తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను అమెరికాలోని షికాగోలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నగరంలోని మాల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలను ప్రదర్శిస్తూ విందు భోజనాలతో ఈ వేడుకలను ముగించారు. హేమ కానూరు, రవి కాకర, కృష్ణమోహన్ హనుమంతు చేకూరి, చిరంజీవి గళ్ల, శివ త్రిపురనేని, సందీప్ యల్లంపల్లి, పవన్ నల్లమల్ల, మదన్ పాములపాటి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి.