Business

టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు

టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు

ఒకప్పుడు ఇండియన్‌ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్‌ కారు మార్కెట్‌లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్‌ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆర్‌పీజీ గ్రూపు చైర్మన్‌ హార్ష్‌ గోయెంకా ట్విటర్‌లో స్పందిస్తూ… మిలీనియం ముందు తరం వాళ్లకు అంబాసిడర్‌ గురించి బాగా తెలుసు. అదొక గొప్ప కారు మాత్రమే కాదు. కుటుంబంలో ఓ భాగం. అలాంటి కారు మళ్లీ తిరిగి రావడం సంతోషకరం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక మరికొందరు నెటిజన్లు అంబాసిడర్‌ కారు పుట్టుపూర్వోత్తరాలను తవ్వి తీస్తున్నారు. చాలా మందికి తెలియని విషయాలను నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. అంబాసిడర్‌ కారును తయారు చేసింది హిందూస్థాన్‌ మోటార్స్‌ అనే సంస్థ. పేరు వినగానే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటాం. కానీ హిందూస్థాన్‌ మోటాన్స్‌ ప్రైవేటు సంస్థ. దాని వ్యవస్థాపకుడు సీకే బిర్లా. అంటూ అంబాసిడర్‌ కారు గురించి ఇప్పటి తరానికి తెలియని విషయాలు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే టాటాలకే కాదు బిర్లాలకు కూడా కార్ల కంపెనీ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.హిందూస్థాన్‌ మోటార్‌ సం‍స్థ ఫ్రెంచ్‌కి చెందిన ప్యూగట్‌ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం త్వరలో సరికొత్త హంగులతో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారుగా అంబాసిడర్‌ను ఇండియాలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఒకప్పటి ఐకానిక్‌ కారు మళ్లీ మార్కెట్‌లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు చాలా మంది.