దేశ రాజకీయాల్లో.. దిల్లీ పీఠం మాటే శాసనంగా చెలామణి అయ్యే కాలమది..! సమాఖ్య స్ఫూర్తికి పాతరేసి.. ప్రజాప్రభుత్వాలను కూలదోసే దొడ్డిదారి రాజకీయం రాజ్యమేలుతున్న రోజులవి..!! కేరళలో రాష్ట్ర సర్కారును కూలదోసిన విధంగానే.. తెలుగునాట సైతం గవర్నర్ అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రంలోని కాంగ్రెస్. దెబ్బ తిన్న బెబ్బులిలా తిరిగి అధికారం చేపట్టిన అన్నగారు.. దేశంలోనే కాంగ్రెస్ పెత్తనం లేకుండా చేసేందుకు దిల్లీనే ఢీకొట్టారు. దేశవ్యాప్తంగా ప్రముఖపాత్ర పోషిస్తున్న నేతలను ఏకతాటిపైకి తెచ్చి.. హస్తం పార్టీపై యుద్ధం ప్రకటించారు. రాజీలేని పోరాటంతో.. దిల్లీ పాదుషాల గుండెల్లో వణుకు పుట్టించారు..!!!
గల్లీ నుంచే దిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు N.T.R. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల మధ్య గీతను చెరిపేస్తూ… సమాఖ్య వ్యవస్థ కోసం సమైక్యంగా పోరాడిన ధీరుడు. దిల్లీ గద్దెపై పాతుకుపోయిన కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు విభిన్న రాజకీయ శక్తులను కూడగట్టిన మొనగాడు. దేశంలో మరే నాయకుడు సాహసించని విధంగా “సై అంటే సై” అంటూ… సామ్రాజ్ఞి ఇందిరకు ఎదురునిలిచిన ఒకేఒక్కడు. రాజకీయ ఉత్థాన పతనాలతో నిమిత్తం లేకుండా… జాతీయ ప్రత్యామ్నాయం కోసం అలుపెరగక కృషి సాగించిన ధీశాలి నందమూరి తారకరాముడు.
ఏపీని తాకలేకపోయిన కాంగ్రెస్ గాలి :
తెలుగునాట కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టి, అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన N.T.R ధీరత్వం… యావత్ దేశాన్నీ అబ్బురపరిచింది. కాంగ్రెస్‌ను మట్టికరిపించిన మహాయోధుడు ఎవరా అంటూ… దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఆశ్చర్యంగా చూసింది. 1983 శాసనసభ ఎన్నికల విజయం ఒక ఎత్తైతే… 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పసుపు ప్రభంజనం మరో ఎత్తు. అప్పట్లో కాంగ్రెస్ పెనుగాలికి దేశవ్యాప్తంగా విపక్షాలు మట్టికరిచాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం హస్తం ఎత్తులు పారలేదు. N.T.R అనే మహావృక్షాన్ని… కాంగ్రెస్ గాలి ఇంచు కూడా కదిలించలేకపోయింది. రాష్ట్రమంతటా సైకిల్ సవారీ చేసింది. 30 పార్లమెంట్ స్థానాల్లో జయభేరి మోగించింది. లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ రాజకీయ ప్రకంపనతో… తెలుగుదేశం పార్టీ మరోసారి దేశం దృష్టిని తనవైపు తిప్పుకొంది.ఏకతాటిపైకి జాతీయ నేతలు : ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నాటి నుంచే దిల్లీకేసి చూసిన N.T.R…. కాంగ్రెసేతర పార్టీల ఐక్యత కోసం విశేష కృషి చేశారు. విజయవాడలో నిర్వహించిన తొలి మహానాడును… వివిధ పార్టీలను కూడగట్టేందుకు వేదికగా చేసుకున్నారు. జాతీయస్థాయిలో ఉద్ధండులుగా వెలుగొందిన వాజ్ పేయి, జ్యోతిబసు, చంద్రశేఖర్, రామకృష్ణ హెగ్డే, S.R.బొమ్మై, చండ్ర రాజేశ్వరరావు, నంబూద్రిపాద్, భీంసింగ్, బిజూ పట్నాయక్ సహా… తమిళనాట ఉప్పు-నిప్పుగా ఉన్న M.G.R, కరుణానిధిని ఒకే వేదికపైకి తెచ్చారు. సమాఖ్య వ్యవస్థ పరిరక్షణే లక్ష్యంగా సమైక్య పోరాటానికి బీజం వేశారు. కాంగ్రెస్ పెత్తందారీ రాజకీయాలకు చెల్లుచీటీ తప్పదని, దేశ రాజకీయాల్లో తెలుగువాడు చక్రం తిప్పగలడని సంకేతాలిచ్చారు ఎన్టీఆర్.
కేంద్రంలో జెండా పాతిన నేషనల్ ఫ్రంట్ :
జాతీయస్థాయి ప్రత్యామ్నాయంపై NTR కృషి అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేక శక్తుల ఐక్యతకు నిరంతరంగా ప్రయత్నాలు కొనసాగించారు. ఆ క్రమంలోనే 1988లో జరిగిన మహానాడుకు… మరోసారి జాతీయనేతలను తీసుకొచ్చారు. వాజ్‌పేయి, అజిత్‌సింగ్, బిజూపట్నాయక్ సహా యోధానుయోధుల సమక్షంలో… కాంగ్రెసేతర పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఏకం కావాలని ప్రతిపాదించారు. ఒకే జెండా, ఒకే గుర్తుపై పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినా… దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతర కాలంలో “భారతదేశం పార్టీ” అన్నగారి మదిలో మెదిలినా… ఆ దిశగా ముందడుగు పడలేదు. అయినా పట్టు విడవకుండా… జనతా పార్టీ, లోక్‌దళ్, జన్‌మోర్చా, D.M.K, A.G.P, కాంగ్రెస్ (S)లను ఏకంచేశారు. N.T.R ఛైర్మన్‌గా, V.P.సింగ్ కన్వీనర్‌గా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుచేశారు. నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై కలసికట్టుగా పోరాటం సాగించారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీల మధ్య ఐక్యత సడలకుండా చూశారు. అదే జోరుతో 1989 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేషనల్ ఫ్రంట్… కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టింది.నాదెండ్ల వెన్నుపోటు : 1984 ఆగస్టు సంక్షోభం… N.T.R జాతీయ రాజకీయ శక్తిగా ఎదగడంలో కీలక పాత్ర వహించింది. గుండె చికిత్స కోసం N.T.R అమెరికా వెళ్లినప్పుడు… అప్పటి ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో కలిసి కుట్ర చేశారు. M.L.Aలను మభ్యపెట్టి ప్రభుత్వాన్ని అస్థిర పరిచారు. ఆగస్టు 15వ తేదీ N.T.R జాతీయ జెండా ఎగురవేసిన కాసేపటికే… ప్రజా ప్రభుత్వానికి గవర్నర్ రాంలాల్ పాతరేశారు. ఆ మరుసటి రోజే నాదెండ్ల భాస్కరరావుతో సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ వెన్నుపోటును తీవ్రంగా గర్హించిన అన్నగారు… మరోసారి జనం బాట పట్టారు. చైతన్యరథంపై ఊరూరా తిరిగి… కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టారు. అన్న ఆవేదన చూసి ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఊరూవాడ భగ్గుమంది. అదే సమయంలో దేశమంతా పర్యటించి కాంగ్రెసేతర పార్టీల మద్దతు కూడగట్టారు. తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన ఎమ్మెల్యేలతో… రాష్ట్రపతి ముందు పరేడ్ చేశారు. ఈ పరిణామాలతో దిల్లీ దద్దరిల్లింది. ఒకే దెబ్బకు గవర్నర్ రాంలాల్‌ను, నెలరాజు నాదెండ్లను సాగనంపి… NTR ప్రభుత్వాన్ని పునఃప్రతిష్టించారు.
దిల్లీ దాదాగిరికి ఎదురొడ్డి :
గవర్నర్ల వ్యవస్థ వ్యర్థమంటూ అలుపెరగక పోరు సాగించారు N.T.R. కాంగ్రెస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లను సాగనంపాలని పట్టుబట్టారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. దిల్లీ ఆడినట్లు ఆడమంటే కుదరదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా గళం వినిపించారు. వివిధ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి కాంక్లేవ్‌లు ఏర్పాటుచేశారు. రాష్ట్రాలు లేకుండా కేంద్రం మిథ్య అంటూ గర్జించారు. 1983లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే నిర్వహించిన దక్షిణ భారత సీఎంల సమావేశం వేదికగా… కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి కమిషన్ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిషన్‌ను కొలువుదీర్చింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ అధ్యక్షతన జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సదస్సులో… కేంద్ర ప్రభుత్వ పెత్తనంపై N.T.R గొంతెత్తారు. జమ్ముకశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వ రద్దును తీవ్రంగా నిరసించారు. ప్రధాని వారిస్తున్నా వెనుకడుగు వేయలేదు. దిల్లీ దాదాగిరి చేస్తుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు.