న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలలో భాగంగా రెండో రోజు వివిధ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు కళారూపాలు నృత్యాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ యాంకర్లు సుమ, రవి వ్యాఖ్యానాలతో కార్యక్రమాలను రక్తి కట్టించారు. ఒకపక్క మహాసభలకు అనుబంధంగా మహిళ వాణిజ్యం ఆరోగ్యం ఇమిగ్రేషన్ రాజకీయం తదితర విషయాలపై నిపుణులతో చర్చావేదికలు నిర్వహించారు.
పాటల పోటీలకు మంచి స్పందన లభించింది. మహాసభల ఆవరణలో వివిధ రకాల స్టాళ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన సభలో తెలంగాణ నుండి తరలివచ్చిన వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు తమ పార్టీల వాదనను గట్టిగా వినిపించారు.
ప్రముఖ గాయని సునీతా బృందం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. తానా, నాట్స్, ఆటా ఇతర తెలుగు సంఘాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. టీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి, సలహా మండలి చైర్మన్ విజయపాల్ రెడ్డి, కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు.