మలేషియా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్..! ఆ దేశ ప్రభుత్వం భారత టూరిస్టుల కోసం వీసా ఆన్ అరైవల్ అవకాశాన్ని కల్పించింది. జూన్ 1 నుంచి ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. దీంతో.. ముందస్తు వీసాకు బదులుగా మలేషియాకు వెళ్లాక భారతీయులు ఈ వీసా పొందవచ్చు. ఇందుకోసం 46 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టూరిస్టులు తమ వద్ద 500 డాలర్ల క్యాష్ ఉందని లేదా బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుగు ప్రయాణ టిక్కెట్టు ఉన్న వారు 15 రోజుల పాటు ఆ దేశంలో గడపవచ్చు. మార్చి 1 నుంచి మలేషియా ప్రభుత్వం టీకాలు తీసుకున్న టూరిస్టులను క్వారంటైన్ లేకుండానే దేశంలోకి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన్న నిబంధన కూడా తొలగించింది. మరోవైపు.. మలేషియాలో ఈవీసా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.