NRI-NRT

రూ.9.26 లక్షల కోట్లు….. అమెరికాతో భారత్‌ వాణిజ్యమిది.

రూ.9.26 లక్షల కోట్లు…..  అమెరికాతో భారత్‌ వాణిజ్యమిది.

భారత-అమెరికా వాణిజ్య ‘బంధం’ బలోపేతమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) అమెరికా.. చైనాను పక్కకు నెట్టి మళ్లీ అగ్రస్థానానికి చేరింది. ఈ కాలంలో రెండు దేశాల వాణిజ్యం 11,942 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.26 లక్షల కోట్లు) చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 3,891 కోట్ల డాలర్లు ఎక్కువ. ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతుల కంటే.. భారత్‌ నుంచి ఎగుమతులు ఎక్కువగా పెరిగాయి. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌కు 3,280 కోట్ల డాలర్ల మిగులు ఏర్పడింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 1,020 కోట్ల డాలర్లు ఎక్కువ. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన ఉత్పత్తుల్లో పెట్రోలియం పాలిష్డ్‌ డైమండ్స్‌, ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తులు, జువెలరీ, లైట్‌ ఆయిల్‌, ఫ్రోజెన్‌ రొయ్యలు ఉన్నాయి. కాగా అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అయిన వాటిల్లో పెట్రోలియం, రఫ్‌ డైమండ్స్‌, లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ), బంగారం, బొగ్గు, ఆల్మండ్స్‌ సహా మరికొన్ని ఉత్పత్తులు ఉన్నాయి.

రెండో స్థానంలో చైనా
ఇదే సమయంలో భారత ఎగుమతి-దిగుమతుల్లో 11,542 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానానికి పడిపోయింది. 2020 -21లో 8,640 కోట్ల డాలర్లుగా ఉన్న రెండు దేశాల వాణిజ్యం 2021-22లో 11,542 కోట్ల డాలర్ల (రూ.8.94 లక్షల కోట్లు)కు చేరింది. అయినా అమెరికా స్థాయిని అందుకోలేక పోయింది. అమెరికాతో పెరిగినంత వేగంగా చైనాకు భారత ఎగుమతులు పెరగలేదు. మన ఎగుమతుల కంటే చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. దీంతో ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాకు భారీ మిగులు ఏర్పడుతోంది. 202-21లో 4,403 కోట్ల డాలర్లు ఉన్న ఈ మిగులు 2021-22లో 7,291 కోట్ల డాలర్లకు చేరింది. ఇటీవల కుదిరిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌) ఒప్పందంతో భారత-అమెరికా దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

చైనా తర్వాతి స్థానంలో యూఏఈ
అమెరికా, చైనా తర్వాత భారత్‌లో ద్యైపాక్షిక వాణిజ్యం అధికంగా ఉన్న దేశాల్లో యూఏఈదే అగ్రస్థానం. 2021-22లో భారత్‌-యూఏఈ మధ్య వాణిజ్యం 7,290 కోట్ల డాలర్లుగా ఉంది. ఆ తర్వాత సౌదీ అరేబియా 4,285 కోట్ల డాలర్లు, ఇరాక్‌ 3,433 కోట్ల డాలర్లు, సింగపూర్‌ 3,000 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.