించారు. దీంతో బెజవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* కోనసీమ: జిల్లాలో వరుసగా నాలుగవ రోజు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రేపు ఏపీ పాలిసెట్ప రీక్ష జరుగనుంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 2,500 మంది వరకు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్నెట్ సేవలు లేక హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో తెలియక విద్యార్థులు కన్నీళ్ళు పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే.
* ఒక్కరోజు పర్యటన కోసం చెన్నై వచ్చిన తనకు అపూర్వ స్వాగతం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ తమిళనాడు. రాష్ట్రంలో నిన్న చేపట్టిన పర్యటన మరిచిపోలేనిది’ అని పేర్కొంటూ తన కార్యక్రమంలోని హైలెట్స్‌తో కూడిన 2.7 నిమిషాల నిడివి కలిగిన వీడియో కూడా శుక్రవారం పోస్ట్ చేశారు. గురువారం చెన్నై వచ్చిన ప్రధాని.. రూ.31,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయనకు డీఎంకే, బీజేపీ కార్యకర్తలతో పాటు నగర వాసులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో తన చెన్నై పర్యటనపై ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు.
* తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో తెలుగు వారి సత్తా చాటిన రాజకీయ యోధుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కెనడాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి
*రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పాలిసెట్-2022)కు అన్ని ఏర్పాట్లూ చేశామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,37,371 మంది పాలిసెట్-2022కు దరఖాస్తు చేసుకున్నారని, 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
*చిత్తూరు జిల్లాలో గ్రానైట్ అక్రమ మైనింగ్ జరిగిన సంగతి వాస్తవమేనని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన సంయుక్త తనిఖీల కమిటీ తేల్చింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ముద్దనపల్లే గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఎన్జీటీలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేయగా… తనిఖీల కోసం ఎన్జీటీ నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తనిఖీలు నిర్వహించి తన నివేదికను ట్రైబ్యునల్‌కు అందించింది. ‘‘సర్వే నంబరు 104లో 5.29 ఎకరాల్లో, సర్వే నంబరు 213లో 2.15 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గనుల శాఖ ఈ ఏడాది జనవరిలో సిట్‌ను ఏర్పాటు చేసింది.
*కాంగోలో అమాయక పౌరులపై దాడులకు ప్రయత్నిస్తున్న సాయుధ గ్రూపు ఎం23 ని క్రియాశీలకంగా నిలువరిస్తున్న భారతీయ దళాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఐరాస శాంతి ఆపరేషన్‌లో భాగస్వామ్యం అందిస్తున్న ఇతర దేశాల బలగాలను కూడా కొనియాడింది. శాంతిని నెలకొల్పేందుకు అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగోలో అమాయక పౌరులపై దాడులను అడ్డుకోవడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఐరాస సెక్రటరీ-జనరల్ ఫర్ పీస్ ఆపరేషన్స్ జీన్-పియరీ లాక్రోయి మెచ్చుకున్నారు. పశ్చిమ కాంగోలో రెండు వారాలుగా ఎం23 సాయుధ గ్రూప్ దాడులకు క్రీయాశీలక ప్రయత్నాలు చేస్తోందని జీన్-పియరీ వెల్లడించారు. ఈ గ్రూప్ దాడులను భారత్ సహా ఇతర దేశాల బలగాలు సమర్థవంతంగా నిలువరిస్తున్నాయని చెప్పారు.
*వైద్య ప్రవేశ పరీక్ష నీట్-2022 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 18 లక్షలు దాటింది. గత ఏడాది కన్నా ఈ సంఖ్య 2.5 లక్షలకన్నా ఎక్కువగా ఉంది. నీట్ కోసం 18.72 లక్షలకు పైగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొన్నారు. జూలై 17న 13 భాషల్లో నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 771 మంది విదేశీయులు, 910 మంది ప్రవాస భారతీయులు, 647 మంది ఓవర్‌సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లున్నారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఇంగ్లి్‌షను పరీక్ష మాధ్యమంగా ఎంచుకోగా.. తర్వాత హిందీ, తమిళం ఉన్నాయి.
*దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో 2020-21లో అత్యధిక వ్యయం చేసిన మొదటి అయిదు పార్టీలలో టీఆర్‌ఎస్ 5వ స్థానంలో, టీడీపీ 2వ స్థానంలో ని లిచాయి. ఎన్నికలహక్కుల గ్రూపు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం ఆ ఏడాది డీఎంకే రూ.218.49 కోట్లు, టీడీపీ రూ.54.76 కోట్లు, ఏఐఏడీఎంకే రూ.42.37 కోట్లు, జేడీయూ రూ.24.35 కోట్లు, టీఆర్‌ఎస్ రూ. 22.35 కో ట్లు వ్యయం చేసి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ పార్టీల ఆదాయం రూ.434.25 కోట్లు. ఎన్నికల బాండ్ల ద్వారా రూ.250.60 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఈ ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. మొత్తం 31 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ. 529.41 కోట్లు కాగా, ఖర్చు రూ.414.02 కోట్లు అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
*హజ్ యాత్రికులు ఈ నెల 31లోగా ప్రయాణానికి సంబంధించిన మొత్తం డబ్బు చెల్లించాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రకటించినట్లు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ తెలిపింది. మొదటి విడతలో చెల్లించిన నగదు పోగా మిగిలిన మొత్తాన్ని ప్రయాణికులు చెల్లించాలని తెలంగాణ హజ్ కమిటీ ఈవో షఫిఉల్లా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్రికుల కోసం హజ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ క్యాం పులు నిర్వహిస్తోందని, వీటికి తప్పకుండా హాజరు కావాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 040-23298793 నంబరును సంప్రదించాలన్నారు.
* ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బాగుండె. ఇప్పుడు జగన్ ఏడిపించి ఏడు గుటకల నీళ్లు తాపిస్తున్నాడు. పురుగుల మందుతాగి సచ్చిపోవడం ఒక్కటే మార్గం’ అని వృద్ధ దంపతులు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మను నిలదీశారు. అనంతపురం జిల్లా చెదళ్ల గ్రామంలో ప్రజాప్రతినిధులు..హనుమంతరెడ్డి, రత్నమ్మ దంపతులను పలుకరించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరూ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలి? మాకు ఉపాధి చూపించాలి అంటూ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
*గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్, ఫార్మశీ, మేనేజ్‌మెంట్, సైన్స్, లా, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల (గ్యాట్-2022) ఫలితాలను గీతం ఉప కులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాట్ ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌లో మే 31వ తేదీ నుంచి తొలి విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాల్లో ఇంజనీరింగ్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాదికి ప్రోత్సాహకాలుగా రూ.30 కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో 3,920 మంది క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. వైద్య రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి కొత్తగా బీఎ్‌ససీ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, ఎమెర్జన్సీ మెడిసిన్ కోర్సులను ప్రారంభించామని వెల్లడించారు. ఈ సమావేశంలో గీతం ప్రొ-వైస్ ఛాన్సలర్ జయశంకర వారియర్, రిజిస్ట్రార్ గుణశేఖరన్, అడ్మిషన్ల డైరెక్టర్ శేఖర్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
* స్మార్ట్/ప్రీపెయిడ్ విధానంలో పనిచేసే మీటర్ల బిగింపునకు కేంద్రం గడువు విధించింది. ఎలక్ట్రిసిటీ చట్టం-2003 సెక్షన్ 177లోని సబ్ సెక్షన్లు, క్లాజులను అనుసరిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఏ టీ అండ్ సీ(పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలు) 15ు పైన ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 25ు దాటితే ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ వినియోగదారులను మినహాయించి.. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో 2022 డిసెంబరు 31 కల్లా స్మార్ట్/ప్రీపెయిడ్ విధానంలో పనిచేసే మీటర్లు బిగించాలని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు(డీటీ) 2023 మార్చికల్లా మీటరింగ్ పూర్తి కావాలని కేంద్రం నిర్దేశించింది.
*రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ఈనెల 18న లండన్‌కు చేరుకు న్న ఆయన అక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాల గురించి వారికి వివరించారు. ఈ పర్యటనలో మొత్తం 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమైన ఆయన.. సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చేలా చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రభు త్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాల గురించి ప్రపంచ వేదికపై వివరించడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, వ్యాపార వాణిజ్య సంస్థలకు.. యూకే, స్విట్జర్లాండ్ దేశాల్లోని చెందిన ఎన్నారైలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటిలాగానే.. అత్యుత్తమ విధానకర్తలను, వ్యాపారవేత్తలను, ఆలోచనాపరులను కలుసుకునే గొప్ప అవకాశాన్ని, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిపే అవకాశాన్ని దావోస్ ఇచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
* ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. సికింద్రాబాద్ పార్శిగుట్టలోని జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ సంగ్రామయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడ్చల్‌లో ఈనెల 28 సాయంత్రం 4 గంటలకు మాదిగల సంగ్రామయాత్ర మొదలవుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గ్రామాల్లో చైతన్యం కల్పించేందుకే ఈ యాత్రని పేర్కొన్నారు. 120 రోజులపాటు 119 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. వర్గీకరణ విషయంలో జాప్యంచేస్తే కేంద్రంపై యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1 నుంచి సంగ్రామయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లా పేరును స్వాగతిస్తున్నా మన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో, ఏపీలో ఎమ్మార్పీఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సురేష్, ఎంఎ్‌సఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
* ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యేడాది మరికొన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు గిరిజన శాఖ కృషి చేస్తోంది. తద్వారా స్థానిక గిరిపుత్రులకు ఉపాధి కల్పించడంతో పాటు గిరిజన సహకార సంస్థ మనుగడకూ ఇబ్బంది లేకుం డా చూడాలని భావిస్తోంది. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో గిరిజనులకు ఉపాధి లేకుండా పోయింది. వారి నుంచి అటవీ ఉత్పత్తులు రాకపోవడంతో.. వాటిని మార్కెటింగ్ చేసే గిరిజన సహకార సంస్థపైనా ఆర్థికంగా ప్రభావం పడింది. దీంతో సమస్య పరిష్కారంపై సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాం తాల్లో ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసింది. వీటి ద్వా రా కొంత మంది గిరిపుత్రులకు బతుకుదెరువు చూపుతోంది. గిరిజన శాఖఆధ్వర్యంలో 2017-18లో మొదట రెండు పెట్రోల్ బంకులు ఏర్పా టు చేశారు. 2021-22 నాటికి ఆ సంఖ్య 15కు పెరిగింది. 2022-23లో ఐదు బంకులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అధికారులు.. రెండు బంకులు ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 17 పెట్రోలు బంకులు కొనసాగుతుండగా, మొత్తం 30 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
*రాగల రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం కేరళ తీరం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘావృతం పెరిగిందని, దీంతో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాల్లో ప్రవేశించటానికీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, లక్షద్వీప్ నుంచి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు పశ్చిమ గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలపడి బలంగా వీస్తున్నాయి. అదేక్రమంలో ఉత్తర కర్ణాటక, దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి శుక్రవారం బలహీనపడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
*రెడ్ల మహా సంగ్రామం సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. శుక్రవారం నిర్వహించిన ఈ సభకు తొలుత పోలీసులు అనుమతి మంజూరు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక హైకోర్టును ఆశ్రయించింది. న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చిలో ఇదే తరహా సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతించిన పోలీసులు ఇప్పుడు అంగీకరించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. షరతులకు కట్టుబడి ఉంటామని అండర్ టేకింగ్ తీసుకుని సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు సభను నిర్వహించారు.
*కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని సిపెట్ నిర్వహించే డిప్లమా, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు జూన్ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపుకోవాలని సిపెట్ జాయింట్ డైరెక్టర్ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, డిప్లమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ మూడేళ్ల కోర్సులకు టెన్త్ ఉత్తీర్ణులయిన విద్యార్థులు, ఫలితాల కోసం నిరీక్షిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్, అండ్ టెస్టింగ్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు బీఎస్సీ ఉత్తీర్ణత, ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 19న అనంతపురం, విజయవాడల్లో పరీక్ష జరుగుతుందని, వివరాల కోసం కె.కిరణ్‌కుమార్ 9985941979లో సంప్రదించవచ్చన్నారు.
*దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో 2020-21లో అత్యధిక వ్యయం చేసిన మొదటి అయిదు పార్టీలలో టీఆర్‌ఎస్ 5వ స్థానంలో, టీడీపీ 2వ స్థానంలో నిలిచాయి. ఎన్నికల హక్కుల గ్రూపు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం ఆ ఏడాది డీఎంకే రూ.218.49 కోట్లు, టీడీపీ రూ.54.76 కోట్లు, ఏఐఏడీఎంకే రూ.42.37 కోట్లు, జేడీయూ రూ.24.35 కోట్లు, టీఆర్‌ఎస్ రూ.22.35 కోట్లు వ్యయం చేసి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి.
*కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల ఆకస్మిక నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్ డీలర్ల వ్యాపార మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ పెట్రోలియం డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తీసుకొచ్చిన విధానాలను నిరసిస్తూ ఈనెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ కంపెనీల నుంచి పెట్రో ఉత్పత్తులు కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కారణంగా డీలర్లు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని డీలర్లంతా శుక్రవారం విజయవాడ ఆటోనగర్‌లోని ఎగ్జిబిషన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఆకస్మికంగా ధరల తగ్గింపు వల్ల డీలర్లు ఒక్క ఉదుటున నష్టపోవాల్సి వచ్చిందని ప్రధానంగా చర్చించారు. ఇలాంటి చర్యల వల్ల డీలర్ల వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల పెంపునకు ఆయిల్ కంపెనీలు దృష్టి సారించకపోవటంపైనా కూలంకుషంగా చర్చించుకున్న మీదట ఈనెల 31వ తేదీన నిరసన తెలపాలని, ఆ రోజున ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
*రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల సమగ్ర సర్వేపై అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా రీ సర్వే కొనసాగుతున్న తీరు, కొత్తగా చేపట్టాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై అధికారులు ఇచ్చిన నివేదికలపై సర్కారు సమీక్ష చేపట్టింది. సర్వేసెటిల్‌మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ శుక్రవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా అధికారుల నుంచి నివేదికలతోపాటు ప్రజంటేషన్లు స్వీకరించినట్లు తెలిసింది. ఈ నివేదికలను క్రోడీకరించి రీ సర్వేపై సర్కారుకు ఓ రిపోర్టును సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే, ఇదే అంశాలపై జిల్లాల పర్యటనలకు వెళ్లిన అధికారులు జేసీలతోనూ భేటీ అయ్యారు. వారికి పలు అంశాలపై నివేదికలు ఇచ్చారు. ఆయా అంశాలపై వారు జిల్లాల కలెక్టర్లకూ రిపోర్టు ఇచ్చారు.
*ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూలీల వేతనాల కోసం మరో రూ.670 కోట్లు మంజూరయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనాల కోసం మొదటి దఫా రూ.929.20 కోట్లు, రెండో విడతగా రూ.228.91 కోట్లు మంజూరు కాగా తాజాగా మంజూరు చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1,828.69 కోట్లు మదర్ శాంక్షన్ అయ్యాయని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు రూ.955.49 కోట్లు రోజువారీ వేతన ఎఫ్‌టీఓల అప్‌లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన నిధులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
*జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిపాలన కారణాల కింద సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ర్టార్లను డివిజనల్ కో ఆపరేటీవ్ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ రిజిస్ర్టార్ క్యాడర్ అధికారులను పునర్వవస్థీకరించిన జిల్లాలకు జిల్లా సహకారశాఖ అధికారి, సహకార ఆడిటింగ్ అధికారులుగా నియమించారు. వివిధ డివిజన్లలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ వంటి విధులు నిర్వహించడానికి 20 మంది అసిస్టెంట్ రిజిస్ర్టార్లను ఆయా డివిజనల్ కో ఆపరేటీవ్ ఆఫీసర్ (అఫీషియేటింగ్) పోస్టుల్లో నియమించారు. వీరంతా డిప్యూటీ రిజిస్ర్టార్ల నుంచి బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
*తన కుర్చీని కాపాడుకోవడం కోసమే ప్రధానమంత్రి మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దాసోహమైపోయారని సీపీఎం నాయకురాలు బృందా కరత్ విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నరేంద్రమోదీ బడా కార్పొరేట్ సంస్థల ఆస్తులను పెంచేందుకు మాత్రమే కృషిచేస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ మిన్నకుంటున్నారని, తన పదవి కోసమే ఏ విషయంలోనూ మోదీని ప్రశ్నించడం లేదని విమర్శించారు. కేంద్రం సుప్రీంకోర్టు ద్వారా గిరిజనులకు సంబంధించిన జీవో-3ను రద్దు చేయిస్తే, దానిపై కేంద్రంతో పోరాటం చేయాల్సిన జగన్ మిన్నకున్నారన్నారు. అలాగే అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాలకు మోదీ ప్రభుత్వం సవరణలు చేస్తుంటే…జగన్ ఏమీ మాట్లాడడం లేదన్నారు. ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు, 2022 లోనూ డోలీ మోతలు ఉండడం ఘోరమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
*కోనసీమలో జరిగిన ఘటనలకు నిరసనగా జూన్ 2న విజయవాడలో అంబేడ్కర్ ఆత్మగౌరవ యాత్ర నిర్వహించనున్నట్లు జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కోనసీమ అల్లర్లకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
*కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో చెలరేగిన విధ్వంసకర సంఘటనలకు దారితీసిన పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులు పోస్టుమార్టం ప్రారంభించారు. బస్సుల దహనం, మంత్రి విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కుమార్‌లకు చెందిన గృహ దహనాల సమయంలో పోలీసుల తీరు, వారి వైఫల్యాలపై అంతర్గత సమీక్ష నిర్వహించారు. విధ్వంస ఘటనల్లో పాల్గొన్న నిందితులను గుర్తించే వీడియో, సీసీ ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నారు. గుర్తించిన నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు అనుసరించాల్సిన వ్యూహాలపైనా కీలకంగా చర్చించారు.
*దేశవ్యాప్తంగా ఆరు హైకోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన త్రిసభ్య కొలీజియం శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా కూడా ఉన్నారు. ఈయనను మళ్లీ పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. గతంలో పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమానుల్లా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయనను తిరిగి అదే స్థానానికి బదిలీ చేయనున్నారు. ఒడిసా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిత్తరంజన్ దాస్‌ను కలకత్తా హైకోర్టుకు, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాషిస్ తలపాత్రను ఒడిసా హైకోర్టుకు, మణిపూర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లనుసుంగకుమ్ జమీర్‌ను గౌహతి హైకోర్టుకు, జమ్ము కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను బాంబే హైకోర్టుకు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పురుషేంద్ర కుమార్ గౌరవ్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సిఫారసు చేసింది. జస్టిస్ అమానుల్లా గత ఏడాది అక్టోబరు 10న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పట్నా హైకోర్టు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆయన ఏడాది గడవక ముందే తిరిగి స్వరాష్ట్రానికి వెళ్తున్నారు.
*స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణలోని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు.