తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ 12 రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మొదట లండన్ చేరుకున్న ఆయన బ్రిటన్, భారత్ వాణిజ్య మండలి రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో పెట్టుబడులపై ప్రసిద్ధ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. భారత రాయబారి ఏర్పాటు చేసిన వాణిజ్యవేత్తలు, ప్రవాసుల భేటీల్లోనూ ఆయన పాల్గొన్నారు. 22న లండన్ నుంచి స్విట్జర్లాండ్‌కు పయనమయ్యారు. 23న దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు. 28 దాకా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్.. తెలంగాణ పెవిలియన్‌లో 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో భేటీ అయ్యారు. పెట్టుబడుల సాధనకు, డిజిటల్, ఆర్థిక, సాంకేతిక సేవలకు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.