బిలయనీర్లు ఈలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్’ సంపద కరిగి పోతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల కాలంలో ఆ ముగ్గురు ధనవంతులు 115బిలియన్ డాలర్లను నష్టపోయారు. వీరితో పాటు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సైతం 44.7 బిలియన్ డాలర్లను కోల్పోయారు.
బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..అత్యధికంగా బెజోస్ 53.2 బిలియన్ డాలర్లు, మస్క్ 46.4 బిలియన్ డాలర్లు, అత్యల్పంగా బిల్ గేట్స్ 15.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో గత శుక్రవారం నాటికి మస్క్ సంపద 224 బిలియన్ డాలర్లు, బెజోస్ ఆస్తి 139 డాలర్లు, గేట్స్ ఆస్తి 123 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 133 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున నష్టపోయారు.
*కొంపముంచిన ట్విటర్!
ముఖ్యంగా మస్క్ సంపద కరిగిపోవడానికి కారణం ఆయన నిర్ణయాలేనని బ్లూం బర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. టెస్లాలో మస్క్ వాటా 15.6శాతం ఉండగా మొత్తం సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో టెస్లా కారు షేర్లు ఈ ఏడాదిలో మొత్తం (గత వారం శుక్రవారం వరకు) 37శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్‌ను 9.2శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు టెస్లా పట్ల అతని నిబద్ధతను పెట్టుబడిదారులను ప్రశ్నించేలా చేసింది.దీంతో టెస్లా స్టాక్స్ పడిపోయాయి. ఆ తర్వాత మస్క్ సైతం ట్విట్టర్‌ను 44 బిలియన్లకు టేకోవర్ చేసుకునేందుకు 8.4 బిలియన్ల విలువైన టెస్లా షేర్లను మస్క్ అమ్మాడు. వెరసీ మస్క్ సంపద కరిగిపోవడానికి పరోక్షంగా కారణమైంది.