విదేశీ వీసాల జారీలో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఫారిన్ టూర్లు ప్లాన్ చేసుకున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ప్రణాళికలన్నీ తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. షెంజెన్ దేశాలతో పాటూ బ్రిటన్ అమెరికా, కెనడా వీసాల విషయంలో జాప్యం జరుగుతున్నట్టు కొందరు పర్యాటకులు చెబుతున్నారు. షెంజెన్ దేశాల ఎంబసీల్లో తమ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ మందకొడిగా సాగుతోందని చెబుతున్నారు. అపాయింట్‌మెంట్ డేట్లు దొరకట్లేదంటున్నారు. కాగా.. ఈ విషయాన్ని కొందరు ట్రావెల్ ఆపరేటర్లు కూడా ధ్రువీకరిస్తున్నారు. అనేక దేశాల ఎంబసీల్లో ఈ నెలలో ఎలాంటి వీసా అపాయింట్‌మెంట్లు లేవని తెలిపారు.
వీసా జారీలో జాప్యం కారణంగా తాను ఇబ్బందుల్లో పడ్డానని గురుగ్రామ్‌కు చెందిన ఓ కార్పొరేట్ ఉద్యోగి తెలిపారు. గ్రీస్ పర్యటన కోసం తాను షెంజెన్ వీసాకు దరఖాస్తు చేసుకుని నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకూ జారీ కాలేదన్నారు. వీసా జారీ ప్రక్రియ ఏ దశలో ఉందన్న దానిపై తనకు ఇప్పటివరకూ ఏ సమాచారమూ అందలేదని చెప్పారు. ‘‘విమాన టిక్కెట్ల కోసం నేను దాదాపు 16 వేల డాలర్లు చెల్లించాను. ఒకవేళ టిక్కెట్లు క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఆ మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నా పాస్‌పోర్టు గ్రీస్ ఎంబసీ వద్దే ఉండటంతో మరో దేశానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే నేను పలుమార్లు అమెరికా, బ్రిటన్ కెనడా వెళ్లొచ్చాను. కరోనా సంక్షోభానికి ముందు కూడా నేను యూరోప్ దేశాల్లో పర్యటించాను’’ అని ఆయన వాపోయారు.
షెంజెన్ దేశాల ఎంబసీలు పూర్తి స్థాయిలో తమ కార్యక్రమాలు పునరుద్ధరించని కారణంగా వీసా అపాయింట్‌మెంట్ డేట్స్ కోసం పర్యాటకులు దాదాపు నెల రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోందని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జెయ్ భాటియా చెప్పారు. ‘‘అమెరికా, కెనడా, యూరప్ దేశాల విషయంలోనూ ఈ పరిస్థితి ఉంది. పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక ఎంబసీల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పరిమిత స్థాయిలోనే వీసాలు జారీ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చిందని’’ టూర్ ఆపరేటర్ ఒకరు పేర్కొన్నారు. అయితే.. వీసాల జారీ విషయంలో ఎటువంటి జాప్యం జరగడం లేదని ఢీల్లీలోని స్విట్జర్‌ల్యాండ్ దౌత్య కార్యాలయం పేర్కొంది. వీసా దరఖాస్తుల సంఖ్య పెరిగినా కూడా తాము మాత్రం ఎటువంటి ఆలస్యం లేకుండా యథావిథిగా వీసాల జారీకి అపాయింట్‌మెంట్ డేట్స్ ఇస్తున్నట్టు పేర్కొంది.