DailyDose

ఖమ్మం, వరంగల్‌లకు వస్తోన్న అమెరికన్‌ ఐటీ కంపెనీ

ఖమ్మం, వరంగల్‌లకు వస్తోన్న అమెరికన్‌ ఐటీ కంపెనీ

తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల విస్తరణ క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటి వరకు దేశీ కంపెనీలు మాత్రమే టైర్‌టూ సిటీస్‌లో తమ ఆఫీసులను తెరుస్తుండగా.. తాజాగా ఓ అమెరికన్‌ కంపెనీ ఈ జాబితాలో చేరింది. దీంతో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు కూడా ఐటీ కొలువులకు అడ్డాలుగా మారతాయనే నమ్మకం బలపడుతోంది.

విస్తరణ
అమెరికాలో హ్యూస్టన్‌కి చెందిన టెక్‌వేవ్‌ సంస్థ విస్తరణ బాట పట్టింది. ఇండియన్‌ ఎన్నారైలకు చెందిన ఈ ఐటీ సంస్థ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఫిన్‌టెక్‌, లైఫ్‌ సైన్స్‌, హెల్త్‌టెక్‌, టెలికాం, లాజిస్టిక్స్‌లలో సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో గ్లోబల్‌గా 2500ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో భారీగా విస్తరించి ఉద్యోగుల సంఖ్యను పది వేలకు చేరుకునేలా టెక్‌వేవ్‌ వ్యూహం రూపొందించుకుంది. అయితే ఈ విస్తరణలో తెలంగాణకు పెద్ద పీట వేసింది. కొత్తగా తెరిచే ఆఫీసుల్లో సింహభాగం ఇక్కడే రానున్నాయి.

ఖమ్మం, వరంగల్‌
టెక్‌వేవ్‌ సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్తగా రెండు క్యాంపస్‌లను తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో కోకొల్లలుగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. అయితే టెక్‌వాలే సంస్థ వరంగల్‌, ఖమ్మంలలో కూడా తమ కార్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించడం ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం. ఇప్పటికే టెక్‌వేవ్‌కు ఖమ్మం సెంటర్‌లో 250 మంది ఉద్యోగులు ఉండగా త్వరలోనే ఈ సంఖ్య వెయ్యికి చేరేలా ప్రణాళిక రూపొందించారు. ఇక వరంగల్‌ సెంటర్‌ పనులు వెయ్యి మంది సామర్థ్యంతో మొదలు పెట్టనున్నారు.

ఇప్పటికే
పదేళ్ల కిందట వరంగల్‌లో ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పురుడు పోసుకుంది. ఆ తర్వాత చాన్నాళ్ల పాటు చిన్నాచితకా కంపెనీలు ఉన్నా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీన్‌ మారింది. ఇప్పటికే సెయింట్‌ ఇక్కడ క్యాంపస్‌ నెలకొల్పగా మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా కూడా తమ క్యాంపస్‌లను తెరిచే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఖమ్మంలో గతేడాది ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభం అవగా ఒకేసారి ఇరవైకి పైగా కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అందులో టెక్‌వేవ్‌ ఒకటి. కాగా త్వరలో ఖమ​ంలో స్వంత క్యాంపస్‌లోకి మారనుంది.