కిన్నెర సాంస్కృతిక సంస్థ వారు ఎన్.టి.రామారావు శత జయంతి సందర్భంగా ఈ మే 30 నాడు హైదరాబాదులో – 1950, 60, 70 దశకాల్లో తెలుగు సినీ ప్రేక్షకుల కలల రాణిగా తెలుగు తెర మీద వెలిగిన, ఎన్.టి.ఆర్ తో అత్యధిక సినిమాల్లో (40) ‘హీరోయిన్ ‘గా నటించిన జమున ను ఎన్.టి.ఆర్ స్మారక ప్రతిభా పురస్కారంతో సత్కరించారు.
మహారాష్ట్ర పూర్వపు గవర్నరు సిహెచ్. విద్యాసాగర రావు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, కిన్నెర రఘురాం, ‘శ్రీ డెవలపర్స్’ భోగరాజు మూర్తి, సామాజిక సేవ కార్యకర్తలు కొత్త శ్రీనివాస్, క్రిష్ణవేణి దంపతులు, సినీ విశారద ఎస్.వి.రామారావు లు జమున నటనా వైదుష్యాన్ని కొనియాడుతూ ప్రసంగించారు.
సభ మొదలైనాక వచ్చిన జమున తన ఆలస్యానికి మన్నించమని కోరారు.సత్కారం అందుకున్నాక, జమున మాట్లాడారు. “నా వయస్సు 86” అని చెబుతూనే, ఎన్.టి.ఆర్ తో తన తొలి చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు ‘ దగ్గర్నుంచి అనేక విషయాలను జమున ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా చెప్పారు.
“రామారావు గారు సెట్ మీద ఎవరితోనూ అతిగా మాట్లాడటం, పరాచికాలాడటం ఇష్టపడే వారు కాదు… కాని, ఎప్పుడన్నా షూటింగ్ విరామ సమయంలో బయట కూర్చుంటే ఆయనతో నేను, సావిత్రి, అంజలి మాత్రమే కూర్చొని ముచ్చటించుకునేవాళ్ళం. .. అలాంటి ఒక సందర్భంలో ఆయన స్పెషల్ గా బజ్జీలు తెప్పించారు. ‘జమునా, తినండి ‘ అన్నారు. నేను మొదటిసారిగా తినటం ఆ బజ్జీలు. కొరికీ కొరకగానే నోరు మండిపోయింది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి… నాకు అప్పుడే తెలిసింది అవి పచ్చి మిర్చి బజ్జీలు అని … అవి నాకు అలవాటు లేదు అని తెలియగానే ఆయన కూడా ఖంగారు పడ్డా రను కోండి. …. అలా అప్పుడప్పుడు ఆయన తన అలవాట్లు అభ్యాసాలు చెప్పేవారు.
… తెల్లవారుఝామున మూడు గంటలకి లేస్తారు. దంతధావనం చేశాక, ఒక చుట్ట కాలుస్తారు… అదయ్యాక, బస్‌కీలు, యోగ …. అప్పుడు ఒక మల్లుడు వచ్చి ఆయన ఒంటికి నూనె మర్దనా చేసి, ఒళ్ళ్లు పట్టేవాడు. ….స్నానం అయ్యాక ఉదయం అల్పాహారంగా ఒక్కటే కోడి లాగించటం ….ఆరు గంటలకి తనకోసం వచ్చిన నిర్మాతలతో భేటీ కావటం …. “ఇలా చెబుతూ జమున ఎన్.టి.ఆర్ గురించి ఒక విషయాన్ని బాగా నొక్కి చెప్పారు.
“సమయ పాలనలో ఆయన క్రమశిక్షణ అసాధారణమైంది. నేను గానీ, రాజశ్రీ, వాణిశ్రీ వంటి వాళ్ళం మూడు మూడున్నర దశాబ్దాల పాటు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్నామంటే కారణం మమ్మల్ని ప్రభావితం చేసిన ఆయన క్రమశిక్షణే …” తన సత్యభామ పాత్ర గురించీ ఆమె చెప్పారు.
“నేను కృష్ణ భక్తురాలిని. అందుకే సినిమాలో సత్యభామగా అలిగినపుడు, కాలితో ఆయన తలపై (కిరీటంపై) తన్నిన తరువాత మనసంతా పాడైపోయింది. షూట్ అయిపోయాక నేను ఆయనతో నా బాధ చెబితే, ఆయన “It’s all right. All that is part of acting ….” అని నవ్వేశారు. సురేఖ దివాకర్ల, ఎన్.రామకృష్ణ, విజయలక్ష్మి వంటి గాయకులు ఎన్.టి.ఆర్ చిత్రాలలోని పాటలతో ఆసాంతం ఆకట్టుకున్నారు.