ఒక సినిమాకి మసాలా యాడ్ చేయాలంటే.. దర్శకులందరూ చూసేది స్పెషల్ సాంగ్స్ వైపే. ఈ మధ్యకాలంలో వీటి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇదివరకు ఇలాంటి పాటల కోసం ప్రత్యేకంగా నర్తకీ మణులుండేవారు. ఇప్పుడు ఆ పని హీరోయిన్సే చేసేస్తున్నారు. చిన్న తరహా హీరోయిన్స్ ను ప్రత్యేక పాటల కోసం ఎంపిక చేస్తే ఓ మాదిరి రెమ్యూనరేషన్ ఇస్తే సరిపోతుంది. అదే స్టార్ హీరోయిన్స్ అయితే ఆ లెక్కే వేరు. దాదాపు ఒక సినిమాకి ఇచ్చే పారితోషికంలో సగం ఇచ్చేయాల్సి వస్తుంది. స్టార్ హీరోయిన్స్ కొన్ని నెలల పాటు కష్టపడితే వచ్చే సొమ్ము.. ఒక్క ఐటెమ్ సాంగ్ తో వచ్చేస్తుంది. అందుకే శ్రుతిహాసన్, కాజల్, తమన్నా లాంటి బ్యూటీస్ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా ప్రత్యేక గీతాల్లో నర్తించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు ఇదే బాటలో సమంత, పూజా హెగ్డే పయనిస్తున్నారు.
గతేడాది విడుదలైన ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావా’ పాటతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది సామ్ . రీసెంట్ గా విడుదలైన ‘ఎఫ్ 3’ (F3) లో లైఫ్ అంటే అనే పాటలో పూజా హెగ్డే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలిచిపోయింది. ఇంతకు ముందు ‘రంగస్థలం’ లో జిగేల్ రాణి పాటలో తళుక్కున మెరిసిన పూజాకి ఆ పాటతో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పూజా హెగ్డేకి మరో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ రావడం విశేషం. అది కూడా ఓ బాలీవుడ్ సినిమా కోసం. ఆ సినిమా ‘యానిమల్’ . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రం ప్రస్తుతం సెట్ప్‌పై ఉంది. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడు దర్శకుడు. దాని కోసం పూజాను సంప్రదించగా.. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఈ పాట కోసం పూజా హెగ్డేకి అత్యధిక పారితోషికాన్ని ఆఫర్ చేశాడట సందీప్ రెడ్డి. పూజా గతంలో బాలీవుడ్ లో ‘మొహంజదారో’, హౌస్ ఫుల్ 4 లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం ‘సర్కస్, కభీ ఈద్ కభీ దీవాళి’ చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ ఐటెమ్ సాంగ్ తో పూజా పాపులారిటీ బాలీవుడ్ లో మరింతగా పెరుగుతుందేమో చూడాలి.