తెలుగు చిత్రసీమ ఓ పుష్పక విమానం. ఎంతమంది ఉన్నా, మరొకరికి చోటు ఉంటుంది. కథానాయికల విషయంలో మరీనూ. రోజుకో కొత్తమ్మాయి చిత్రసీమలో అడుగుపెడుతూనే ఉంటుంది. అందుకే కథానాయికల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. అయితే ఈ ‘పోటీ’ అనే పదం రకుల్‌ప్రీత్ సింగ్‌కి అస్సలు నచ్చడం లేదట. ‘‘పోటీ గురించి, రేసుల గురించీ మాట్లాడితే నాకు నచ్చదు. ఎందుకంటే ఇదేమీ పరుగు పందెం కాదు. నేను రేసుగుర్రాన్ని కానే కాదు. చిత్రసీమలో ప్రతి ఒక్కరికీ ఓ స్థానం ఉంటుంది. వాళ్లకొచ్చిన అవకాశాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి వాళ్ల స్థాయి మారుతూ ఉంటుంది. హిట్ సినిమాలో ఛాన్సు రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఎప్పుడు ఏ సినిమా హిట్టవుతుందో ఎవరు చెప్పగలరు? చేతిలో హిట్లు ఉంటేనే ప్రతిభ ఉన్నట్టా? లేకపోతే… వాళ్లకు నటన చేతకాదనా? ఈ లెక్కలు నాకెప్పటికీ అర్థం కావు. ఇది వరకు నేను కూడా అవకాశాల వెంట పరుగులు పెట్టాను. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది. ప్రతిభను వెదుక్కొంటూ అవకాశాలు పరుగులు పెట్టే కాలం ఇది. ఎవరికి తగిన సినిమాలు వాళ్లకు వస్తూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.